
సమావేశంలో పాల్గొన్న శ్రీనివాసన్
కొత్తగా ఐసీసీ టెస్టు చాలెంజ్ టోర్నీ 2018లో ప్రారంభం
దుబాయ్: ఇక నుంచి ఐసీసీలో అసోసియేట్ సభ్య దేశాలుగా కొనసాగుతున్న జట్లు కూడా టెస్టు హోదా దక్కించుకునే అవకాశం ఉంది. ఈమేరకు దుబాయ్‌లో రెండు రోజుల పాటు జరిగిన తమ ఎగ్జిక్యూటివ్ బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
కొత్తగా ‘ఐసీసీ టెస్టు చాలెంజ్’ పేరిట ఓ టోర్నీ నిర్వహించనున్నారు. ఇది 2018లో ప్రారంభమై ప్రతి నాలుగేళ్లకోసారి జరుగుతుంది. దీంట్లో టెస్టు ర్యాంకింగ్స్‌లో అట్టడుగు స్థాయిలో ఉన్న జట్టుతో ఐసీసీ ఇంటర్-కాంటినెంటల్ కప్ విజేత తలపడుతుంది. ఈనేపథ్యంలో తక్కువ ర్యాంకులో ఉండే జింబాబ్వే, బంగ్లాదేశ్ జట్లతో నెదర్లాండ్స్, ఐర్లాండ్ లేక యూఏఈ జట్లు టెస్టు హోదా కోసం తలపడే అవకాశం ఉంటుంది.
‘అసోసియేట్ దేశాలు కూడా ఇక నుంచి టెస్టులకు అర్హత సంపాదించవచ్చు. ఐసీసీ టెస్టు జట్ల ర్యాంకింగ్స్‌లో డిసెంబర్ 31, 2017 వరకు పదో స్థానంలో ఉన్న జట్టు రెండు ఐదు రోజుల మ్యాచ్‌లు తమ దేశంలో.. మరో రెండు ఐదు రోజుల మ్యాచ్‌లు ఇంటర్ కాంటినెంటల్ కప్ విజేత దేశంలో ఆడుతుంది. ప్రారంభ ఐసీసీ టెస్టు చాలెంజ్ 2018లో జరుగుతుంది’ అని అంతర్జాతీయ క్రికెట్ మండలి ఓ ప్రకటనలో తెలిపింది. ఇక వచ్చే ఎనిమిదేళ్లలో రెండు ఐసీసీ ఇంటర్ కాంటినెంటల్ కప్ టోర్నీలు జరుగనున్నాయి. 2015, 2017మధ్య తొలి టోర్నీ... 2019, 2017 మధ్య రెండో టోర్నీ జరగొచ్చు.
ముఖ్య తీర్మానాలు
ఫిబ్రవరి 8న సింగపూర్ సమావేశంలో తీసుకున్న ప్రతిపాదనలకు ఆమోదం.తప్పనిసరి రాజ్యాంగ సవరణ చేసే అధికారం ఐసీసీ బోర్డుకు అప్పగింత. దీన్ని జూన్ నెలాఖరున మెల్‌బోర్న్‌లో జరిగే ఐసీసీ వార్షిక సమావేశంలో సమర్పించాల్సి ఉంటుంది.
భవిష్యత్ పర్యటనల కార్యక్రమం (ఎఫ్‌టీపీ) 2023 వరకు కొనసాగుతుంది.
టి20 ప్రపంచకప్‌ను విజయవంతంగా నిర్వహించినందుకు బంగ్లాదేశ్‌కు అభినందనలు.
2016లో భారత్‌లో జరిగే టి20 ప్రపంచకప్ కూడా ఇదే ఫార్మాట్‌లో ఉండనుంది.
2014 ఏప్రిల్ 30 వరకు టి20 ర్యాంకింగ్స్‌లో టాప్-8గా ఉన్న దేశాలు రెండో రౌండ్‌కు నేరుగా అర్హత సాధిస్తాయి.