
పాక్ క్రికెటర్లకు డోప్ టెస్టులు!
పలువురు పాకిస్తాన్ క్రికెటర్లకు డోప్ టెస్టులు నిర్వహించారు.
కరాచీ: పలువురు పాకిస్తాన్ క్రికెటర్లకు డోప్ టెస్టులు నిర్వహించారు. గతేడాది డోపింగ్ కు పాల్పడి కొంతకాలం నిషేధం ఎదుర్కొన్న యాసిర్ షాతో పాటు, టెస్టు కెప్టెన్ మిస్బావుల్-హక్లకు క్రికెట్ వరల్డ్ గవర్నింగ్ బాడీ డోప్ టెస్టులు నిర్వహించినట్లు పాకిస్తాన్ టీమ్ మేనేజర్ ఇంతికాబ్ అలమ్ శుక్రవారం ధృవీకరించారు. వచ్చే నెలలో పాక్ క్రికెట్ జట్టు ఇంగ్లండ్ పర్యటనకు బయల్దేరనున్న నేపథ్యంలో ఏ విధమైన పాజిటివ్ ఫలితం వచ్చినా అది జట్టుపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉన్నందున కొంతమంది క్రికెటర్లకు డోప్ టెస్టులు నిర్వహించినట్లు ఇంతికాబ్ పేర్కొన్నారు. మిస్బావుల్ హక్, యాసిర్ షాలతో పాటు, వన్డే కెప్టెన్ అజహర్ అలీ, ఫాస్ట్ బౌలర్ జునైద్ ఖాన్లకు డోప్ టెస్టులు నిర్వహించారు. అయితే వీరిలో యాసిర్ షాపై వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ ప్రధానంగా దృష్టిసారించినట్లు ఇంతికాబ్ తెలిపారు.
గతేడాది నవంబర్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే సిరీస్ అనంతరం నిర్వహించిన డోపింగ్ టెస్టులో యాసిర్ పట్టుబడిన సంగతి తెలిసిందే. దీంతో అతనిపై మూడు నెలల నిషేధం విధించారు. అయితే ఈ ఏడాది మార్చి నెలతో యాసిర్ పై విధించిన నిషేధం గడువు ముగిసింది. దీనిలో భాగంగానే ఇంగ్లండ్ కు వెళ్లే పాక్ జట్టులో యాసిర్ తో పాటు పలువురు క్రికెటర్లకు డోప్ టెస్టులు నిర్వహించారు. జూలై 14 నుంచి ఆరంభమయ్యే నాలుగు టెస్టుల సిరీస్ లో ఆతిథ్య ఇంగ్లండ్ తో పాక్ తలపడనుంది.