స్వదేశానికి పయనం కానున్న డాషింగ్ ఓపెనర్ వార్నర్ ఆఖరి మెరుపులు చూపాడు. హైదరాబాద్ భారీస్కోరు చేసి గెలిచింది. సొంతగడ్డపై సన్‌రైజర్స్ ఆట విజయంతో ముగిసింది. సోమవారం అన్నీ అలా కలిసొచ్చాయి. ప్లేఆఫ్ బాటలో నిలబెట్టాయి. ఎటొచ్చి పంజాబే టాస్ నుంచి కష్టాలను కొనితెచ్చుకుంది. ప్రత్యర్థికి బ్యాటింగ్ అప్పజెప్పి ఓవర్ ఓవర్‌కూ కష్టపడింది. ప్లేఆఫ్ ఆవకాశాలను క్లిష్టం చేసుకుంది.
సాక్షి, హైదరాబాద్: రెండు వరుస పరాజయాలకు బ్రేక్ వేస్తూ సొంతగడ్డపై ఆడిన ఆఖరి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ గెలిచింది. ప్లేఆఫ్ రేసులో నిలిచింది. సోమవారం జరిగిన కీలకమైన మ్యాచ్‌లో హైదరాబాద్ 45 పరుగుల తేడాతో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌పై ఘనవిజయం సాధించింది. మొదట సన్‌రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 212 పరుగుల భారీస్కోరు చేసింది. వార్నర్ (56 బంతుల్లో 81; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధసెంచరీ సాధించాడు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన పంజాబ్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 167 పరుగులు చేసి ఓడింది. లోకేశ్ రాహుల్ (56 బంతుల్లో 79; 4 ఫోర్లు, 5 సిక్స్‌లు) ఒక్కడే పోరాడాడు. రషీద్ ఖాన్, ఖలీల్ అహ్మద్ చెరో 3 వికెట్లు తీశారు. వార్నర్ కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది.
రైజింగ్ ఆరంభం...
టాస్ నెగ్గిన పంజాబ్ ఫీల్డింగ్‌కు మొగ్గు చూపడమే సన్‌రైజర్స్‌కు వరమైంది. బ్యాటింగ్‌కు కలిసొచ్చిన పిచ్‌పై హైదరాబాద్ టాపార్డర్ అదరగొట్టింది. వార్నర్‌కు జతగా బరిలోకి దిగిన వృద్ధిమాన్ సాహా క్రీజులో ఉన్నంత సేపు ధాటిగా ఆడాడు. ఆరంభం నుంచే ఇద్దరు బౌండరీలు బాదడంతో 4 ఓవర్లలోనే జట్టు స్కోరు 50 దాటింది. ఐదో ఓవర్ వేసిన షమీ బౌలింగ్‌లో సాహా వరుసగా ఫోర్, సిక్స్ కొట్టాడు. మరుసటి ఓవర్లో వార్నర్ భారీ సిక్సర్ బాదడంతో పవర్‌ప్లే ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 77 పరుగులు చేసింది. అయితే తర్వాతి ఓవర్లోనే మురుగన్ అశ్విన్... సాహా (13 బంతుల్లో 28; 3 ఫోర్లు, 1 సిక్స్)జోరుకు కళ్లెం వేశాడు. దీంతో 78 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యం ముగిసింది. తర్వాత వచ్చిన మనీశ్ పాండే అండతో వార్నర్ తన దూకుడు కొనసాగించాడు. పదో ఓవర్లోనే జట్టు 100 పరుగులు చేయగా... వార్నర్ ఫిఫ్టీ 38 బంతుల్లో పూర్తయింది.
రాణించిన పాండే...
చేతిలో 9 వికెట్లుండటం, పిచ్ పూర్తిగా బ్యాటింగ్‌కు సహకరించడంతో వార్నర్, మనీశ్ పాండే జోడీ పంజాబ్ బౌలర్లపై పరుగుల ప్రతాపం చూపించింది. దీంతో ఓవర్‌కు 10 పరుగుల సగటుతో స్కోరు బోర్డు కదిలింది. ఇద్దరు కలిసి బౌండరీ లేదంటే సిక్స్ లేకుండా ఏ ఓవర్‌నూ విడిచిపెట్టలేదు. 15వ ఓవర్లో వార్నర్, పాండే ఫోర్ బాదడంతో జట్టు స్కోరు 150 పరుగులకు చేరింది. చకచకా పరుగులు సాధిస్తున్న ఈ జోడీకి 16వ ఓవర్లో షాక్ తగిలింది. అశ్విన్ బౌలింగ్‌లో మొదట పాండే (25 బంతుల్లో 36; 3 ఫోర్లు, 1 సిక్స్), తర్వాత వార్నర్ నిష్క్రమించారు. దీంతో 82 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. మూడో బంతిని పాండే ఫైన్ లెగ్ దిశగా షాట్ ఆడగా అక్కడే కాచుకున్న షమీ చక్కగా క్యాచ్ అందుకున్నాడు. ఆఖరి బంతిని ఆఫ్‌సైడ్‌లో కొట్టిన వార్నర్ ముజీబ్ చేతికి చిక్కాడు.
4, 6, 1, 6, 1, 1, 6, 1
అశ్విన్, షమీ 16, 17 ఓవర్లలో కలిపి 10 పరుగులే ఇచ్చారు. అయితే ఈ రెండు ఓవర్ల కట్టడి కాస్తా 18వ ఓవర్లో కట్టలు తెంచుకుంది. ముజీబుర్ రహ్మాన్ వేసిన ఆ ఓవర్లో విలియమ్సన్, నబీ సిక్సర్లతో హోరెత్తించారు. తొలి రెండు బంతుల్ని కెప్టెన్ కేన్ ఫోర్, సిక్స్‌గా బాదేశాడు. తర్వాత నబీ రెండు సిక్సర్లు కొట్టాడు. బౌలర్ కూడా 2 వైడ్లు వేసుకోవడంతో ఈ ఓవర్లో ఏకంగా 26 పరుగులు లభించాయి. ఆ వెంటనే షమీ 19వ ఓవర్ వేసి విలియమ్సన్ (7 బంతుల్లో 14; ఫోర్, సిక్స్), నబీ (10 బంతుల్లో 20; 2 సిక్స్‌లు)లను ఔట్ చేయడంతో పాటు ఏడే పరుగులు ఇచ్చాడు. విజయ్ శంకర్ క్రీజులోకి రాగా జట్టు స్కోరు 200 దాటింది. ఇక ఆఖరి ఓవర్ వేసిన అర్‡్షదీప్‌సింగ్ తొలి బంతికి రషీద్ ఖాన్‌ను ఔట్ చేసి 10 పరుగులు సమర్పించాడు. ఈ రెండు డెత్ ఓవర్లలో 17 పరుగులే రాగా సన్‌రైజర్స్ మూడు వికెట్లను కోల్పోయింది.
గేల్... ఒక ఫోర్, ఔట్!
భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పంజాబ్‌కు క్రిస్ గేల్ (4) ఔట్ రూపంలో తొలుతే ఎదురుదెబ్బ తగిలింది. తొలి ఓవర్లో ఫోర్ కొట్టిన గేల్ ఆట అదేస్కోరు మీద ముగిసింది. ఖలీల్ అహ్మద్ వేసిన మూడో ఓవర్ తొలిబంతికి షాట్ ఆడే ప్రయత్నంలో అతను పాండేకు క్యాచ్ ఇచ్చాడు. తర్వాత రాహుల్‌కు మయాంక్ అగర్వాల్ జతయ్యాడు. ఇద్దరు కాసేపు బౌండరీలతో ఇన్నింగ్స్‌ను నడిపించారు. పవర్‌ప్లేలో వికెట్ నష్టానికి 44 పరుగులు చేసింది. వేగం పెంచే దశలో రషీద్ బౌలింగ్‌లో సిక్సర్ బాదిన మయాంక్ (27) మరుసటి బంతికే నిష్క్రమించాడు. దీంతో 71 పరుగుల వద్ద రెండో వికెట్ కూలింది. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన పూరన్ (10 బంతుల్లో 21; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) వేగంగా ఆడి... ఆ వేగంలోనే వికెట్‌ను పారేసుకున్నాడు. కాసేపటికే మిల్లర్ (11), అశ్విన్ (0)లను వరుస బంతుల్లో రషీద్ ఔట్ చేశాడు. మరోవైపు దూకుడుతో రాహుల్ రెండు వరుస సిక్సర్లు బాది 38 బంతుల్లో అర్ధసెంచరీ చేశాడు. అనంతరం కూడా రాహుల్ పోరాటం కొనసాగింది కానీ... పంజాబ్ లక్ష్యానికి మాత్రం దూరమైంది. 19వ ఓవర్లో భారీ షాట్‌కు యత్నించిన రాహుల్... విలియమ్సన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. సందీప్ శర్మ ఆఖరి ఓవర్లో ప్రభ్‌సిమ్రన్ సింగ్ (16), ముజీబుర్ రహ్మాన్ (0) ఔటయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment