భోపాల్: కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర మధ్యప్రదేశ్‌లోకి ప్రవేశించింది. సెప్టెంబర్ 7న కన్యాకుమారి దగ్గర ప్రారంభమైన ఈ యాత్ర ఇప్పటి వరకు అయిదు రాష్ట్రాల్లో పూర్తయ్యింది. రోజుకీ సగటున 20-25 కిలోమీటర్ల మేరకు పాదయాత్ర చేస్తున్నారు. భిన్న నేపథ్యాలు, భిన్న రాష్ట్రాలకు చెందిన వారు ఈ యాత్రలో పాల్గొంటున్నారు. మొత్తం 12 రాష్ట్రల్లో యాత్ర కొనసాగనుంది. 150 రోజుల్లో ఆయన 3,500 కిలోమీటర్లు ప్రయాణించనున్నారు. వచ్చే ఫిబ్రవరిలో జమ్ముకశ్మీర్ రాజధాని శ్రీనగర్‌లో జోడో యాత్ర ముగుస్తుంది.
రాహుల్ జోడో యాత్రకు విశేష స్పందన లభిస్తోంది. ఏ రాష్ట్రంలో అడుగుపెడితే అక్కడి ప్రముఖులు, కాంగ్రెస్ నాయకులు, నటీనటులు పాల్గొని జోడో యాత్రలో జోష్ నింపుతున్నారు. వీరే కాక వేలాది మంది విద్యార్థులు, యువత, మధ్య వయస్కులు, మహిళలు, ఉద్యమకారులు.. ఇలా ఎందరో రాహుల్ చేపట్టిన యాత్రలో పాల్గొంటున్నారు. తాజాగా ఒలంపిక్ మెడలిస్ట్, బాక్సర్, కాంగ్రెస్ నేత విజేందర్ సింగ్ జోడో యాత్రలో జాయిన్ అయ్యారు.
మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్‌లో కాంగ్రెస్ నాయకుడితో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు. రాహుల్‌తో మాట్లాడుకుంటూ కొన్ని కిలోమీటర్లు నడిచారు. ఆ సమయంలో ఇద్దరూ హర్యాన్వీ స్టైల్‌లో తమ మీసాలు తిప్పారు. బాక్సింగ్ పంచ్ ఇస్తున్నట్లు కూడా ఫోజు ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియోను కాంగ్రెస్ తన అధికారిక ట్విటర్‌లో పోస్టు చేసింది. ఈ వీడియోలో రాహుల్, విజేందర్ సింగ్‌తో పాటు పక్కన ప్రియాంక కూడా కనిపిస్తుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
बॉक्सिंग रिंग के अजेय योद्धा @boxervijender आज आपने #BharatJodoYatra में सड़क पर उतरकर खेत-खलिहान और युवाओं की आवाज़ को ताकत दी है।
— Congress (@INCIndia) November 25, 2022
शुक्रिया आपका...🙏🏻 pic.twitter.com/4oZOFqPdp9
హర్యానాలోని భివాని జిల్లాకు చెందిన విజేందర్ సింగ్.. గత లోక్‌సభ ఎన్నికల్లో దక్షిణ ఢిల్లీ సీటు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో అతను బ్రాంజ్ మెడల్ గెలిచాడు. ఒలింపిక్స్‌లో పతకం గెలుచుకున్న తొలి భారతీయ బాక్సర్‌గా నలిచారు. కామన్వెల్త్ గేమ్స్‌లో రెండు రజతాలు, ఒక కాంస్యం కూడా గెలుచుకున్నారు. ప్రస్తుతం ఆయన ప్రొఫెషనల్ బాక్సర్‌గా రాణిస్తూ అనేక దేశాల్లో పోటీల్లో పాల్గొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment