'ప్రజలకు ఏమి చెప్పాలనుకుంటున్నారు'
లాహోర్: పాకిస్తాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్)ఫైనల్ పోరును లాహోర్లో నిర్వహించాలనుకుంటున్న ఆ దేశ క్రికెట్ బోర్డుపై దిగ్గజ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ తీవ్రంగా మండిపడ్డాడు. ఇటీవల కాలంలో వెంటవెంటనే రెండు ఉగ్రదాడులు జరిగిన ఆ ప్రాంతంలో పీఎస్ఎల్ ఫైనల్ మ్యాచ్ ను నిర్వహించాలనుకోవడం వెనుక ఉద్దేశమేమిటని ప్రశ్నించాడు. ఆ నిర్ణయాన్ని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తక్షణమే విరమించుకోవాలన్నాడు. కానిపక్షంలో పీసీబీకి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని విమర్శించాడు. 'అసలు ఏ సందేశాన్ని పీసీబీ ప్రజలకు ఇవ్వాలనుకుంటుంది.
'గత కొన్నిరోజులు క్రితం వరుసగా రెండుసార్లు ఉగ్రదాడులు జరిగాయి. ఈ పరిస్థితుల్లో లాహోర్లో ఫైనల్ మ్యాచ్ నిర్వహించాలనుకోవడం అనాలోచిత నిర్ణయం'అని ఇమ్రాన్ తెలిపాడు. మరొకవైపు మాజీ క్రికెటర్ ఆరిఫ్ అలీ ఖాన్ అబ్బాసీ కూడా పీసీబీ నిర్ణయాన్ని తప్పుబట్టాడు. ప్రమాదంతో కూడుకున్న ప్రదేశాల్లో క్రికెట్ మ్యాచ్ ఫైనల్ నిర్వహించాలనుకోవడం మంచి నిర్ణయం కాదన్నాడు.