హైదరాబాద్‌లో దిగ్గజాలకు సన్మానం
⇒ఐపీఎల్ ప్రారంభోత్సవంలో బీసీసీఐ సత్కారం
⇒సచిన్, గంగూలీ, ద్రవిడ్, లక్ష్మణ్, సెహ్వాగ్‌లకు గౌరవం
న్యూఢిల్లీ: భారత క్రికెట్‌కు విశేష సేవలందించిన ఐదుగురు దిగ్గజాలు (ఫ్యాబ్ ఫైవ్) సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రవిడ్, వీవీఎస్ లక్ష్మణ్, వీరేంద్ర సెహ్వాగ్‌లను ఘనంగా సత్కరించాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నిర్ణయించింది. ‘హైదరాబాద్‌లో వచ్చే నెల 5న జరిగే ఐపీఎల్ ప్రారంభ వేడుకలో ఈ ఐదుగురు దిగ్గజాలను సన్మానించాలని గురువారం ఐపీఎల్ పాలక మండలి సమావేశంలో నిర్ణయించాం’ అని ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా వెల్లడించారు. ఈ ఐదుగురు ఆటగాళ్లలో లక్ష్మణ్ మినహా మిగతా నలుగురు భారత జట్టుకు సారథ్యం వహించారు. ప్రస్తుత కోచ్ అనిల్ కుంబ్లేకు కూడా వీరితో పాటు సమాన స్థాయి ఉన్నప్పటికీ సత్కార జాబితాలో ఆయన పేరు లేకపోవడం గమనార్హం.
ముగిసిన మహిళా క్రికెటర్ల నిరీక్షణ...
ఎంతో కాలం నుంచి మహిళా క్రికెటర్లు ఎదురుచూస్తున్న ‘వన్ టైమ్ ఎక్స్‌గ్రేషియా’ మొత్తాన్ని ఇవ్వాలని బీసీసీఐ నిర్ణయించింది. బీసీసీఐ నూతన పాలక కమిటీ సభ్యురాలు డయానా ఎడుల్జీ విజ్ఞప్తి మేరకు ఆయా క్రికెటర్ల స్థానిక ఐపీఎల్ వేదికల్లో ఈ ఎక్స్‌గ్రేషియాకు సంబంధించిన చెక్‌లను అందజేయనున్నారు.