శ్రేయస్ సెంచరీ
ఆధిక్యంలో ముంబై సౌరాష్ర్టతో రంజీ ఫైనల్
పుణే: సౌరాష్ట్రతో జరుగుతున్న రంజీ ట్రోఫీ ఫైనల్లో ముంబై జట్టు ఆధిక్యం సాధించింది. శ్రేయస్ అయ్యర్ (142 బంతుల్లో 117; 15 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీతో చెలరేగడంతో గురువారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి ముంబై తొలి ఇన్నింగ్స్‌లో 66 ఓవర్లలో 8 వికెట్లకు 262 పరుగులు చేసింది. సిద్ధేశ్ లాడ్ (22 బ్యాటింగ్), అబ్దుల్లా (9 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు.
సూర్య కుమార్ యాదవ్ (48) ఆకట్టుకున్నాడు. 23 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన ముంబైని అయ్యర్, సూర్యకుమార్ మూడో వికెట్‌కు 152 పరుగులు జోడించి ఆదుకున్నారు. అయితే మ్యాచ్ మధ్యలో సౌరాష్ట్ర బౌలర్లు విజృంభించడంతో ముంబై మరోసారి తడబడింది. ఆదిత్య తారే (19), అభిషేక్ నాయర్ (19)తో సహా అందరూ తక్కువ స్కోర్లకే అవుటయ్యారు. హార్దిక్ రాథోడ్ 3, ఉనాద్కట్, జానీ చెరో రెండు వికెట్లు తీశారు. అంతకుముందు 192/8 ఓవర్‌నైట్ స్కోరు తో రెండో రోజు ఆట కొనసాగించిన సౌరాష్ట్ర తొలి ఇన్నింగ్స్‌లో 93.2 ఓవర్లలో 235 పరుగులకు ఆలౌటైంది. ప్రేరక్ మన్కడ్ (66), ఉనాద్కట్ (31) రా ణించారు. ధవల్ 5, శార్దూల్ 3 వికెట్లు పడగొట్టారు. ప్రస్తుతం ముంబై 27 పరుగుల ఆధిక్యంలో ఉంది.