దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) పురుషుల క్రికెట్ వన్డే ర్యాంకుల్లో భారత ఆటగాళ్ల ఆధిపత్యం కొనసాగుతోంది. సోమవారం ప్రకటించిన ర్యాంకుల జాబితాలో బ్యాటింగ్ విభాగంలో కోహ్లి, రోహిత్ వరుసగా మొదటి రెండు స్థానాల్లో నిలవగా, బౌలింగ్ విభాగంలో జస్ప్రీత్ బుమ్రా టాప్ ర్యాంక్‌లో ఉన్నాడు. ఆస్ట్రేలియాతో ఆదివారం మూడు వన్డేల సిరీస్‌ను 2–1తో భారత్ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇందులో ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’గా నిలిచిన టీమిండియా సారథి కోహ్లి 886 పాయింట్లతో నెం.1 స్థానంలో ఉండగా, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ 868 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు.
పాకిస్థాన్ బ్యాట్స్‌మన్ బాబర్ ఆజమ్ మూడో స్థానం దక్కించుకున్నాడు. శిఖర్ ధావన్ ఏడు స్థానాలు ఎగబాకి 15వ ర్యాంకుకు చేరుకోగా.. కేఎల్ రాహుల్ 21 స్థానాలు మెరుగుపర్చుకుని 50వ ర్యాంకు దక్కించుకున్నాడు. బౌలర్ల జాబితాలో నెం.1 ర్యాంక్‌ను బుమ్రా మరింత పటిష్టం చేసుకున్నాడు. ప్రస్తుతం 764 పాయింట్లతో బుమ్రా.. రెండోస్థానంలో ఉన్న ట్రెంట్ బౌల్ట్ (న్యూజిలాండ్) కంటే ఎంతో ముందంజలో నిలిచాడు. ముజీబుర్ రహ్మాన్ (అఫ్గానిస్థాన్), రబడ (సౌతాఫ్రికా), ప్యాట్ కమ్మిన్స్ (ఆస్ట్రేలియా) టాప్–5లో నిలిచారు. భారత ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా రెండు స్థానాలు ఎగబాకి 27వ ర్యాంకుకు చేరుకున్నాడు. ఇక ఆల్‌రౌండర్ల జాబితాలో నాలుగు ర్యాంకులు మెరుగుపర్చుకుని పదో స్థానం దక్కించుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment