విజేందర్ సింగ్పై కేసు నమోదు
న్యూఢిల్లీ: భారత ప్రొఫెషనల్ బాక్సర్ విజేందర్ సింగ్ వివాదంలో చిక్కుకున్నాడు. ఇటీవల జరిగిన డబ్యూబీవో ఆసియా పసిఫిక్ సూపర్ మిడిల్వెయిట్ చాంపియన్షిప్ను సాధించిన విజేందర్ ఆ పోరు సందర్భంగా మువ్వన్నెల రంగుతో ఉన్న షార్ట్ ను ధరించడమే వివాదానికి కారణమైంది. దీనిపై ఢిల్లీకి చెందిన ఉల్లాస్ అనే వ్యక్తి స్థానిక అశోక్ నగర్ పోలీస్ స్టేషన్లో సోమవారం ఫిర్యాదు చేశాడు. ఇలా త్రివర్ణ రంగులతో ఉన్న ఒక షార్ట్ను ధరించి పోటీలో పాల్గొనడం భారత జాతీయ జెండాను అవమానపరిచినట్లేనని ఉల్లాస్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ మేరకు విజేందర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు.
శనివారం త్యాగరాజన్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో జరిగిన బౌట్లో విజేందర్ 98-92, 98-92, 100-90తో ఆస్ట్రేలియా బాక్సర్ కెర్రీ హోప్ పై గెలిచి టైటిల్ సాధించాడు. పది రౌండ్ల పాటు జరిగిన బౌట్లో విజేందర్ ఏకపక్ష విజయం నమోదు చేశాడు. అంతకుముందు ప్రొ బాక్సింగ్లో ఆరు బౌట్లను గెలిచిన విజేందర్.. స్వదేశంలో అభిమానుల మధ్య తొలిసారి జరిగిన పోరులో అపూర్వమైన గెలుపును సొంతం చేసుకున్నాడు. కాగా, తాజా వివాదంపై విజేందర్ ఇంకా ఎటువంటి వివరణ ఇవ్వలేదు.