
భారత్ ‘ఎ’ పరాజయం
ప్రిటోరియా: బ్యాట్స్‌మెన్ వైఫ ల్యంతో దక్షిణాఫ్రికా ‘ఎ’ జట్టుతో జరిగిన ముక్కోణపు వన్డే క్రికెట్ టోర్నీ తొలి మ్యాచ్‌లో భారత్ ‘ఎ’ జట్టు రెండు వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ డ్వెయిన్ ప్రెటోరియస్ ఆల్‌రౌండ్ ప్రదర్శన చేశాడు. దక్షిణాఫ్రికా విజయంలో కీలకపాత్ర పోషించాడు. బౌలింగ్‌లో 24 పరుగులిచ్చి మూడు వికెట్లు తీసిన ప్రెటోరియస్... బ్యాటింగ్‌లో 54 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్స్ సహాయంతో 34 పరుగులు సాధించి తమ జట్టు విజయానికి దోహదపడ్డాడు. అంతకుముందు తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్ 41.5 ఓవర్లలో కేవలం 152 పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్ మనీశ్ పాండే (95 బంతుల్లో 55; 4 ఫోర్లు) మినహా మిగతా బ్యాట్స్‌మెన్ ఇలా వచ్చి అలా పెవిలియన్‌కు చేరుకున్నారు. మీడియం పేసర్ ప్రెటోరియస్‌తోపాటు ఎడంచేతి వాటం స్పిన్నర్ ఫాంగిసో (4/30), హెండ్రిక్స్ (2/15) భారత బ్యాటింగ్ ఆర్డర్‌ను దెబ్బ తీశారు.
153 పరుగుల లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా 37.4 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి ఛేదించింది. 71 పరుగులకు ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన దక్షిణాఫ్రికా జట్టును బెహర్దీన్ (62 బంతుల్లో 37 నాటౌట్), ప్రెటోరియస్ ఆదుకున్నారు. వీరిద్దరూ ఆరో వికెట్‌కు 62 పరుగులు జోడించారు. ప్రెటోరియస్ అవుటయ్యాక మిగతా బ్యాట్స్‌మెన్ సహకారంతో బెహర్దీన్ దక్షిణాఫ్రికా విజయాన్ని ఖాయం చేశాడు. భారత బౌలర్లలో యజువేంద్ర చహల్ (3/41), అక్షర్ పటేల్ (35) రాణించగా... మొహమ్మద్ సిరాజ్, శార్దుల్ ఠాకూర్, బాసిల్ థంపి ఒక్కో వికెట్ తీశారు. ఈ టోర్నీలో భాగంగా శుక్రవారం జరిగే రెండో లీగ్ మ్యాచ్‌లో అఫ్ఘానిస్తాన్‌తో భారత్ ‘ఎ’ తలపడుతుంది.