విజయం..పరాభవం..వివాదం | In 2014, the Indian cricket career | Sakshi
Sakshi News home page

విజయం..పరాభవం..వివాదం

Published Thu, Dec 25 2014 12:05 AM | Last Updated on Sat, Sep 2 2017 6:41 PM

విజయం..పరాభవం..వివాదం

విజయం..పరాభవం..వివాదం

2014లో భారత క్రికెట్ ప్రస్థానం
 టెస్టు సిరీస్ గెలుచుకోని సంవత్సరం
 నాలుగు వన్డే సిరీస్‌లు సొంతం
 రోహిత్ శర్మ చిరస్మరణీయ రికార్డు

 
 గత కొన్నేళ్లుగా ప్రపంచ క్రికెట్‌ను శాసించిన భారత క్రికెట్ జట్టుకు 2014 మిశ్రమ ఫలితాలు ఇచ్చింది. విజయాలతో పోలిస్తే వివాదాలు కూడా వెంట రావడంతో జట్టు ప్రభ కాస్త తగ్గిందనే చెప్పవచ్చు. లార్డ్స్ టెస్టు విజయం మినహా జట్టు పరంగా గుర్తుంచుకోదగ్గ ప్రదర్శన ఏదీ నమోదు కాలేదు. వన్డేల్లో వ్యక్తిగతంగా రోహిత్ శర్మ రికార్డు ఊరటనిచ్చింది. టి20 ప్రపంచ కప్ ఫైనల్లో ప్రదర్శన భారత అభిమానులు మరచిపోలేని చేదు జ్ఞాపకంగా మారింది.
 
 ఆటకు సంబంధం లేని అంశాల్లో నాటింగ్‌హామ్‌లో జడేజా, అండర్సన్ గొడవ, స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ వ్యవహారంలో సుప్రీం కోర్టులో జరుగుతున్న విచారణ   ఈ సారి మన క్రికెట్ జట్టును వార్తల్లో నిలిపాయి. ఏడాది చివర్లో డ్రెస్సింగ్ రూమ్‌లో కోహ్లి, ధావన్ అంశం కూడా సంచలనం రేపింది. వీటన్నింటికి తోడు పాతికేళ్ల తర్వాత తొలిసారి సచిన్ టెండూల్కర్ పేరు లేకుండా భారత క్రికెట్ స్కోరు కార్డు కనిపించింది.

 
 (సాక్షి క్రీడా విభాగం)
 2014లో భారత్ మూడు టెస్టు సిరీస్‌లలోనే పాల్గొంది. న్యూజిలాండ్‌లో జరిగిన 2 టెస్టుల సిరీస్‌లో 0-1తో ఓడింది. తొలి టెస్టులో పోరాడి విజయానికి చేరువగా వచ్చినా ఫలితం దక్కకపోగా...రెండో టెస్టులో మంచి అవకాశం ఉన్నా ప్రత్యర్థికి కోలుకునే అవకాశం ఇచ్చి ‘డ్రా’తో సరిపెట్టింది. ఆ తర్వాత ఇంగ్లండ్ గడ్డపై ఐదు టెస్టుల సిరీస్‌ను 1-3తో కోల్పోయింది. తొలి టెస్టు డ్రాగా ముగిసినా చరిత్రాత్మక లార్డ్స్ మైదానంలో 28 ఏళ్ల తర్వాత టెస్టు నెగ్గి సంచలనం సృష్టించింది. ఇషాంత్ అద్భుత బౌలింగ్ ప్రదర్శనతో ఇంగ్లండ్‌ను 95 పరుగులతో చిత్తు చేసింది. అయితే దురదృష్టవశాత్తూ ఆ తర్వాత అదే జోరు కొనసాగించలేక వరుసగా మూడు టెస్టుల్లో పరాజయంపాలైంది. ఇక ప్రస్తుతం జరుగుతున్న ఆస్ట్రేలియా సిరీస్‌లో తొలి రెండు టెస్టులూ ఇప్పటికే ఓడింది. ఈ ఏడాది మెల్‌బోర్న్‌లో మరో టెస్టు మిగిలి ఉంది. ఆ మ్యాచ్ ఫలితం ఎలా ఉండనుందో చూడాలి. మరో వైపు చాలా ఏళ్ల తర్వాత భారత్ ఈ సారి సొంతగడ్డపై ఒక్క టెస్టు మ్యాచ్ కూడా ఆడలేదు. విండీస్ అర్ధాంతరంగా తప్పుకోవడంతో ఇక్కడ జరగాల్సిన సిరీస్ రద్దయింది.
 
 సొంతగడ్డపై సూపర్
 ఈ ఏడాది భారత్ ఐదు ద్వైపాక్షిక వన్డే సిరీస్‌లతో పాటు ఆసియా కప్‌లో పాల్గొంది. సొంతగడ్డపై 5-0తో శ్రీలంకను, 2-1తో వెస్టిండీస్‌ను ఓడించింది. బంగ్లాదేశ్ వెళ్లి 2-0తో విజయం సాధించింది. వీటితో పాటు ఇంగ్లండ్‌లో టెస్టు సిరీస్ ఓటమి తర్వాత వన్డేల్లో 3-1తో అద్భుత విజయం సాధించి దీటైన బదులిచ్చింది. అయితే న్యూజిలాండ్‌లో మాత్రం ఐదు వన్డేల సిరీస్‌ను 0-4తో చిత్తుగా ఓడింది. ఆసియా కప్‌లో కూడా ఫైనల్‌కు చేరడంలో విఫలమైంది.
 
 వీడని నీడ
 స్పాట్ ఫిక్సింగ్ 2013లో వెలుగులోకి వచ్చినా సుప్రీంకోర్టులో తాజాగా సాగుతున్న విచారణ బీసీసీఐలో ప్రకంపనలు పుట్టించింది. ముఖ్యంగా బోర్డు అధికారుల తీరును పదే పదే కోర్టు తప్పుబట్టడం ఇబ్బందిగా మారింది.
 
 అరణ్య రోదన
 నాటింగ్‌హామ్ టెస్టులో జడేజాను దూషించాడంటూ భారత మేనేజ్‌మెంట్ అండర్సన్‌పై ఎన్ని ఫిర్యాదులు చేసినా ఫలితం లేకపోయింది. తగిన సాక్ష్యాలు లేకపోవడంతో పాటు విచారణాధికారులు కూడా పెద్దగా ఆసక్తి చూపించకపోవడంతో ఫలితం జట్టుకు ప్రతికూలంగానే వచ్చింది. అండర్సన్‌కు ఎలాంటి శిక్ష పడకపోగా, భారత్ ఏకాగ్రత చెదిరి అది సిరీస్‌పై ప్రభావం చూపించింది.
 
 వ్యక్తిగతంగా...
 టెస్టుల్లో భారత్ తరఫున మురళీ విజయ్ 18 ఇన్నింగ్స్‌లలో 42.94 సగటుతో  773 పరుగులు చేసి టాప్‌స్కోరర్‌గా నిలిచాడు. వన్డేల్లోనైతే 20 ఇన్నింగ్స్‌లలో 58.55 సగటుతో విరాట్ కోహ్లి 1054 పరుగులు సాధించి తన నిలకడ ప్రదర్శించాడు. టెస్టు బౌలింగ్‌లో భారత్ తరఫున 12 మ్యాచ్‌లలో 36 వికెట్లతో ఇషాంత్ శర్మ అగ్రస్థానంలో నిలిస్తే, వన్డేల్లో మొహమ్మద్ షమీ 16 మ్యాచుల్లో 38 వికెట్లతో ప్రథమ స్థానంలో నిలిచాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డేలో స్టువర్ట్ బిన్నీ 4 పరుగులకు 6 వికెట్లు పడగొట్టి భారత తరఫున అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేశాడు.
 
 యువీపై ఆగ్రహం
 బంగ్లాదేశ్‌లో జరిగిన టి20 ప్రపంచ కప్ ఫైనల్లో శ్రీలంక 6 వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించి విజేతగా నిలిచింది. పరాజయంకంటే స్టార్ ఆటగాడు యువరాజ్ సింగ్ ప్రదర్శన సగటు అభిమానిని బాధపెట్టింది. కీలకమైన ఈ మ్యాచ్‌లో అతను 21 బంతుల్లో 11 పరుగులు మాత్రమే చేయడాన్ని ఎవరూ మరచిపోలేరు.
 
 చిరస్మరణీయం
 అన్నింటికి మించి వన్డేల్లో రోహిత్ శర్మ 264 పరుగులు సాధించి కొత్త రికార్డు నెలకొల్పడం ఈ ఏడాది హైలైట్‌గా చెప్పవచ్చు. కోల్‌కతాలో శ్రీలంకతో జరిగిన వన్డేలో రోహిత్ అనితర సాధ్యమైన రీతిలో 173 బంతుల్లోనే 33 ఫోర్లు, 9 సిక్సర్లతో 264 పరుగులు చేశాడు. భవిష్యత్తులో వన్డేల్లో అత్యుత్తమ వ్యక్తిగత స్కోరుగా ఇది చిరస్థాయిగా నిలిచిపోయే అవకాశం ఉంది.
 
 మాటలకందని విషాదం
 ప్రపంచ క్రికెట్‌లో మాటలకందని విషాద సంఘటనకు 2014 సాక్షిగా నిలిచింది. సిడ్నీ మైదానంలో జరిగిన మ్యాచ్‌లో బౌన్సర్ తగిలి గాయపడిన 25 ఏళ్ల ఆస్ట్రేలియా క్రికెటర్ ఫిల్ హ్యూస్ మృతి చెందడం క్రీడాభిమానులను కలచివేసింది. ప్రపంచ వ్యాప్తంగా క్రికెటర్లు, అభిమానులు హ్యూస్‌కు నివాళులు అర్పించారు.
 
 అండర్సన్ దూకుడు...
 న్యూజిలాండ్ బ్యాట్స్‌మన్ కోరీ అండర్సన్ వన్డేల్లో ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు నెలకొల్పాడు. క్వీన్స్‌టౌన్‌లో జనవరి 1న వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో అండర్సన్ 36 బంతుల్లోనే 4 ఫోర్లు, 12 సిక్సర్లతో శతకం బాది షాహిద్ అఫ్రిది పేరిట 17 ఏళ్లుగా ఉన్న రికార్డును (37 బంతులు; 1996లో శ్రీలంకపై) బద్దలు కొట్టాడు.
 
 2014 రికార్డులు  (ఇప్పటివరకు)
 టెస్టుల్లో అత్యధిక పరుగులు :     కుమార సంగక్కర (11 టెస్టుల్లో 1486)
 వికెట్లు :  రంగన హెరాత్ (10 టెస్టుల్లో 60)
 అత్యధిక వ్యక్తిగత స్కోరు :  కుమార సంగక్కర (319)
 అత్యుత్తమ బౌలింగ్ :  రంగన హెరాత్ (9/127)
 వన్డేల్లో అత్యధిక పరుగులు : కుమార సంగక్కర (28 వన్డేల్లో 1256)
 వికెట్లు :  అజంతా మెండిస్ (17 వన్డేల్లో 38)
 అత్యధిక వ్యక్తిగత స్కోరు :  రోహిత్ శర్మ (264)
 అత్యుత్తమ బౌలింగ్ :  స్టువర్ట్ బిన్నీ (6/4)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement