
'డీఆర్ఎస్' లో స్వల్ప మార్పు!
ప్రస్తుతం క్రికెట్లో అమల్లో ఉన్న డీఆర్ఎస్( నిర్ణయ సమీక్ష పద్ధతి)లో స్వల్ప మార్పుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) ఆమోద ముద్ర వేసింది.
ఎడిన్బర్గ్: ప్రస్తుతం క్రికెట్లో అమల్లో ఉన్న డీఆర్ఎస్( నిర్ణయ సమీక్ష పద్ధతి)లో స్వల్ప మార్పుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) ఆమోద ముద్ర వేసింది. డీఆర్ఎస్లో వందశాతం కచ్చితత్వం లేదని అటు బీసీసీఐతో పాటు, పలు క్రికెట్ బోర్డులు గత కొంతకాలంగా వాదిస్తున్నసంగతి తెలిసిందే. అయితే డీఆర్ఎస్లోని ఎల్బీడబ్యూ నిర్ణయంపై మాత్రమే కొద్దిపాటి మార్పుకు ఐసీసీ శ్రీకారం చుట్టింది. ఆటగాడు ఎల్బీగా అవుటైనప్పుడు బౌలింగ్ జట్టు కెప్టెన్ థర్థ్ అంపైర్ పరిశీలనకు వెళుతుంటాడు. ఇక్కడ ఆఫ్, లెగ్ స్టంప్ల లోపలి భాగాన్ని మాత్రమే ప్రధానంగా పరిశీలిస్తారు. బ్యాట్స్మెన్ బంతిని అడ్డుకున్న క్రమంలో ఆ బంతి వికెట్లను తాకిందా లేదా అనేది గమనిస్తారు. అయితే ఈ డేంజర్ జోన్ పరిధిని ఆఫ్, లెగ్ స్టంప్ల బయటకు పెంచేందుకు నిర్ణయం తీసుకున్నారు. అయితే డీఆర్ఎస్లో ప్రవేశపెట్టనున్న ఈ మార్పు బౌలర్లకు అనుకూలంగా మారే అవకాశం ఉంది.
తాజాగా నిర్ణయం అక్టోబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి రానుంది. ఈ మేరకు శనివారం రాత్రి ఇక్కడ ఐసీసీ చైర్మన్ శశాంక్ మనోహర్ నేతృత్వంలో ఐడీఐ(ఐసీసీ డెవలప్మెంట్ ఇంటర్నేషనల్) సభ్యులతో సుదీర్ఘ సమావేశం అనంతరం డీఆర్ఎస్ ఎల్బీడబ్యూల నిర్ణయంపై స్వల్ప మార్పులకు శ్రీకారం చుట్టారు. దీంతో 2022లో కామన్వెల్త్ గేమ్స్లో మహిళా క్రికెట్ను ప్రవేశపెట్టడంపై కూడా ఈ భేటీలో చర్చించారు.
డీఆర్ఎస్ గురించి ఒకసారి చూద్దాం..
ప్రస్తుతం మూడు రకాల వేర్వేరు టెక్నాలజీల సహాయంతో డీఆర్‌ఎస్‌ను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. అటు ఎల్బీలను నిర్ధారించేందుకు హాక్ ఐ(బాల్ ట్రాకింగ్ టెక్నాలజీ), హాట్ స్పాట్, స్నికో మీటర్ టెక్నాలజీలను డీఆర్ఎస్ లో వాడుతున్నారు.
బాల్ ట్రాకింగ్ టెక్నాలజీని బంతి దిశను సూచిండానికి వినియోగిస్తున్నారు. బ్యాట్స్‌మన్ బంతిని అడ్డుకోకపోతే అది వికెట్లను తాకేదా లేదా అనే విషయం తెలుస్తుంది. పిచ్ అయిన తర్వాత బంతి ప్రయాణించిన దూరం, వేగం ఇలాంటివన్నీ ఇందులో కలిసి ఉండటంతో చాలా గందరగోళం కనిపిస్తుంది.బంతి గమనం మారితే దానిని గుర్తించలేకపోవడం పెద్ద లోపం. పిచ్‌పై పడ్డ తర్వాత బంతి ఎలా వెళ్లవచ్చనేది నేరుగా నిలబడ్డ అంపైర్‌కు కనిపించినంత స్పష్టత ఇందులో సాధ్యం కాదనేది ఒక వాదన.
అందరూ కాస్త విశ్వసించిన రెండో అంశం హాట్‌స్పాట్. బ్యాట్‌కు బంతి ఎడ్జ్ తీసుకుందా లేదా అనేది స్పష్టంగా కనిపిస్తుంది కాబట్టి క్యాచ్‌ల విషయంలో 90 శాతం వరకు సరైన ఫలితాలే వచ్చినా ఇది కూడా కొంత గందరగోళంగానే ఉంది.
బంతి బ్యాట్‌కు లేదా ప్యాడ్‌కు తగిలిందా శబ్దం సాయంతో గుర్తించేందుకు స్నికో మీటర్ టెక్నాలజీని వాడుతున్నారు. అయితే నెమ్మదిగా వచ్చే స్పిన్నర్ల బంతులతో పాటు బ్యాట్స్‌మన్ ముందుకు వచ్చి ఆడితే మైక్‌లు ఈ శబ్దాన్ని గుర్తించలేకపోతున్నాయి. ఈ నేపథ్యంలో డీఆర్‌ఎస్ పై పూర్తి భరోసా ఏర్పడలేదు. తాజాగా ఐసీసీ తీసుకున్న నిర్ణయం కూడా బంతి దిశపైనే కాబట్టి, డీఆర్ఎస్పై నెలకొన్న అనేక సందేహాలు ఇప్పటికీ ప్రశ్నార్థకంగానే మిగిలిపోయే అవకాశం ఉంది.