ఐసీసీ ఆమోదం
ఎడిన్‌బర్గ్: డీఆర్‌ఎస్ (అంపైర్ నిర్ణయ సమీక్ష పద్ధతి)లో అంపైర్లు ఇచ్చే ఎల్బీడబ్ల్యు నిర్ణయాలకు సంబంధించిన నిబంధనలు మార్చేందుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఆమోదం తెలిపింది. దీనివల్ల బౌలర్లకు మరింత ప్రయోజనం చేకూరనుంది. అయితే కొత్త వన్డే లీగ్‌తో పాటు టెస్టు క్రికెట్‌ను రెండు డివిజన్లుగా చేయాలన్న ప్రతిపాదనను మాత్రం వాయిదా వేసింది. ఎడిన్‌బర్గ్‌లో శనివారం రాత్రి ముగిసిన ఐసీసీ వార్షిక సమావేశంలో పలు అంశాలపై చర్చించిన చైర్మన్ శశాంక్ మనోహర్ నేతృత్వంలోని బోర్డు కొన్ని ప్రధాన నిర్ణయాలు తీసుకుంది.
డీఆర్‌ఎస్ ఎల్బీకి సంబంధించిన కొత్త నిబంధన ప్రకారం... ఆఫ్, లెగ్ స్టంప్ మధ్య ఉండే జోన్‌తో పాటు బార్డర్స్‌కు సగం బంతి తగిలినా ఎల్బీ ఇవ్వనున్నారు. గతంలో బంతి జోన్ మధ్యలో తగిలితేనే అవుట్‌గా ప్రకటించేవారు. ఈ నిబంధన అక్టోబర్ 1 నుంచి లేదా అంతకంటే ముందు డీఆర్‌ఎస్‌తో కూడిన సిరీస్ జరిగితే అప్పట్నించి అమల్లోకి వస్తుంది. ఇక కొత్తగా ‘నోబాల్స్’ను గుర్తించేందు థర్డ్ అంపైర్‌కు కూడా అవకాశం ఇచ్చారు. బంతి పడిన కొన్ని సెకన్లలోనే అతను ఫీల్డ్ అంపైర్లకు ఈ విషయాన్ని తెలియజేయవచ్చు.
ఐసీసీ పాలన, పునర్నిర్మాణంపై చేపడుతున్న చర్యలపై కూడా ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. డర్బన్ (2022)లో జరిగే కామన్వెల్త్ గేమ్స్‌లో క్రికెట్‌ను ప్రవేశపెట్టేందుకు మద్దతివ్వాలని నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన దరఖాస్తును గేమ్స్ సమాఖ్యకు అందజేయనుంది. క్రికెట్‌ను ఒలింపిక్స్‌లో చేర్చేందుకు అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం (ఐఓసీ)తో చర్చలు జరపాలని నిర్ణయం తీసుకున్నారు.
ఎల్బీడబ్ల్యు నిబంధనల్లో మార్పులు!
Published Mon, Jul 4 2016 2:02 AM | Last Updated on Mon, Sep 4 2017 4:03 AM
Advertisement