
భద్రత లేకుండా భారత్ కు బోలెడుసార్లు!
భారత్ లో తమ జట్టుకు కల్పించే భద్రతపై పాకిస్థాన్ అధికారులు సవాలక్ష సందేహాలు వ్యక్తంచేసిన నేపథ్యంలో అదే జట్టు సభ్యుడిగా, భారీ భద్రత నడుమ కోల్ కతాలో అడుగు పెట్టిన ఓ ఆటగాడు మాత్రం భద్రతపై భిన్నంగా స్పందించాడు.
కోల్ కతా: భారత్ లో తమ జట్టుకు కల్పించే భద్రతపై పాకిస్థాన్ అధికారులు సవాలక్ష సందేహాలు వ్యక్తంచేసిన నేపథ్యంలో అదే జట్టు సభ్యుడిగా, భారీ భద్రత నడుమ కోల్ కతాలో అడుగు పెట్టిన ఓ ఆటగాడు మాత్రం భద్రతపై భిన్నంగా స్పందించాడు. అతనెవరో ఈ పాటికే మీరు ఊహించి ఉంటారు.. అవును. అతను సానియా మిర్జా భర్త షోయబ్ మాలికే. పాక్ కెప్టెన్ షాహిద్ అఫ్రిదితో కలిసి ఆదివారం ఈడెన్ గార్డెన్ లో మీడియాతో మాట్లాడిన షోయబ్ టోర్నీ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
'భద్రత విషయంలో చాలా చర్చ జరిగింది. నిజానికి భారత్ లో పాకిస్థాన్ జట్టుకు కట్టుదిట్టమైన భద్రత కల్పించారు. అయితే ఎలాంటి భద్రతా లేకుండా నేను చాలాసార్లు ఇండియా వచ్చి, వెళ్లాను. నా సతీమణి సానియా మిర్జాది హైదరాబాద్ అని మీకు తెలుసు కదా' అని షోయబ్ విలేకరులతో అన్నారు. ఆసియా కప్ లో ఓటమిపై స్పందిస్తూ వరల్డ్ కప్ పూర్తిగా భిన్నమైన టోర్నీ అని, సత్తా చాటేందుకు చక్కటి అవకాశంగా భావిస్తున్నట్లు బదులిచ్చారు. పాక్ సారధి అఫ్రిదీ మాట్లాడుతూ భారతీయులు తమను అమితంగా అభిమానిస్తారని, పాకిస్థానీయుల తర్వాత తమ జట్టును అమితంగా ఇష్టపడేది ఇండియన్సే అని పేర్కొన్నారు.