ముంబై: వచ్చే నెలలో శ్రీలంకలో జరుగనున్న ముక్కోణపు సిరీస్‌లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లి విశ్రాంతి కోరితే మాత్రం అందుకు అంగీకారం తెలిపేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ సుముఖంగా ఉంది. గత కొంతకాలంగా ఆటగాళ్లు బిజీగా ఉండటంతో పలువురికి విశ్రాంతినివ్వాలని ఇప్పటికే టీమిండియా సెలక్టర్లు ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ మేరకు త్వరలో జరిగే సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ఒకవేళ కెప్టెన్ విరాట్ కోహ్లి కూడా ముక్కోణపు సిరీస్‌కు దూరంగా ఉండాలనే యోచనలో ఉంటే మాత్రం అతను కూడా విశ‍్రాంతి తీసుకోవచ్చని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు.
దక్షిణాఫ్రికాతో శనివారం జరగనున్న మూడో టీ20 మ్యాచ్‌తో ఆ సిరీస్ ముగియనుండగా, ఆపై భారత్ మార్చి 6 నుంచి శ్రీలంకలో జరగనున్న ముక్కోణపు టీ20 సిరీస్ ఆడాల్సి ఉంది. ఈ టోర్నీలో భారత్‌తో పాటు, శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లు ఆడనున్నాయి. అయితే ఈ ముక్కోణపు టీ20 సిరీస్ నుంచి కెప్టెన్ విరాట్ కోహ్లి, డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ జస్‌ప్రీత్ బుమ్రాకి విశ్రాంతినివ్వాలని భారత సెలక్టర్లు చర్చిస్తున్నారట. గత రెండేళ్లుగా వన్డే, టీ20ల్లో మెరుగ్గా రాణిస్తూ ఈ ఏడాది ఆరంభంలో దక్షిణాఫ్రికా పర్యటనతో టెస్టుల్లోకి కూడా జస్‌ప్రీత్ బుమ్రా అరంగేట్రం చేశాడు.
ఐపీఎల్ తర్వాత కీలకమైన ఇంగ్లండ్ పర్యటన ఉండటంతో ముందుగా బూమ్రాకి విశ్రాంతి ఇవ్వాలని ఆలోచిస్తున్నారు. అలాగే కెప్టెన్ విరాట్ కోహ్లి కూడా దక్షిణాఫ్రికాతో ఇప్పటికే వరుసగా మూడు టెస్టులు, ఆరు వన్డేలు, రెండు టీ20లు విరామం లేకుండా ఆడాడు. దీంతో అతడికి కూడా విశ్రాంతినిస్తే బాగుంటుందని సెలక్టర్లు ఆలోచిస్తున్నారు. అయితే కోహ్లి విశ్రాంతి కోరిన పక్షంలోనే అందుకు సుముఖతం వ్యక్తం చేసేందుకు ఎంఎస్‌కే ప్రసాద్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ సిద్ధంగా ఉన్నట్లు సదరు అధికారి తెలిపారు. ఆదివారం ముక్కోణఫు సిరీస్ కోసం భారత జట్టును సెలక్టర్లు ప్రకటించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment