పంత్‌ నువ్వు వెళ్లిపోవచ్చు: సెలక్టర్లు | Ind Vs Ban Pink Ball Test: Pant Released From Test Squad | Sakshi
Sakshi News home page

పంత్‌ నువ్వు వెళ్లిపోవచ్చు: సెలక్టర్లు

Published Sat, Nov 23 2019 2:19 PM | Last Updated on Sat, Nov 23 2019 2:19 PM

Ind Vs Ban Pink Ball Test: Pant Released From Test Squad - Sakshi

కోల్‌కతా: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న చారిత్రక పింక్‌ బాల్‌ టెస్టు నుంచి టీమిండియా యువ సంచలనం రిషభ్‌ పంత్‌ను సెలక్టర్లు తప్పించారు. అతడి స్థానంలో వృద్దిమాన్‌ సాహాకు బ్యాకప్‌గా ఆంధ్ర వికెట్‌ కీపర్‌ కేఎస్‌ భరత్‌ను ఎంపిక చేశారు. స్వదేశంలో బంగ్లాతో జరుగుతున్న రెండో టెస్టుకు పంత్‌ను తుది జట్టులోకి తీసుకోలేదు. దీంతో తొలి రోజు రిజర్వ్‌ బెంచ్‌కే పరిమితమయ్యాడు. అయితే వెస్టిండీస్‌తో జరగబోయే వన్డే, టీ20 సిరీస్‌కు ఎంపికైన పంత్‌ ప్రాక్టీస్‌ కోసం సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టీ20 ట్రోఫీలో ఆడాలని నిర్ణయించుకున్నాడు.

ఇందు కోసం సెలక్టర్లును కోరాడు. పంత్‌ అభ్యర్థనను పరిగణలోకి తీసుకున్న సెలక్టర్లు ముస్తాక్‌ అలీ టోర్నీలో ఆడేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. రెండో టెస్టు ఆట ఇంకా నాలుగు రోజులు ఉండటంతో అతడి స్థానంలో కేఎస్‌ భరత్‌ను ఎంపిక చేశారు. పంత్‌తో పాటు రెండు టెస్టుల సిరీస్‌కు బ్యాకప్‌ ఓపెనర్‌గా జట్టులోకి తీసుకున్న శుభ్‌మన్‌ గిల్‌కు కూడా దేశవాళీ టోర్నీ ఆడుకునేందుకు అవకాశం ఇచ్చింది. గిల్‌ స్థానంలో ఎవరినీ ఎంపిక చేయలేదు. 

ఇక గత కొంత కాలంగా ఫామ్‌లో లేక తంటాలు పడుతున్న పంత్‌ వెస్టిండీస్‌ సిరీస్‌పైనే ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. దీని కోసం ముస్తాక్‌ అలీ టోర్నీని సద్వినియోగం చేసుకోవాలని భావిస్తున్నాడు. ఈ టోర్నీలో రాణించి మునపటి ఫామ్‌ను అందుకోవాలని ఆకాంక్షిస్తున్నాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో కీపర్‌గా, బ్యాట్స్‌మన్‌గా పంత్‌ తీవ్రంగా నిరుత్సాహపరిచిన విషయం తెలిసిందే. దీంతో అతడిపై అన్ని వైపులా విమర్శలు వెల్లువుత్తుతున్నాయి. ఇప్పటికే టెస్టు జట్టులో చోటు దక్కడం కష్టంగా మారిన సమయంలో పొట్టి క్రికెట్‌లో స్థానం కాపాడుకోవాలనే ఆలోచనలో అతడు ఉన్నాడు. దీంతో వెస్టిండీస్‌ సిరీస్‌ అతడికి చావోరేవోగా మారింది. ఇక ఈ టోర్నీలో ఢిల్లీ తరుపున పంత్‌, పంజాబ్‌ తరుపున గిల్‌ ఆడనున్న విషయం తెలిసిందే. 

పింక్‌ బాల్‌ క్రికెట్‌ ఆడిన అనభవం ఉంది
ఇక కోల్‌కతా వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో సాహా బ్యాకప్‌గా అనూహ్యంగా జట్టుకు ఎంపిక కావడం పట్ల భరత్‌ ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. ‘జట్టుతో చేరమని సెలక్టర్ల నుంచి కాల్‌ వచ్చింది. ఈ రోజు ఉదయం 8:30 గంటలకు జట్టుతో చేరాను. విరాట్‌ భాయ్‌ వంటి స్టార్‌ క్రికెటర్‌తో డ్రెస్సింగ్‌ రూమ్‌ పంచుకోవడం ఆనందంగా ఉంది. ఆడినా ఆడకపోయినా టీమిండియాతో ట్రావెల్‌ చేయడం ఎంతోకొంత నాకు ఉపయోగపడుతుందని భావిస్తున్నా. దులీప్‌ ట్రోఫీ-2015లో భాగంగా పింక్‌ బాల్‌ క్రికెట్‌ ఆడిన ఆనుభవం ఉంది. అవకాశం లభిస్తే నా సత్తా చాటుతా’అంటూ కేఎస్‌ భరత్‌ పేర్కొన్నాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement