సెంచూరియన్: దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా సిల్లీగా రనౌటై విమర్శకుల నోటికి పని చెప్పిన సంగతి తెలిసిందే. క్రీజ్‌కు దగ్గరగా ఉండి కూడా అటు బ్యాట్‌ను కానీ, ఇటు కాలును కానీ ఉంచకుండా రనౌట్‌గా పెవిలియన్ చేరాడు. కీలకమైన మ్యాచ్‌లో హార్దిక్ అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించి రనౌట్‌గా కావడం తీవ్ర స్థాయిలో దుమారం రేపింది. భారత్‌కు దిగ్గజ ఆల్ రౌండర్ కపిల్ దేవ్ తర్వాత అంతటి నైపుణ్యమున్న ఆటగాడంటూ పొగిడిన వారే ఇప్పుడు అతనిపై మండిపడుతున్నారు. అయితే తాజాగా హార్దిక్‌ను విమర్శించిన జాబితాలో దిగ్గజ ఆటగాడు కపిల్‌దేవ్ కూడా చేరిపోయాడు. తాను ఏ మ‍్యాచ్ ఆడినా సీరియస్‌గా ఆడేవాడినని, సిల్లీ తప్పిదం చేసిన హార్దిక్‌ను తనతో పోల్చవద్దంటూ కపిల్ చురకలంటించాడు.
' హార్దిక్‌లో చాలా టాలెంట్ ఉంది. ఇది కేప్‌టౌన్‌లో జరిగిన తొలి టెస్టులో చూశాం. అయితే అతను మానసికంగా చాలా పరిపక్వత సాధించాల్సి ఉంది. రెండో టెస్టులో మాత్రం హార్దిక్ చాలా సిల్లీగా రనౌటయ్యాడు. ఆ తరహా తప్పిదాలు చేస్తున్నట్లయితే హార్దిక్‌తో నన్ను పోల్చకండి. అతను గేమ్‌ను సిరీయస్‌గా తీసుకోలేకపోవడం వల్ల భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. ఆ తరహాలో రనౌటైన హార్దిక్‌కు నాతో పోలిక సరికాదు' అని కపిల్ విమర్శించాడు. ఇక భారత మాజీ క్రికెటర్ సందీప్ పాటిల్ కూడా కపిల్‌దేవ్‌తో ఏకీభవించాడు. ఆ ఇద్దర్నీ ఒకే రకంగా పోల్చడం అప్పుడే సరికాదంటూ హితబోధ చేశాడు. ఇంకా క్రికెట్ కెరీర్ ఆరంభ దశలోనే ఉన్న హార్దిక్ చాలా నేర్చుకోవాలన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment