విరాట్ కోహ్లి (ఫైల్ ఫొటో)
దుబాయ్ : దాయాదీ దేశం పాకిస్తాన్‌తో క్రికెట్ మ్యాచ్ అంటే భారత అభిమానులకు ఎక్కడి లేని ఉత్సాహం వస్తుంది. అయితే ఇరుదేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో గత కొన్నేళ్లుగా ద్వైపాక్షిక సిరీస్‌లు జరగడంలేదు. దీంతో ఆ మజాను అభిమానులు మిస్సవుతున్నారు. ఐసీసీ టోర్నీల్లో మాత్రమే భారత్-పాక్‌లు తలపడుతున్నాయి. గతేడాది జరిగిన ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో ఇలాంటి ఆసక్తికర మ్యాచ్ ప్రేక్షకులను రెండుసార్లు కనువిందు చేసింది. తొలి మ్యాచ్‌లో భారత్ గెలవగా.. అసలు సిసలు ఫైనల్ మ్యాచ్‌లో పాక్ నెగ్గి టైటిల్ నెగ్గిన విషయం తెలిసిందే.
అయితే ఎపుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అలాంటి ఉత్కంఠకర మ్యాచ్ మరికొద్ది రోజుల్లో జరగనుంది. క్రికెట్ ప్రపంచంపై చెరగని ముద్ర వేసిన భారత్,పాక్ జట్లు ముఖా ముఖి పోరుకు సిద్దమయ్యాయి. దుబాయ్, అబుదాబి వేదికలుగా జరిగే ఆసియాకప్ టోర్నీ షెడ్యూల్‌ను ఐసీసీ మంగళవారం అధికారికంగా విడుదల చేసింది. సెప్టెంబర్ 15న ప్రారంభమయ్యే ఈ టోర్నీలో భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్‌ల ప్రాతినిథ్యం ఖరారు కాగా.. మరోస్థానం కోసం యూఏఈ, సింగపూర్, ఒమన్, నేపాల్, మలేసియా, హంకాంగ్‌లు పోటీపడనున్నాయి. సెప్టంబర్ 18న భారత్, క్వాలిఫయర్‌తో తొలి మ్యాచ్ ఆడనుంది. సెప్టెంబర్ 19న దాయాదీ పాకిస్తాన్‌తో తలపడనుంది. రెండు గ్రూప్‌లు విభజించగా.. ఒక్కో గ్రూపులో మూడు జట్లు తలపడగా టాప్-2లో నిలిచినవి సూపర్-4లోకి అడుగుపెడుతాయి. సెప్టెంబర్ 28న దుబాయ్ వేదికగా ఫైనల్ జరగనుంది.
Comments
Please login to add a commentAdd a comment