
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ నిబంధనల్లో మార్పులు చేయడం సాధారణంగా జరుగుతూ ఉంటుంది. దీనిలో భాగంగా తాజాగా అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) పలు నిబంధనల్లో కీలక మార్పులు చేయడంతో పాటు కొత్త రూల్స్ కు తెరలేపింది. ఇప్పటివరకూ టెస్టులు, వన్డేల్లో మాత్రమే ఉన్న అంపైర్ నిర్ణయ పునఃసమీక్ష పద్ధతి(డీఆర్ఎస్)ను ట్వంటీ 20ల్లో కూడా ప్రవేశపెడుతూ ఐసీసీ నిర్ణయం తీసుకుంది. అలాగే టెస్టుల్లో ఒక ఇన్నింగ్స్ లో 80 ఓవర్ల తరువాత అదనపు రివ్యూలు అమలుకు ఐసీసీ ముగింపు పలికింది. అంటే ఒక ఇన్నింగ్స్ లో 80 ఓవర్లు ముగిసిన పక్షంలో అదనపు రివ్య్యూలు కోరే అవకాశం ఉండదు. ఇక్కడ ప్రతీ ఇన్నింగ్స్ లో రెండు అన్ సక్సెస్ ఫుల్ రివ్యూలను మాత్రమే ఉపయోగించుకునే వీలుంది.
మరొకవైపు రనౌట్ అవుట్ విషయంలో కీలక మార్పుకు ఐసీసీ శ్రీకారం చుట్టింది. ఒక బ్యాట్స్ మన్ పరుగు తీసే సమయంలో డైవ్ కొడుతూ బ్యాట్ ను ముందుగా ఒకసారి గ్రౌండ్ ను తాకి ఉంచి ఆ తరువాత అదే బ్యాట్ గాల్లో ఉంచినప్పటికీ తొలుత జరిగిన చర్యనే ఇక్కడ పరిగణలోకి తీసుకుంటారు. అంటే అదే సమయంలో వికెట్ల పడ్డప్పటికీ బ్యాట్స్ మన్ ముందుగా ఒకసారి క్రీజ్ లో బ్యాట్ ను ఉంచడం వల్ల నాటౌట్ గా సేఫ్ అవుతాడు.
ఇదిలా ఉంచితే, మ్యాచ్ జరిగే సమయంలో ఒక ఆటగాడు ఏ విధమైన చెడు ప్రవర్తనకు పాల్పడినా లెవెల్ 4 నిబంధనను అమలు చేయనున్నారు. ఫీల్డ్ లో ఒక క్రికెటర్ తో తారా స్థాయిలో వాగ్వాదం చేసినా, అంపైర్ తో చెడుగా ప్రవర్తించినా ఇవన్నీ లెవెల్ 4 నిబంధనకి కిందకి వస్తాయి. అంటే అతిగా ప్రవర్తించిన సదరు ఆటగాడ్ని ఫీల్డ్ నుంచి బయటకు పంపిచడమే లెవెల్ 4 నిబంధన సారాంశం. కాగా, అంతకుముందున్న ఐసీసీ లెవెల్ 1 నుంచి 3 వరకూ ఉన్న నిబంధనలు యథావిధిగా కొనసాగుతాయి.
మరొకవైపు గత కొంతకాలంగా బ్యాట్ మన్లు రకరకాల సైజుల్లో బ్యాట్లు వాడటంపై విమర్శలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇక్కడ బ్యాట్ పొడవు, వెడల్పు విషయంలో ఐసీసీ ఎటువంటి నిర్ణయం తీసుకోకపోగా, తాజా నిబంధన ప్రకారం బ్యాట్ ఓవరాల్ మందం మాత్రం 67 ఎమ్ ఎమ్ కు మించకూడదు. అదే సమయంలో బ్యాట్ అంచు మందం మాత్రం 40 ఎమ్ ఎమ్ ను దాటి ఉండకూడదనే నిబంధనను ప్రవేశపెట్టింది. ఈ నిబంధనలు గురువారం(సెప్టెంబర్ 28) నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉంది.