మూడు వన్డేలు, రెండు టెస్ట్‌ల అనధికారిక సిరీస్‌ల కోసం సౌతాఫ్రికా ఏ జట్టు శ్రీలంకలో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో తొలుత జరిగిన వన్డే సిరీస్‌ను సౌతాఫ్రికా 2-1 తేడాతో కైవసం చేసుకోగా.. నిన్న ముగిసిన తొలి టెస్ట్‌లో శ్రీలంక-ఏ విజయం సాధించి, సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక.. తొలి ఇన్నింగ్స్‌లో 325 పరుగులకు ఆలౌట్ కాగా.. ఆ తర్వాత సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 131 పరుగులకే కుప్పకూలింది. అనంతరం శ్రీలంక రెండో ఇన్నింగ్స్‌లో 151 పరుగులకు ఆలౌట్ కాగా.. సౌతాఫ్రికా 185 పరుగులకే చాపచుట్టేసి, 160 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.
లంకేయులకు ముప్పుతిప్పలు పెట్టిన సెనురన్ ముత్తుసామి..
ఈ మ్యాచ్‌లో శ్రీలంక భారీ తేడాతో విజయం సాధించినప్పటికీ.. సఫారీ స్పిన్నర్ సెనురన్ ముత్తుసామి అందరి దృష్టిని ఆకర్శించాడు. తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్లు పడగొట్టిన ముత్తుసామి, రెండో ఇన్నింగ్స్‌లో సైతం అదే రేంజ్‌లో రెచ్చిపోయి 5 వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్‌లో మొత్తం 12 వికెట్లు పడగొట్టిన ముత్తుసామి లంక బ్యాటర్లకు వారి స్వదేశంలో ముచ్చెమటలు పట్టించాడు.
ముత్తుసామికి సహచర బౌలర్ల నుంచి సహకారం లభించకపోవడంతో లంక బ్యాటర్లు పైచేయి సాధించారు. బౌన్సీ పిచ్‌లు అధికంగా ఉండే సౌతాఫ్రికా లాంటి దేశం నుంచి వచ్చిన స్పిన్ బౌలర్ పరాయి గడ్డపై, అందులో ఉపఖండపు పిచ్‌లపై ఈ స్థాయిలో రెచ్చిపోవడం చాలా అరుదుగా జరుగుతుంది. ఇందుకే ముత్తుసామిపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. తన జట్టు ఘోర పరాభవాన్ని ఎదుర్కొన్నా, ముత్తుసామిని అందరూ ప్రశంసిస్తున్నారు. మున్ముందు ముత్తుసామి సౌతాఫ్రికా జాతీయ జట్టులో కీలకంగా మారతాడని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాగా, 29 ఏళ్ల ముత్తుసామి సౌతాఫ్రికా తరఫున ఇదివరకే అరంగేట్రం చేసి, 2 వికెట్లు పడగొట్టాడు.
Comments
Please login to add a commentAdd a comment