ఆ సత్తా హార్దిక్ కు ఉంది: కపిల్ దేవ్
న్యూఢిల్లీ:శ్రీలంకతో మూడు టెస్టుల సిరీస్లో భాగంగా తొలి టెస్టు ద్వారా ఈ ఫార్మాట్ లో అరంగేట్రం చేసిన భారత ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాపై మాజీ ఆటగాడు కపిల్ దేవ్ ప్రశంసలు కురిపించాడు. ప్రస్తుతం టీమిండియా జట్టులో్ రెగ్యులర్ పేసర్ గా సేవలందిస్తున్న హార్దిక్ కు ఒక మంచి ఆల్ రౌండర్ అయ్యే అన్ని లక్షణాలు ఉన్నాయన్నాడు.
'ఇప్పుడు మనకు ఫాస్ట్ బౌలర్లు అందుబాటులో ఉన్నారు. ఒకానొక సమయంలో ఫాస్ట్ బౌలర్లు మనకు లేరు. మన జట్టులో హార్దిక్ పాండ్యానే తీసుకోండి. ప్రస్తుతం స్వదేశంలో హార్దిక్ కీలక ఆటగాడు. విదేశాల్లో ఎక్కువ క్రికెట్ ఆడితే మాత్రం హార్దిక్ లో నమ్మకం పెరుగుతుంది. ప్రధానంగా విదేశాల్లో ఎలా ఆడాలనేది పాండ్యా నేర్చుకోవాల్సి ఉంది. హార్దిక్ లో ఆత్మవిశ్వాసం పెరిగితే మాత్రం బెన్ స్టోక్స్ లాంటి ఆల్ రౌండర్ అవడం ఖాయం. ఇంగ్లండ్ జట్టులో బెన్ స్టోక్స్ ఉండటం ఆ జట్టు అదృష్టం. ఆ జట్టు సమతుల్యంగా ఉండటంలో బెన్ స్టోక్స్ పాత్ర వెలకట్టలేనిది. భారత్ కు అదే తరహా ఆల్ రౌండర్ హార్దిక్ ఎందుకు కాడు. కచ్చితంగా అతన్ని బెస్ట్ ఆల్ రౌండర్ గా చూస్తానని అనుకుంటున్నా'అని కపిల్ దేవ్ పేర్కొన్నాడు.