రాజ్‌కోట్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ(42; 44 బంతుల్లో 6 ఫోర్లు) హాఫ్ సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. ఆడమ్ జంపా వేసిన ఇన్నింగ్స్ 14వ ఓవర్ మూడో బంతికి రోహిత్ ఎల్బీగా పెవిలియన్ చేరాడు. అదే ఓవర్‌లో ఫోర్ కొట్టిన రోహిత్.. ఆపై మరుసటి బంతికి వికెట్లు ముందు దొరికేశాడు. ఆ బంతిని రివర్స్ స్వీప్ ఆడటానికి యత్నించగా అది రోహిత్ ప్యాడ్లకు తాకింది. దాంతో ఆసీస్ అప్పీలు చేయగా ఫీల్డ్ అంపైర్ ఔటిచ్చాడు. దీనిపై రివ్వూకు వెళ్లిన రోహిత్‌కు అక్కడ కూడా నిరాశే ఎదురైంది. అది వికెట్లను తాకుతున్నట్లు రిప్లేలో తేలడంతో రోహిత్ పెవిలియన్ వీడాల్సి వచ్చింది. అదే సమయంలో భారత్ రివ్యూను కోల్పోయింది.
కాగా, జంపా బౌలింగ్‌లో వన్డేలు, టీ20ల్లో కలుపుకుని రోహిత్ ఔట్ కావడంతో ఇది నాల్గోసారి. దాంతో విరాట్ కోహ్లి తర్వాత స్థానంలో నిలిచాడు రోహిత్. జంపా బౌలింగ్‌లో కోహ్లి (వన్డేలు, టీ20లు) ఆరు సందర్భాల్లో పెవిలియన్ చేరాడు. ఒక బ్యాట్స్‌మన్‌ను ఎక్కువసార్లు ఔట్ చేసిన జంపా బౌలింగ్ గణాంకాల్లో ఇదే అత్యధికం. ఆ తర్వాత స్థానంలో రోహిత్ నిలిచాడు. అయితే వన్డేల్లో 9వేల పరుగుల మార్కును చేరడానికి రోహిత్ నాలుగు పరుగుల దూరంలో నిలిచిపోయాడు.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుంది. దాంతో టీమిండియా ఇన్నింగ్స్‌ను ఎప్పటిలాగా రోహిత్-శిఖర్ ధావన్‌లు ఆరంభించారు. వీరిద్దరూ సమయోచితంగా ఆడుతూ స్కోరు బోర్డును ముందుకు తీసుకెళుతున్న క్రమంలో రోహిత్ ఔటయ్యాడు. ఈ జోడి తొలి వికెట్‌కు 81 పరుగులు జోడించింది. 15 ఓవర్లు ముగిసే సరికి భారత్ వికెట్ కోల్పోయి 87 పరుగులు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment