జోరు కొనసాగిస్తాడా..?
⇒ నేడు బాక్సర్ విజేందర్ పోరు
⇒ తొలి రౌండ్‌లోనే ఓడిస్తా: ప్రత్యర్థి హోర్వత్
లివర్‌పూల్: గతేడాది ప్రొఫెషనల్ బాక్సర్‌గా మారిన విజేందర్ సింగ్‌కు ఇప్పటిదాకా ఓటమి లేదు. ఇప్పటిదాకా మూడు బౌట్‌లలో తలపడిన అతను అన్నీ నాకౌట్ విజయాలనే సాధించి అదరగొట్టాడు. ఈ నేపథ్యంలో ఈ స్టార్ బాక్సర్ నేడు (శనివారం) నాలుగో ఫైట్‌కు సిద్ధమవుతున్నాడు. అతనికి ఈ ఏడాది ఇదే తొలి ఫైట్ అవడంతో ఇప్పటిదాకా కనబరిచిన జోరునే మరోసారి చూపి సీజన్‌ను విజయంతో ఆరంభించాలని భావిస్తున్నాడు. ఇక ఈ బౌట్‌లో విజేందర్ ప్రత్యర్థిగా హంగేరికి చెందిన అలెగ్జాండర్ హోర్వత్ బరిలోకి దిగుతున్నాడు. విజేందర్‌కన్నా అతను అనుభవశాలి. అలాగే ఈ పోటీ కోసం పటిష్టంగా తయారయ్యేందుకు పాము ర క్తం తీసుకుంటున్నట్టు 20 ఏళ్ల హోర్వత్ ఇప్పటికే ప్రకటించి ఆసక్తిని మరింత పెంచాడు.
ఏడు ఫైట్లలో తలపడిన ఈ యువ బాక్సర్ ఐదింటిలో నెగ్గాడు. అలాగే 31 రౌండ్లపాటు ఆడిన అనుభవం ఉంది. అందుకే ఈ బౌట్‌ను అంత తేలిగ్గా తీసుకోవడం ఇష్టం లేని 30 ఏళ్ల విజేందర్ కూడా రోజుకు 10 గంటలపాటు ప్రాక్టీస్‌తో చెమటోడ్చుతున్నాడు. నిజానికి ఈ బౌట్ గత నెలలోనే జరగాల్సి ఉన్నా కొన్ని సాంకేతిక కారణాల వల్ల వాయిదా పడింది.
నా విజయాల రికార్డును కొనసాగించాల్సిన అవసరం ఉంది. అందుకే హోర్వత్‌పై పైచేయి సాధించడమే కాకుండా ఆ తర్వాత హారోలో జరిగే ఫైట్ కూడా నెగ్గి భారత్‌లో టైటిల్ పోరుకు సిద్ధమవ్వాలి. హోర్వత్ కచ్చితంగా గట్టి పోటీదారు. నాకన్నా అనుభవం కలిగి ఉన్నా నా పంచ్‌లకు అతడు ఎక్కువ సేపు రింగ్‌లో నిలబడడనే అనుకుంటున్నాను’ అని విజేందర్ ధీమా వ్యక్తం చేశాడు.
మరోవైపు హోర్వత్ కూడా ఇంతే ఆత్మవిశ్వాసాన్ని కనబరుస్తున్నాడు. తన ముందు విజేందర్ గట్టి ప్రత్యర్థే కాదని అంటున్నాడు. అతడికి మూడు విజయాలే ఉన్నా, తనకు ఐదున్నాయని గుర్తుచేశాడు. ‘ఇంతకుముందు విజేందర్ బౌట్స్‌ను వీడియోలో చూశాను. నా ప్రణాళికలు అతడికి బాక్సింగ్ అంటే ఏంటో నేర్పుతాయి. అతడిలో కొన్ని బలహీనతలు గమనించాను. మొదటి లేక రెండో రౌండ్‌లోనే మట్టికరిపించి స్వదేశానికి వెళ్లే ముందు తొలి ఓటమిని అందిస్తాను’ అని హోర్వత్ సవాల్ విసిరాడు.