
భారత జట్టు(ఫైల్ ఫోటో)
ముంబై: వచ్చే నెలలో ఇంగ్లండ్ లో జరిగే ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే భారత క్రికెట్ జట్టును ప్రకటించేందుకు రంగం సిద్ధమైంది. సుప్రీంకోర్టు నేతృత్వంలో ఏర్పాటైన నూతన పాలక కమిటీ (సీఓఏ) ఆదేశాల మేరకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) జట్టును ప్రకటించేందుకు ఎట్టకేలకు దిగివచ్చింది. ఈ మేరకు సోమవారం భారత క్రికెట్ జట్టును ఎంపిక చేసే అవకాశ ఉంది. దీనిలో భాగంగా బీసీసీఐ జాయింట్ సెక్రటరీ అమితాబ్ చౌదరి సెలక్షన్ కమిటీని సమావేశపరచనున్నారు.
ఇటీవల భారత జట్టు ఎంపికపై సీఓఏ ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. చాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే జట్ల ఎంపికపై గడువు ముగిసినా బీసీసీఐ తాత్సారం చేయడంపై వినోద్ రాయ్ నేతృత్వంలోని సీఓఏ మండిపడింది. తక్షణమే జట్టును ప్రకటించాలంటూ ఆదేశాలు జారీ చేసింది. దాంతో దిగివచ్చిన బీసీసీఐ జట్టు ఎంపికకు సంబంధించి కసరత్తులు ఆరంభించింది.