సౌతాఫ్రికా-ఏ స్పిన్నర్ సెనురన్ ముత్తుసామి (లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ స్పిన్నర్) శ్రీలంక-ఏ జట్టును వారి స్వదేశంలో గడగడలాడిస్తున్నాడు. రెండు టెస్ట్‌ల అనధికారిక సిరీస్‌లో భాగంగా నిన్న (జూన్ 19) మొదలైన రెండో టెస్ట్‌లో ముత్తుసామి మరోసారి 5 వికెట్లు సాధించి, లంకేయులను ముప్పుతిప్పలు పెట్టాడు. ఈ సిరీస్‌లో ముత్తుసామి 5 అంతకంటే ఎక్కువ వికెట్లు పడగొట్టడం ఇది మూడోసారి.
తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్లు, రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు పడగొట్టిన ముత్తుసామి.. ప్రస్తుతం జరుగుతున్న రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్లు పడగొట్టాడు. మొత్తంగా ముత్తుసామి 3 ఇన్నింగ్స్‌ల్లో 18 వికెట్లు పడగొట్టాడు. ముత్తుసామి ధాటికి శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 290 పరుగులకు ఆలౌటైంది.
లంక ఇన్నింగ్స్‌లో తొమ్మిదో నంబర్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన మిలన్ రత్నాయకే (53) టాప్ స్కోరర్‌గా నిలువగా.. నిషాన్ మధుష్క (33), లసిత్ క్రూస్‌పుల్లే (27), భానుక (32), పసిందు సూరియబండార (41), లహిరు ఉదార (33), ఆర్ మెండిస్ (44) ఓ మోస్తరు స్కోర్లు సాధించారు. సఫారీ బౌలర్లలో ముత్తుసామితో (26.1-4-101-6) పాటు సిపామ్లా (2), విలియమ్స్ (1), స్వేన్‌పోయల్ (1) వికెట్లు సాధించారు.
అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన సౌతాఫ్రికా.. 4 ఓవర్లలో వికెట్ నష్టానికి 7 పరుగులు చేసి, ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది. సఫారీ కెప్టెన్ టోనీ డి జోర్జి (0)ని ఇన్నింగ్స్ తొలి బంతికే విశ్వ ఫెర్నాండో ఎల్బీడబ్ల్యూగా ఔట్ చేశాడు. మాథ్యూ బ్రీట్‌జ్కీ (2), ట్రిస్టన్ స్టబ్స్ (5) క్రీజ్‌లో ఉన్నారు.
కాగా, ఈ సిరీస్‌లో భాగంగా జరిగిన తొలి టెస్ట్‌లో శ్రీలంక-ఏ 160 పరుగుల తేడాతో విజయం సాధించింది. అంతకుమందు జరిగిన 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను సౌతాఫ్రికా-ఏ 2-1 తేడాతో కైవసం చేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment