'ధోనికి కుంబ్లే చెబుతాడని ఆశిస్తున్నా'
కోల్కతా: వన్డే క్రికెట్ అనేది రాకెట్ సైన్స్ కాదని, అత్యుత్తమ బ్యాట్స్మన్ అనేవాడు ఎక్కువ బంతుల్ని ఆడి ప్రత్యర్థిపై ఒత్తిడి తీసుకురావడమేనని భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ స్పష్టం చేశాడు. న్యూజిలాండ్ తో జరిగిన మూడో వన్డేలో కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అదే పని చేసి సక్సెస్ అయ్యాడన్నాడు. అయితే ధోని నాల్గో స్థానంలోనే బ్యాటింగ్ కు వస్తాడా?లేదా?అనేది తనకు తెలీదన్నాడు. కాకపోతే ఆ స్థానంలో ధోని బ్యాటింగ్ కు వస్తే మరింత మంచి ఫలితాలు వస్తాయని అనుకుంటున్నట్లు దాదా పేర్కొన్నాడు.
'వన్డే క్రికెట్లో ఇది చాలా సింపుల్ థియరీ. అత్యుత్తమ ఆటగాడు ఎవరూ క్రీజ్లో ఉన్నా సాధ్యమైనన్ని ఓవర్లు ఆడి ప్రత్యర్థి జట్టుపై ఒత్తిడి తీసుకురావాలి. మూడో వన్డేలో ధోని అదే చేశాడు. తదుపరి మ్యాచ్ల్లో ధోని నాల్గో స్థానంలో బ్యాటింగ్ కు వస్తాడని అనుకుంటున్నా. ఈ విషయాన్ని ధోనికి జట్టు ప్రధాన కోచ్ అనిల్ కుంబ్లే చెబుతాడని ఆశిస్తున్నా. ఆ ఆర్డర్లో ధోని బ్యాటింగ్కు వస్తే అతనికి సౌకర్యవంతంగా ఉంటుంది. మ్యాచ్లు చూసే ప్రజలకి బాగుంటుంది''అని గంగూలీ తెలిపాడు. పరిమిత ఓవర్ల క్రికెట్ను ధోని ఎంతకాలం ఆడతాడు అనేది తనకు తెలియనప్పటికీ, అత్యుత్తమ ప్రదర్శనలు మాత్రం అతనికి అవసరమని గంగూలీ ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు.