జూలై 3 నుంచి సెయిలింగ్ వీక్
సాక్షి, హైదరాబాద్: చరిత్రాత్మక హుస్సేన్‌సాగర్ జలాల్లో సెయిలింగ్ చాంపియన్‌షిప్ క్రీడా ప్రియులను అలరించనుంది. దేశంలోనే అతిపెద్ద సెయిలింగ్ చాంపియన్‌షిప్‌కు హుస్సేన్ సాగర్ వేదిక కాబోతోంది. జూలై 3 నుంచి 8 వరకు హైదరాబాద్ సెయిలింగ్ వీక్ పేరుతో సీనియర్ మల్టీక్లాస్ సెయిలింగ్ చాంపియన్‌షిప్ జరగనుంది. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ సహకారంతో నిర్వహిస్తోన్న ఈ పోటీలను రాష్ట్ర గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ సోమవారం ప్రారంభించనున్నారు. ఈ మేరకు టోర్నమెంట్ వివరాలను ఈఎంఈ సెయిలింగ్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు, మేజర్ జనరల్ పరమ్‌జీత్ సింగ్ శుక్రవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు.
గతేడాది జూలైలో జరిగిన సెయిలింగ్ చాంపియన్‌షిప్‌లో 175 ఎంట్రీలు నమోదవగా... ఈసారి 195 ఎంట్రీలు వచ్చాయని చెప్పా రు. ఎంట్రీలకు గడువు నేటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో మరింత మంది టోర్నీలో పాల్గొనే అవకాశముందని ఆయన అన్నారు. టోర్నీ కోసం 195 బోట్లు అందుబాటులో ఉన్నాయన్న ఆయన 95 రేసులను నిర్వహిస్తామని చెప్పారు. ఒలిం పిక్స్, ఆసియా గేమ్స్‌లో పాల్గొన్న ప్రముఖ సెయిలర్లు ఈ పోటీల్లో పాల్గొనేందుకు తరలి వస్తున్నారన్నారు. ఒలింపిక్స్ క్రీడల్లో ఏడు రకాల సెయిలింగ్ పోటీలు జరుగుతుండగా, హైదరాబాద్ సెయిలింగ్ వీక్‌లో 5 రకాల పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. ‘హెవీ వెయిట్ సింగిల్ హాండ్లర్’ క్లాస్ పోటీలను తొలిసారిగా ఇక్కడ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సెయిలింగ్ పోటీలతో సికింద్రాబాద్ సెయిలింగ్ క్లబ్‌కు 25 ఏళ్ల అనుబంధముందని క్లబ్ ప్రతినిధి ప్రద్యుమ్న గుర్తు చేశారు. ఈసారి పోటీల్లో 22 మంది మహిళా సెయిలర్లు పాల్గొంటున్నారు. రెగెట్టా (సిరీస్ ఆఫ్ బోట్ రేస్ ఈవెంట్) విభాగంలో అత్యధికంగా 75 ఎంట్రీలు వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు.