
'నా తదుపరి ఫైట్ పైనే దృష్టి'
లండన్: ప్రొఫెషనల్ బాక్సింగ్ పోరులో భాగంగా వచ్చే వారం డబ్లిన్ లో జరిగే తన రెండో బౌట్ పైనే పూర్తిగా దృష్టి నిలిపినట్లు భారత బాక్సర్ విజేందర్ సింగ్ స్పష్టం చేశాడు. గురువారం(అక్టోబర్ 29) నాడు ముఫ్పైవ ఒడిలోకి అడుగుపెట్టిన విజేందర్.. ఈ పుట్టిన రోజు వేడుకలకు భారత్ లోని స్నేహితులతో పాటు తన సహచరులను మిస్ అవుతున్నట్లు పేర్కొన్నాడు. ఇక్కడ బాక్సర్లు, ట్రైనర్లు తన కోసం ప్రత్యేక కేక్ ను తయారు చేయించి అభినందలు తెలిపారని ఆనందం వ్యక్తం చేశాడు.
డబ్లిన్ లో ఉన్న భారత దేశ ప్రజల నుంచి తనకు సహకారం ఉంటుందని ఆశిస్తున్నట్లు తెలిపాడు. 'వచ్చే శనివారం జరిగే రెండో బౌట్ కోసం ప్రాక్టీస్ లో నిమగ్నమయ్యా. ఇప్పుడు నా తదుపరి దృష్టి ఆ పోరుపైనే. గత రాత్రి హౌజ్ ఆఫ్ కామన్స్ లో ఎంపీ కైత్ వేత్ ను కలిశా. నేను రెండో బౌట్ లో విజయం సాధించాలని కోరుతూ ముందుగా ఆయన నుంచి అభినందలను అందుకున్నా' అని విజేందర్ తెలిపాడు. నవంబర్ ఏడవ తేదీన డబ్లిన్ జరిగే పోరులో బ్రిటన్‌కు చెందిన డీన్ జిలెన్ తో విజేందర్ తలపడతాడు. విజేందర్ సింగ్ పాల్గొనబోయే రెండో బౌట్ వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 30న తేదీన ఇరువురి మధ్య పోరు జరగాల్సి ఉంది. అయితే కొన్ని కారణాల వల్ల ఆ బౌట్ నవంబర్ 7 వ తేదీకి వాయిదా పడింది.