పంజాబ్‌ ప్రతాపం | KXIP beat Rajasthan Royals | Sakshi
Sakshi News home page

పంజాబ్‌ ప్రతాపం

Published Wed, Apr 17 2019 12:59 AM | Last Updated on Wed, Apr 17 2019 12:20 PM

KXIP beat  Rajasthan Royals - Sakshi

సొంతగడ్డపై కింగ్స్‌ ఎలెవన్‌ ఆల్‌రౌండ్‌ ‘పంజా’కు రాజస్తాన్‌ రాయల్స్‌ తోకముడిచింది. బ్యాటింగ్‌లో టాపార్డర్‌ నిలకడను ప్రదర్శిస్తే... చివర్లో అశ్విన్‌ మెరుపు ఇన్నింగ్స్‌తో అదుర్స్‌ అనిపించాడు. ఆ తర్వాత బౌలింగ్‌లో పంజాబ్‌ పేసర్లు, స్పిన్నర్లు రాయల్స్‌ను దెబ్బ మీద దెబ్బ తీశారు. ఒక దశలో 10 ఓవర్లు ముగిసేసమయానికి పటిష్టస్థితిలో ఉన్నట్లే కనిపించిన రాజస్తాన్‌ మ్యాచ్‌ నడుస్తున్న కొద్దీ ఒత్తిడిలోకి కూరుకొని వికెట్లను సమర్పించుకుని కంగుతింది.  

మొహాలి: కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో ఐపీఎల్‌లో ఐదో విజయాన్ని సాధించింది. మంగళవారం జరిగిన పోరులో పంజాబ్‌ 12 పరుగుల తేడాతో రాజస్తాన్‌ రాయల్స్‌పై నెగ్గింది. 8 మ్యాచ్‌లాడిన రాజస్తాన్‌కు ఇది ఆరో ఓటమి కావడంతో క్వాలిఫయర్‌ అవకాశాల్ని క్లిష్టం చేసుకుంది. మొదట కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 182 పరుగులు చేసింది. లోకేశ్‌ రాహుల్‌ (47 బంతుల్లో 52; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), మిల్లర్‌ (27 బంతుల్లో 40; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), కెప్టెన్‌ అశ్విన్‌ (4 బంతుల్లో 17 నాటౌట్‌; ఫోర్, 2 సిక్స్‌లు) మెరిశారు. ఆర్చర్‌కు 3 వికెట్లు దక్కాయి. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన రాజస్తాన్‌ రాయల్స్‌ 20 ఓవర్లలో 7 వికెట్లకు 170 పరుగులు చేసి ఓడింది. రాహుల్‌ త్రిపాఠి (45 బంతుల్లో 50; 4 ఫోర్లు) అర్ధసెంచరీ చేశాడు. అర్షదీప్, అశ్విన్, షమీ తలా 2 వికెట్లు తీశారు. అశ్విన్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు దక్కింది.  

లోకేశ్‌ రాహుల్‌ ఫిఫ్టీ... 
టాస్‌ నెగ్గిన రాజస్తాన్‌ ఫీల్డింగ్‌కు మొగ్గు చూపింది. దీంతో గేల్‌తో కలిసి రాహుల్‌ కింగ్స్‌ ఎలెవన్‌ ఇన్నింగ్స్‌కు శ్రీకారం చుట్టాడు. ఉనాద్కట్‌ వేసిన రెండో ఓవర్లో క్రిస్‌ గేల్‌ సిక్సర్లు మొదలయ్యాయి. రెండు వరుస 6, 6లతో 12 పరుగులు వచ్చాయి. తర్వాత కులకర్ణి వేసిన ఐదో ఓవర్లో 4, 6 బాదాడు. అయితే మరుసటి ఓవర్లోనే గేల్‌ (22 బంతుల్లో 30; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) జోరుకు ఆర్చర్‌ బ్రేకులేశాడు. పవర్‌ ప్లేలో పంజాబ్‌ 39/1 స్కోరు చేసింది. ఆ తర్వాత వచ్చిన మయాంక్‌ అగర్వాల్‌ దూకుడుగా ఆడే ప్రయత్నం చేసి విఫలమయ్యాడు. ఇష్‌ సోధి ఓవర్లో భారీ సిక్సర్‌ బాదిన మయాంక్, ఆ తర్వాత గోపాల్‌ వరుస బంతుల్ని ఫోర్, సిక్సర్‌గా మలిచాడు. కానీ ఈ జోరూ ఎంతో సేపు నిలువలేదు. ఇష్‌ సోధి ఇన్నింగ్స్‌ తొమ్మిదో ఓవర్లో అతని ఆట ముగించాడు.

తర్వాత మిల్లర్‌ క్రీజులోకి రాగా... 10 ఓవర్లు ముగిసేసరికి కింగ్స్‌ 75/2 స్కోరు చేసింది. ఆ తర్వాత మూడు ఓవర్ల పాటు పంజాబ్‌ ఇన్నింగ్స్‌ నెమ్మదించింది. 14వ ఓవర్లో జట్టు స్కోరు వందకు చేరింది. ఇష్‌ సోధి వేసిన అదే ఓవర్లో రాహుల్, మిల్లర్‌ చెరో సిక్సర్‌ కొట్టడంతో 19 పరుగులు లభించాయి. ఆ తర్వాత ఉనాద్కట్‌ బౌలింగ్‌లోనూ ఇద్దరు బ్యాట్‌ ఝళిపించడంతో మరో 20 పరుగులు జతయ్యాయి. ఈ క్రమంలో 45 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేసుకున్న రాహుల్‌ ఎంతోసేపు నిలువలేదు. ఉనాద్కట్‌ బౌలింగ్‌లో నిష్క్రమించాడు. స్కోరు పెరగాల్సిన 19వ ఓవర్లో ఆర్చర్‌ 3 పరుగులే ఇచ్చి పూరన్‌ (5), మన్‌దీప్‌ (0) వికెట్లను తీశాడు. కులకర్ణి ఆఖరి ఓవర్‌ తొలి బంతికి మిల్లర్‌ ఔటైనా... కెప్టెన్‌ అశ్విన్‌ ఒక ఫోర్, 2 సిక్సర్లు బాదడంతో స్కోరు 180 దాటింది. 

రాణించిన త్రిపాఠి... 
ఓపెనర్‌గా ఆకట్టుకోలేకపోయిన కెప్టెన్‌ రహానే ... ఈసారి బట్లర్‌కు జతగా రాహుల్‌ త్రిపాఠిని పంపాడు. ఇద్దరు లక్ష్యానికి తగ్గట్లే ఇన్నింగ్స్‌ను వేగంగా నడిపించారు. అయితే జోరు మీదున్న బట్లర్‌ (17 బంతుల్లో 23; 1 ఫోర్, 2 సిక్స్‌లు)ను ఐదో ఓవర్లో అర్షదీప్‌ ఔట్‌ చేశాడు. తర్వాత సంజూ సామ్సన్, త్రిపాఠికి జతయ్యాడు. పవర్‌ ప్లేలో రాజస్తాన్‌ వికెట్‌ నష్టానికి 54 పరుగులు చేసింది. ఇద్దరు క్రీజులో ఉన్నంతసేపు స్కోరు వేగం తగ్గకుండా జాగ్రత్తగా ఆడారు. రెండో వికెట్‌కు 59 పరుగులు జోడించాక సామ్సన్‌ (21 బంతుల్లో 27; 2 ఫోర్లు)ను అశ్విన్‌ బౌల్డ్‌ చేశాడు. 97 పరుగుల వద్ద రెండో వికెట్‌ కోల్పోయింది. ఇక అక్కడి నుంచి రాజస్తాన్‌ ఆట తిరోగమించింది. రాజస్తాన్‌ విజయానికి 24 బంతుల్లో 56 పరుగులు కావాలి. అయితే టర్నర్‌ (0), ఆర్చర్‌ (1), కెప్టెన్‌ రహానే (21 బంతుల్లో 26; 1 ఫోర్‌)లను వెంటవెంటనే ఔట్‌ కావడంతో రాజస్తాన్‌ ఆశలు ఆవిరయ్యాయి. చివర్లో స్టువర్ట్‌ బిన్నీ (11 బంతుల్లో 33 నాటౌట్‌; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపులు మెరిపించినా ఫలితం లేకపోయింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement