వాటిని పట్టించుకోను: హార్దిక్
పల్లెకెలె:ఇటీవల శ్రీలంకతో టెస్టు సిరీస్ ద్వారా టెస్టుల్లో అరంగేట్రం చేసిన భారత ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ఆడుతున్న మూడో మ్యాచ్ లోనే సెంచరీ నమోదు చేశాడు. లంకతో చివరిదైన మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన హార్దిక్ 86 బంతుల్లో శతకం పూర్తి చేశాడు. తద్వారా ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చి వేగవంతంగా సెంచరీ చేసిన భారత ఆటగాడిగా నిలిచాడు. మరొకవైపు ఒకే ఓవర్ లో 26 పరుగుల్ని పిండుకుని మరో రికార్డును కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. టెస్టు ఫార్మాట్ లో ఒక ఓవర్ లో అత్యధిక పరుగుల్ని సాధించిన భారత క్రికెటర్ గా గుర్తింపు సాధించాడు.
అయితే ఈ రికార్డుల్ని తన అస్సలు పట్టించుకోనని అంటున్నాడు హార్దిక్. తనకు వ్యక్తిగత రికార్డులు, మైలురాళ్లు అవసరం లేదని, జట్టు ప్రయోజనాలనే ముఖ్యమన్నాడు. ఆ రికార్డుల గురించి ఆలోచించనని అంటున్నాడు. 'నా దృష్టంతా గేమ్ పైనే. ఎలా ఆడాలనేది మాత్రమే నా ప్రణాళికలో ఉంటుంది. జట్టు కోసం ఏమి చేయగలను అనేది మాత్రమే ఆలోచిస్తా. భారత మాజీ ఆల్ రౌండర్ కపిల్ దేవ్ సాధించిన దానిలో కనీసం 10 శాతం సాధించినా చాలు. అదే నా జీవితంలో చాలా సంతోషాల్ని తీసుకొస్తుంది'అని హార్దిక్ పేర్కొన్నాడు.