సిరీస్ గెలిచాం..అది చాలు!
కరాచీ: శ్రీలంకతో జరిగిన ట్వంటీ 20 సిరీస్ లో పాకిస్థాన్ వికెట్ కీపర్ సర్ఫరాజ్ అహ్మద్ ను ఆడించకపోవడంపై పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. దీనిపై చీఫ్ సెలెక్టర్ తో సహా క్రికెట్ బోర్డు చైర్మన్ పై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. అటు ఇంటా బయటా కూడా సర్ఫరాజ్ ను ఎందుకు ఆడించాలేదంటూ పాకిస్థాన్ క్రికెట్ అభిమానులు నిలదీశారు. పాకిస్థాన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్ నజీమ్ సెథీ ఒక టీవీషోకు వెళ్లినప్పుడూ కూడా అభిమానుల ఘాటుగా స్పందించారు. సర్ఫరాజ్ ను పక్కకు పెట్టడానికి గల కారణాలు చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో కంగుతిన్న పాక్ క్రికెట్ పెద్దలు దీనిపై వివరణ ఇచ్చేందుకు సన్నద్ధమైయ్యారు.
అయితే దీనిపై సర్ఫరాజ్ వివరణ ఇస్తూ.. ట్వంటీ 20 ల్లో ఆడకపోవడానికి కారణాలు ఏమీ లేవని.. టీమ్ నిబంధనల ప్రకారమే తాను ఆడలేదని స్పష్టం చేశాడు. అసలు ట్వంటీ 20 సిరీస్ లో తాను భాగస్వామిని కాదన్నాడు. తాను వన్డే సిరీస్- టెస్టు సిరీస్ కు మాత్రమే ఎంపికయ్యానన్నాడు. దీనికి వెనుక ఎటువంటి రాజకీయ వివాదాలు లేవన్నాడు. కాగా, తనకు ఎప్పుడూ జట్టులో అవకాశం ఇచ్చినా.. తాను పూర్తిస్థాయిలో ఆడటానికి ప్రయత్నిస్తానన్నాడు. 'దీనిపై రాద్దాంతం అనవసరం. ట్వంటీ 20 సిరీస్ గెలిచాం. అది చాలు. అంతర్జాతీయంగా పాకిస్థాన్ క్రికెట్ టీమ్ ర్యాంకింగ్ కూడా పెరిగింది. నేను సంతోషంగా ఉన్నా'సర్ఫరాజ్ తెలిపాడు. శ్రీలంకతో జరిగిన ట్వంటీ 20 సిరీస్ ను పాకిస్థాన్ 2-0 తేడాతో గెలిచిన సంగతి తెలిసిందే.