జయవర్ధనే సరిపోడు..!
కొలంబో:చాంపియన్స్ ట్రోఫీ ముగిసిన తరువాత శ్రీలంక క్రికెట్ ప్రధాన కోచ్ పదవికి గ్రాహం ఫోర్డ్ గుడ్ బై చెప్పడంతో ఆ జట్టులో ఒక్కసారిగా అనిశ్చిత ఏర్పడింది. శ్రీలంక క్రికెట్(ఎస్ఎల్సీ) అధ్యక్షుడు తిలంగా సుమతిపాలతో విబేధాల కారణంగా ఉన్నపళంగా కోచ్ పదవి నుంచి ఫోర్డ్ వైదొలిగాడు. ఇప్పుడు ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు ఎస్ఎల్సీ వేట ప్రారంభించింది. అయితే శ్రీలంక క్రికెట్ జట్టుకు కోచ్ గా ఆ దేశ మాజీ క్రికెటర్ జయవర్ధనే ఎంపిక అవుతాడనే వార్తలు తొలుత వినిపించాయి.
ఇప్పటికే కోచ్ గా కొంత అనుభవం సంపాదించిన జయవర్ధనే ఎంపిక ఖాయంగా కనబడింది. కాగా, ఆ వార్తలను తిలంగా సుమతిపాల ఖండించారు. శ్రీలంక ప్రధాన కోచ్ పదవిని చేపట్టడానికి జయవర్దనే ప్రస్తుత అనుభవం సరిపోదని సుమతిపాల అభిప్రాయపడ్డారు. 'మహేలకు సీనియర్ కోచ్ గా కొద్దిపాటి అనుభవం మాత్రమే ఉంది. ట్వంటీ 20 బ్యాటింగ్ కోచ్, ఫీల్డింగ్ కోచ్ గా జయవర్ధనే సెట్ అయ్యే అవకాశం ఉంది. కానీ ప్రధాన కోచ్ రేసులో మాత్రం అతను లేడు'అని సుమతిపాల తేల్చిచెప్పారు.