'భారత రెజ్లర్ స్వర్ణం నెగ్గుతాడు'
లండన్ ఒలింపిక్స్లో కాంస్య పతకాన్ని సాధించిన యోగేశ్వర్దత్ పై భారత అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు. భారత కాలమాన ప్రకారం ఆదివారం సాయంత్రం జరుగనున్న 65 కేజీల ఫ్రీస్టయిల్ విభాగంలో బరిలోకి దిగనున్న రెజ్లర్ యోగేశ్వర్ స్వర్ణాన్ని నెగ్గుతాడని మరో భారత రెజ్లర్, రెండు ఒలింపిక్ పతకాల వీరుడు సుశీల్ కుమార్ ధీమా వ్యక్తంచేశాడు.
హరియాణాకు చెందిన యోగేశ్వర్ దత్ కు తన చిన్ననాటి స్నేహితుడు సుశీల్ బెస్ట్ విషెస్ చెప్పాడు. భారత్ మొత్తం అతడికి అండగా ఉంటుందన్నాడు. పతకాలను సాధించి దేశం గర్వించేలా చేసిన మహిళా అథ్లెట్లు పీవీ సింధు, రెజ్లర్ సాక్షి మాలిక్, పతకం కోసం చివరివరకు పోరాడిన దీపా కర్మాకర్ రియోలో అద్భుత ప్రదర్శన చేశారని కొనియాడాడు. ఎన్నో ఆశలతో రియోకు వెళ్లిన మరో రెజ్లర్ నర్సింగ్ యాదవ్ డోపింగ్ వివాదంతో బరిలోకి దిగక ముందురోజే వెనుదిరగాల్సి రావడంతో యోగేశ్వర్ పతకావకాశాలపై ప్రభావం చూపుతుందని భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.