మా క్రికెట్ మ్యాచ్ లు చూడను..!
కొలంబో:2011 వరల్డ్ కప్ లో భాగంగా భారత్-శ్రీలంక జట్ల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ లో ఫిక్సింగ్ జరిగిందంటూ ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేసిన శ్రీలంక మాజీ కెప్టెన్ అర్జున రణతుంగ.. మరొకసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తమ జట్టు ఆడే మ్యాచ్ లను చూడనంటూ కొత్త పల్లవి అందుకున్నాడు. ప్రస్తుతం శ్రీలంక క్రికెట్ పరిపాలనలోఉన్న అసహ్యకర వాతావరణమే తనను తమ మ్యాచ్ లు చూడకుండా చేయడానికి ప్రధానకారణమని రణతుంగ పేర్కొన్నాడు.
'శ్రీలంక క్రికెట్ లో చీదరించుకునే వాతావరణం నెలకొని ఉంది. దాంతో మా జాతీయ జట్టు ఆడే మ్యాచ్ లను చూడాలని అనుకోవడం లేదు. మా జట్టు ఏ సిరీస్ ఆడుతున్నా చూసే ఆసక్తిమాత్రం నాకు లేదు. దక్షిణాఫ్రికా-ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగున్న టెస్టు సిరీస్ ను చూడాలని నిర్ణయించుకున్నా. ఆయా జట్ల మధ్య జరిగే సిరీస్ ను చూస్తున్నా'అని రణతుంగా పేర్కొన్నాడు. శ్రీలంక క్రికెట్ లో ప్రక్షాళన కోసం తాత్కాలిక కమిటీని ఏర్పాటు చేయాలంటూ ఆ దేశ ప్రధాని రాణిల్ విక్రమ్ సింఘేకు రణతుంగా లేఖ రాస్తానని రణతుంగా వెల్లడించారు.