సాక్షి, స్పోర్ట్స్: దక్షిణాఫ్రికా పర్యటనలో దారుణంగా విఫలమవుతున్న టీమిండియా ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యాపై మాజీ క్రికెటర్ రోజర్ బిన్నీ నిప్పులు చెరిగాడు. బంతితో, బ్యాట్‌తోనూ విఫలమవుతున్న క్రికెటర్ పాండ్యా అని, అతడిని దిగ్గజ ఆల్ రౌండర్ కపిల్‌దేవ్‌తో పోల్చడం ఇకనైనా మానుకోవాలని సూచించాడు. కేవలం దక్షిణాఫ్రికా టూర్‌లో కేవలం కేప్‌టౌన్ టెస్టులో 93 పరుగులు చేసిన పాండ్యా.. ఆపై ఐదు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 26 పరుగులు చేసిన విషయాన్ని రోజర్ బిన్నీ గుర్తుచేశాడు. బంతితోనూ పాండ్యా అద్భుతాలేమీ చేయలేదని, కేవలం 3 వికెట్లతో సరిపెట్టుకున్నాడని చెప్పాడు.
రోజర్ బిన్నీ మాట్లాడుతూ.. 'వన్డేల్లో సఫారీలపై విరాట్ కోహ్లి సేన 5-1తో గెలవడంలో ఆల్ రౌండర్ పాండ్యా పాత్ర ఏమాత్రం లేదు. ఇతర ఆటగాళ్ల కఠోరశ్రమ వల్లే సిరీస్ విజయం సాధ్యమైంది. అనవసర షాట్లు ఆడి ప్రతిసారీ వికెట్ సమర్పించుకున్న పాండ్యా.. సిరీస్‌లో కేవలం 26 పరుగులు చేశాడు. బ్యాట్, బంతి ఏ విభాగంలో రాణించకపోయినా దక్షిణాఫ్రికా లాంటి కఠినమైన పర్యటనకు వచ్చిన జట్టులో సభ్యుడు కావడం అతడు తన అదృష్టంగా భావించాలి.
కేవలం టీ20ల్లో హార్ధిక్ పాండ్యా మెరుపులు చూసి అంతా మోసపోయారు. కానీ భారత్‌కు తొలి ప్రపంచ కప్ అందించిన కపిల్‌దేవ్ అలా కాదు. భారత్‌కు ఎంపికవ్వక ముందు కపిల్ ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో సెంచరీలతో రాణిస్తూ, వికెట్లు తీయడంలోనూ అశ్రద్ధ చూపలేదు. పాండ్యా విషయానికొచ్చేసరికి.. అతడు ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో సాధించిందేమీ లేదు. టెస్ట్ క్రికెట్‌లో రాణించాలన్నా.. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో నిలకడ ఉండాలన్నా, ఫస్ట్‌క్లాస్ క్రికెట్ అనుభవం చాలా ముఖ్యం. ముందుగా రంజీలు ఆడటం పాండ్యా కెరీర్‌కు ప్రయోజనం చేకూరుస్తుందని' రోజర్ బిన్నీ సూచించాడు.
Comments
Please login to add a commentAdd a comment