...పోనుంది! ఈ టెస్టూ చేజారిపోనుంది! ఇంగ్లండ్ గడ్డపై భారత్‌కు 1–4తో పరాభవమే మిగలనుంది. మొదట ఏ మూలనో ఉన్న గెలుపు ఆశలు క్రమక్రమంగా కొడిగట్టాయి. తర్వాత ‘డ్రా’ ఆలోచన ఒక్కసారిగా ఆవిరైంది! ఇక చేయాల్సింది పరువు దక్కేందుకు వీలైనంత పోరాటమే! మిగిలింది ముగ్గురే స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్. అటువైపు ఇంగ్లండ్ పేసర్ల బంతులు పదేపదే పరీక్ష పెడుతున్నాయి. కాబట్టి ఇదేమంత సులువు కాదు. మంగళవారం టీమిండియా పరాజయం ఖాయం..! ఒకటీ, రెండు మంచి ఇన్నింగ్స్‌లు నమోదై, రోజంతా ఆడితే మనకు ‘డ్రా’నందం..!
లండన్: సంచలనం ఆశించలేని పరిస్థితి. కనీసం ‘డ్రా’ గురించైనా ఆలోచించలేని దైన్యం. కొండలాంటి అతి భారీ లక్ష్యాన్ని చేరుకోవడంలో పరాజయం తప్ప మరో మార్గం కనిపించని క్లిష్ట సమయం. ఇంగ్లండ్‌తో ఇక్కడ జరుగుతున్న చివరిదైన ఐదో టెస్టులో భారత్ పరిస్థితిది. నాలుగో రోజు సోమవారం 464 పరుగుల ఛేదనలో కోహ్లి సేన ఆట ముగిసే సమయానికి 58/3తో నిలిచింది. మరో 406 పరుగులు వెనుకబడి ఉంది. భారమంతా ఓపెనర్ కేఎల్ రాహుల్ (46 బ్యాటింగ్), వైస్ కెప్టెన్ అజింక్య రహానే (10 బ్యాటింగ్)పైనే. వారేమైనా అసాధారణంగా ఆడితేనో, వర్షం ముంచెత్తితేనో తప్ప ఓటమి తథ్యమనిపిస్తోంది. ఓవర్‌నైట్ స్కోరు 114/2తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లండ్... ఓపెనర్ అలిస్టర్ కుక్ (286 బంతుల్లో 147; 14 ఫోర్లు), కెప్టెన్ జో రూట్ (190 బంతుల్లో 125; 12 ఫోర్లు, 1 సిక్స్)ల శతకాలతో 423/8 వద్ద డిక్లేర్ చేసింది. జడేజా (3/179), విహారి (3/37)లకు మూడేసి వికెట్లు దక్కాయి. ఛేదనలో ఓపెనర్ ధావన్ (1), వన్‌డౌన్ బ్యాట్స్‌మన్ పుజారా, కెప్టెన్ కోహ్లిల డకౌట్‌తో టీమిండియా విజయం దారులు మూసుకుపోయాయి.
నడిపించారు
ఏమాత్రం ఇబ్బంది పెట్టలేకపోయిన భారత బౌలింగ్‌ను కుక్, రూట్ అలవోకగా ఆడేశారు. బుమ్రా వేసిన రెండో ఓవర్ మొదటి బంతినే బౌండరీకి పంపి కుక్ అర్ధ శతకం పూర్తిచేసుకున్నాడు. పాదం గాయంతో ఇషాంత్ ఒక్క ఓవర్ వేసి వైదొలగడం భారత్ బౌలింగ్ పరిమితులను తగ్గించింది. కుక్ 96 పరుగుల మీద ఉండగా బుమ్రా ఓవర్ త్రో కారణంగా ఐదు పరుగులు వచ్చాయి. తనకిది టెస్టుల్లో 33వ సెంచరీ. జోరుగా ఆడిన రూట్ లైఫ్‌లను సద్వినియోగం చేసుకుని టెస్టుల్లో 14వ శతకం సాధించాడు. టీ విరామానికి కొద్దిగా ముందు కుక్, రూట్‌లను వరుస బంతుల్లో ఔట్ చేసి విహారి జట్టుకు ఊరట ఇచ్చాడు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 259 పరుగులు జోడించి జట్టును అత్యంత పటిష్ఠ స్థితిలో నిలిపారు. స్టోక్స్ (36 బంతుల్లో 37; 5 ఫోర్లు, 1 సిక్స్); స్యామ్ కరన్ (21); రషీద్ (20 నాటౌట్) దానిని మరింత పెంచారు. కరన్ ఔటైన వెంటనే రూట్ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేశాడు. ఇషాంత్ గాయం, షమీకి అదృష్టం కలిసిరాకపోవడం, బుమ్రా నామమాత్రం కావడంతో ప్రత్యర్థి ఇన్నింగ్స్‌లో పరుగులు సులువుగా వచ్చాయి. మంగళవారం 69.2 ఓవర్లలో నాలుగుపైగా రన్ రేట్‌తో 309 పరుగులు చేయడమే దీనికి నిదర్శనం.
దెబ్బ మీద దెబ్బ
లక్ష్య ఛేదనలో భారత టాపార్డర్ కుప్పకూలింది. అండర్సన్ పదునైన ఇన్ స్వింగర్లకు ధావన్, పుజారా వద్ద సమాధానమే లేకపోయింది. దీంతో ఒక్క పరుగుకే భారత్ రెండు వికెట్లు నష్టపోయింది. అతి పెద్ద దెబ్బ మాత్రం కోహ్లి ఔటే. సిరీస్ మొత్తం భారత బ్యాటింగ్ భారం మోసి, 500పైగా పరుగులు సాధించిన కెప్టెన్... అత్యంత కీలక సందర్భంలో తొలి బంతికే వెనుదిరిగాడు. దూరంగా వెళ్తున్న బ్రాడ్ స్వింగింగ్ డెలివరీని వెంటాడి మూల్యం చెల్లించుకున్నాడు. రెండు పరుగులకే మూడు వికెట్లు కోల్పో యిన స్థితిలో రాహుల్, రహానే ఆదుకున్నారు.
►అరంగేట్ర, కెరీర్ చివరి టెస్టులోనూ సెంచరీ చేసిన ఐదో క్రికెటర్‌గా కుక్ గుర్తింపు పొందాడు. గతంలో రెగీ డఫ్ (ఆస్ట్రేలియా), పోన్స్‌ఫర్డ్ (ఆస్ట్రేలియా), గ్రెగ్ చాపెల్ (ఆస్ట్రేలియా), అజహరుద్దీన్ (భారత్) ఈ ఘనత సాధించారు.
► టెస్టు క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఎడమ చేతివాటం బ్యాట్స్‌మన్‌గా కుక్ (12,472) రికార్డు నెలకొల్పాడు. సంగక్కర (శ్రీలంక–12,400) పేరిట ఉన్న రికార్డును అతను తిరగరాశాడు.
► ఒకే సిరీస్‌లో అత్యధిక క్యాచ్‌లు తీసుకున్న భారత ఫీల్డర్‌గా లోకేశ్ రాహుల్ (14) గుర్తింపు పొందాడు. రాహుల్ ద్రవిడ్ (13; 2004లో ఆస్ట్రేలియాపై) పేరిట ఉన్న రికార్డును లోకేశ్ రాహుల్ అధిగమించాడు.
►సెంచరీలు చేసిన ఇద్దరు బ్యాట్స్‌మెన్‌ను అరంగేట్రం టెస్టులోనే ఔట్ చేసిన రెండో భారతీయ బౌలర్‌గా, ఓవరాల్‌గా తొమ్మిదో బౌలర్‌గా హనుమ విహారి నిలిచాడు. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ బౌలర్‌గా (2014లో ఆస్ట్రేలియాపై) కరణ్ శర్మ గుర్తింపు పొందాడు.
Comments
Please login to add a commentAdd a comment