
కేప్‌టౌన్‌లో హార్దిక్ పాండ్యా క్లిష్టమైన ఇన్నింగ్స్ ఆడాడు. సహచరులు విఫలమైన చోట అతను విజయవంతమైన తీరు అద్భుతం. కష్టాల్లో ఉన్న భారత జట్టును ఆదుకున్న తీరు చూస్తుంటే కపిల్‌దేవ్ గుర్తొచ్చాడు. ఆయన పుట్టిన రోజు (జనవరి 6)న ఆయన్ని తలపించే ఇన్నింగ్స్ ఆడాడు పాండ్యా. ఇది చూసి ఉంటే కపిల్ కూడా అభినందిస్తారు. బంతితో, బ్యాట్‌తో జట్టును గెలిపించడం వల్లే ఆయన మ్యాచ్ విన్నర్‌గా చరిత్రకెక్కారు. ఇప్పుడు పాండ్యా కూడా విఖ్యాత ఆల్‌రౌండర్ సాధించిన ఘనతల్లో సగం సాధిస్తే... మరో కపిల్ ఖాయమనుకోవచ్చు. ఇప్పుడైతే అతను నేర్చుకునే దశలో ఉన్నాడు. నిలకడగా ఇదే ప్రదర్శనను కొనసాగిస్తే కచ్చితంగా మరో ఆల్‌రౌండర్‌ను చూస్తాం. ఇది మినహా మిగతా భారత బ్యాట్స్‌మెన్ ప్రదర్శన పేలవంగా ఉంది. ఆఫ్‌స్టంప్‌కు దూరంగా వెళుతున్న బంతులను వెంటాడి మరీ అవుటయ్యారు. ముఖ్యంగా తొలిరోజు పడిన మూడు వికెట్లను అనవసరంగానే సమర్పించుకున్నారు.
ఆరంభంలో విజయ్ ఆఫ్‌స్టంప్ బంతుల్ని బాగా ఆడుతున్నట్లే కనిపించాడు. కానీ అదే దిశలో వైడ్‌గా వెళ్లిన బంతిని బాది నిష్క్రమించాడు. ధావన్ అయితే అక్కర్లేని భారీ షాట్‌కు బలై మూల్యం చెల్లించాడు. పుల్ షాట్ ఆడే సందర్భం... సామర్థ్యం లేనపుడు దాన్ని అలా వెళ్లనివ్వాలి. టెస్టుల్లో ముందు క్రీజులో పాతుకుపోయాకే అలాంటి షాట్లపై కన్నేయాలి. కోహ్లి చక్కని డెలివరీకి అవుటైనా... దాన్ని బాగా ఆడే సత్తా ఉన్నవాడే మన కెప్టెన్. రెండో రోజు లంచ్ బ్రేక్ తర్వాత తొలి బంతికే పుజారా సహనం కోల్పోయిన షాట్ ఆడాడు. అశ్విన్ కూడా తేలిగ్గానే వికెట్ సమర్పించుకోగా... రోహిత్ తన పాత బల హీనతకే తలవంచాడు. పాండ్యాకు జతయిన భువనేశ్వర్ తన వికెట్ విలువెంతో గుర్తుంచుకొని ఆడిన తీరు ముచ్చటేస్తుంది. ఇద్దరి సమన్వయం వల్లే విలువైన భాగస్వామ్యం కుదిరింది. వీళ్లిద్దరు చూపిన పట్టుదలే మిగతా వారికి పాఠం.