యాసిర్ షాపై మూడు నెలల నిషేధం
డోపింగ్‌లో దొరికిన పాక్ స్పిన్నర్
దుబాయ్: పాకిస్తాన్ లెగ్ స్పిన్నర్ యాసిర్ షాపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మూడు నెలల నిషేధాన్ని విధించింది. గతేడాది అతను డోపింగ్‌కు పాల్పడినట్టు తేలడంతో ఈ వేటు పడింది. గత నవంబర్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే సిరీస్ అనంతరం ఐసీసీ ర్యాండమ్ డోపింగ్ టెస్టులో భాగంగా యాసిర్ మూత్ర నమూనా తీసుకోవడం జరిగింది. దీంట్లో అతను నిషేధిత ఉత్ప్రేరకాన్ని వాడినట్టు తేలడంతో అప్పుడే యాసిర్‌ను తాత్కాలికంగా నిషేధించారు.
ఇక మార్చి 27 వరకు యాసిర్ షా ఎలాంటి క్రికెట్ కార్యకలాపాల్లో పాల్గొనే అవకాశం లేదు. అయితే ఉద్దేశపూర్వకంగా తన క్రికెట్ ప్రదర్శనను పెంచుకునేందుకు కాకుండా అనుకోకుండా తన భార్య వాడే బీపీ మందులను తీసుకోవడం ద్వారా ఈ తప్పిదం జరిగిందనే వాదనను ఐసీసీ నమ్ముతోందని పేర్కొంది.