ఇప్పటిదాకా టెస్టులు, వన్డేల్లో కొనసాగుతున్న అంపైర్ నిర్ణయ సమీక్షా పద్ధతి (డీఆర్‌ఎస్)ని ఇకపై అన్ని ఫార్మాట్లలోనూ నిలకడగా అమలు చేయాలని అంతర్జాతీయ క్రికెట్ మండలి
దుబాయ్: ఇప్పటిదాకా టెస్టులు, వన్డేల్లో కొనసాగుతున్న అంపైర్ నిర్ణయ సమీక్షా పద్ధతి (డీఆర్‌ఎస్)ని ఇకపై అన్ని ఫార్మాట్లలోనూ నిలకడగా అమలు చేయాలని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) నిర్ణయం తీసుకుంది. దుబాయ్‌లో రెండు రోజుల పాటు జరిగిన చీఫ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ (సీఈసీ) సమావేశంలో ఈ ప్రతిపాదనను ఆమోదించారు. మేలో జరిగే క్రికెట్ కమిటీ మీటింగ్‌లో ఈ ప్రతిపాదనలపై మరోసారి చర్చ జరిగి జూన్‌లో జరిగే వార్షిక సమావేశంలో లాంఛనంగా ఆమోదించనున్నారు.
ఆ తర్వాత అక్టోబర్ నుంచి ఇది అమల్లోకి రానుంది. అలాగే వచ్చే ఏడాది వెస్టిండీస్‌లో జరిగే మహిళల టి20 ప్రపంచకప్‌లో తొలిసారిగా డీఆర్‌ఎస్‌ను ఉపయోగించబోతున్నారు. ఇందులో ప్రతీ జట్టుకు ఒక రివ్యూ అవకాశం ఇవ్వనున్నారు. అంతేకాకుండా ఇక నుంచి డీఆర్‌ఎస్ అమలుకు అయ్యే ఖర్చును కూడా ఐసీసీయే భరించనుంది. ఇప్పటిదాకా ద్వైపాక్షిక సిరీస్ జరుగుతున్నప్పుడు ఆతిథ్య జట్టు బ్రాడ్‌కాస్టర్‌పై ఈ భారం పడేది. కొన్ని సందర్భాల్లో ఆతిథ్య జట్టు కూడా కొంత మేర భరించేది.
వాస్తవానికి ఇటీవలి భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగిన టి20 సిరీస్‌లో పలు అంపైర్ నిర్ణయాలు వివాదాస్పదం కావడంతో డీఆర్‌ఎస్ చర్చకు వచ్చింది. ఇదిలావుండగా డీఆర్‌ఎస్‌ను మ్యాచ్‌ల్లో ఉపయోగించడానికి ముందు దీంట్లో ఉపయోగించే హాక్‌ఐ, హాట్‌స్పాట్, అల్ట్రా ఎడ్జ్, రియల్ టైమ్ స్నికో ప్రదర్శనపై మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ)తో ఆమోద ముద్ర వేయించుకోవాల్సి ఉంటుంది.