ధోనికి నాన్ బెయిలబుల్ వారెంట్
♦ ఫిబ్రవరి 25లోపు హాజరు కావాలి
♦ అనంతపురం కోర్టు ఆదేశం
♦ ఇందులో వాస్తవం లేదు: లాయర్
అనంతపురం: భారత వన్డే క్రికెట్ జట్టు కెప్టెన్ ఎంఎస్ ధోనిపై స్థానిక జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్‌ను జారీ చేసింది. ఫిబ్రవరి 25లోపు కచ్చితంగా కోర్టులో హాజరు కావాలని, లేకుంటే అరెస్టు తప్పదని హెచ్చరించింది. గతంలోనే హాజరు కావాలని చెప్పినా స్పందించకపోవడంతో కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
ప్రస్తుతం ధోని వన్డే జట్టుతో ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్నాడు. వన్డే, టి20 సిరీస్ కోసం ఈనెల 12 నుంచి 31 వరకు అక్కడే ఉంటాడు. 2013, ఏప్రిల్‌లో బిజినెస్ టుడే మేగజైన్ కవర్‌పై విష్ణుమూర్తి ఆకారంలో ధోని ముఖచిత్రం ప్రచురితమైంది. దీంట్లో ధోని చేతుల్లో తను బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న వస్తువులతో పాటు షూస్‌ను కూడా ఉంచారు. అయితే ఈ ఫొటో హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉందంటూ అప్పట్లోనే అనంతపురం జిల్లా విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్‌పీ) నాయకుడు వై.శ్యాంసుందర్ కోర్టులో కేసు వేశారు.
ఈ పిటిషన్‌పై కొంత కాలంగా విచారణ సాగుతుండగా వ్యక్తిగతంగా కోర్టు ముందు హాజరు కావాలని 2014, జూన్‌లో ధోని, మేగజైన్ ఎడిటర్‌కు బెయిలబుల్ వారెంట్స్ జారీ చేసింది. ఎడిటర్ తన తరఫున లాయర్‌ను పంపినా, ధోని నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో తాజా వారెంట్లు జారీ చేసింది.
ఆ కథనాలు నిజం కాదు: ధోని లాయర్
ధోనికి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన విషయం వాస్తవం కాదని అతడి తరఫు లాయర్ రజనీష్ చోప్రా తేల్చి చెప్పారు. ‘న్యాయ వ్యవస్థపై ధోనికి అపార గౌరవం ఉంది. అయితే ఈ కేసు విషయంలో అతడు ఇప్పటిదాకా ఎలాంటి సమన్లు అందుకోలేదు. అలాంటప్పుడు ఈ వారెంట్ జారీ అవడంలో నిజం లేదు. ఇదే అంశంపై బెంగళూరు కోర్టులో కేసుపై సుప్రీం కోర్టు స్టే విధించింది’ అని రితి స్పోర్ట్స్ మేనేజిమెంట్‌తో కలిసి లాయర్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ధోని వ్యక్తిగత మేనేజర్ అరుణ్ పాండే కూడా ఈ విషయాన్ని తోసిపుచ్చారు.