విశాఖ స్పోర్ట్స్: ఆస్ట్రేలియా జట్టు వచ్చేసింది. ఇటీవలే ఆ దేశంలో కోహ్లీ సేన పర్యటించి కంగారూల దుమ్ము దులిపిన జ్ఞాపకాలు క్రికెట్ అభిమానుల మనసుల్లో ఇంకా కదలాడుతుండగానే, మరోసారి అమీతుమీ తేల్చుకోవడానికి ఆ జట్టు భారత్‌కు వచ్చింది. రావడమే విశాఖలో అడుగుమోసింది. ఇక్కడ ఆదివారం జరగనున్న తొలి టీ20లో సత్తా చూపి, లెక్క సరిచేసే ధ్యేయంతో ఆసీస్ సేన విశాఖలో కాలుమోపింది. మరోవైపున తిరుగులేని ఉత్సాహం తొణికిసలాడుతున్న భారత జట్టు తమ జోరు కొనసాగించాలనే పట్టుదలతో ఉంది. కివీస్ జట్టుతో జరిగిన చివరి టీ20లో ఓడిన భారత్, సత్తా చూపిందన్న ప్రశంసలు మూటకట్టుకుంది. అందుకు తగ్గట్టే, ఆసీస్‌ను దెబ్బ తీయాలన్న ఉత్సాహం కోహ్లీ సేనను ముందుకు నడిపిస్తోంది. భారత జట్టులో ధోనీ ఒక రోజు ముందే విశాఖ చేరుకోగా, మిగిలిన ఆటగాళ్లంతా శుక్రవారం వేరువేరు విమానాల్లో వచ్చారు. ఆస్ట్రేలియా జట్టంతా శుక్రవారం సాయంత్రం విశాఖ వచ్చింది. వాస్తవానికి ఆసీస్ సేన ఐదు గంటలకే విశాఖ చేరుకోవాల్సి ఉండగా విమానం ఆలస్యం కావడంతో గంట లేటుగా ఆ జట్టు విశాఖ చేరింది.
తిరుగులేని సత్తా
గత నవంబర్‌లో ఆస్ట్రేలియాలో జరిగిన టీ20 సిరీస్‌లో భారత్, ఆస్ట్రేలియా చెరో మ్యాచ్ గెలిచి, సమ ఉజ్జీగా నిలిచిన సంగతి తెలిసిందే. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఓ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. ఈ సిరీస్‌లో తొలి టీ20లో భారత్ నాలుగు వికేట్లే కోల్పోయినా 158 పరుగులే చేయగలిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా ఏడు వికెట్లు కోల్పోయి 169 పరుగులు చేసి విజయకేతనం ఎగరేసింది. ఇక రెండో మ్యాచ్ రద్దవడంతో ఫలితం తేలలేదు. మూడో మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నాలుగు వికెట్లకు 168 పరుగులు చేయగా ఆస్ట్రేలియా ఆరువికెట్లు కోల్పోయి 164 పరుగుల వద్దే ఆగిపోయింది. దీంతో రెండు జట్లకు చెరో గెలుపు దక్కింది. ఈ సిరీస్ తర్వాత భారత్ మరో టీ20 సిరీస్ ఆడి ఓడింది. ఈ నేపథ్యంలో ఆసీస్ జట్టును భారత్ ఆహ్వానించింది. సిరీస్‌లో తొలి టీ20 విశాఖలో ఆదివార ం జరగనుండగా రెండో మ్యాచ్ 27న బెంగళూరులో జరగనుంది.
ఆసీస్ ఆధిక్యం
భారత్‌లో ఆడేందుకు 2017లో వచ్చిన ఆస్ట్రేలియా రెండో మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో భారత్ తొలుత బ్యాటింగ్ చేసి 118 పరుగులు చేయగా ఆస్ట్రేలియా రెండే వికెట్లు కోల్పోయి 122 పరుగులతో విజయాన్నందుకుంది. రెండో మ్యాచ్ రద్దు కావడంతో ఆస్ట్రేలియా 1–0తో సిరీస్‌ను గెలుచుకుంది.
రోహిత్‌దే పైచేయి
భారత్ తరపున రోహిత్‌శర్మ గడిచిన పదిమ్యాచ్‌ల్లో 340 పరుగులు చేయగా శిఖర్ ధావన్ పది మ్యాచ్‌ల్లో 324 పరుగులు చేశాడు. ఆస్ట్రేలియా తరపున మాక్స్‌వెల్ పదిమ్యాచ్‌ల్లో 253పరుగులతోనూ, షార్ట్ తొమ్మిది మ్యాచ్‌ల్లోనూ 214పరుగులు చేసి విశాఖ మ్యాచ్‌కు సిద్ధమౌతున్నారు. బౌలింగ్‌లో భారత్ తరపున గత తొమ్మిది మ్యాచ్‌ల్లో పాండ్యా పది వికెట్లు తీయగా బుమ్రా ఐదు మ్యాచ్‌ల్లో ఐదు వికెట్లు తీశాడు. ఇక ఆస్ట్రేలియా తరపున కోల్టర్ నైల్ ఏడు మ్యాచ్‌ల్లో ఏడు వికెట్లు తీయగా జంపా ఏడు మ్యాచ్‌ల్లో ఐదు వికెట్లు తీసి విశాఖలో సంచలనం సృష్టించాడు.
కొహ్లీ, ధోనీ ప్రాక్టీస్
విశాఖ చేరుకున్న ధోనీ, కోహ్లీ శుక్రవారం వైఎస్‌ఆర్ స్టేడియంలో ప్రాక్టీస్ చేశారు. సంజయ్‌బంగార్, రాఘవేంద్ర, సువాన్ ఉదేంకా ప్రాక్టీస్ చేసుకున్నారు. ఆసీస్ సొంతగడ్డపై ఆస్ట్రేలియా సిరీస్ గెలవకుండా నిలువరించిన భారత్, చాలాశ్రమపడి సొంతగడ్డపై సిరీస్ గెలవాలనే పట్టుదలతో ఉంది. ఆ ఉత్సాహంతోనే భారత్ జట్టు శనివారం వైఎస్‌ఆర్ స్టేడియం నెట్స్‌లో ఉదయం తొమ్మిది గంటల నుంచి 12గంటల వరకు ప్రాక్టీస్ చేయనుండగా ఆస్ట్రేలియా జట్టు మధ్యాహ్నం రెండు నుంచి ఐదుగంటల వరకు ప్రాక్టీస్ చేయనుంది.
బ్యాటింగ్ మెరుపులు
భారత్ తరపున కెప్టెన్ విరాట్ కోహ్లీకి తోడుగా రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ బ్యాటింగ్‌కు దిగనుండగా విజయ్‌శంకర్ ఆల్‌రౌండర్ పాత్రను పోషించనున్నారు. కీపింగ్ బాధ్యతలను ధోనీ పోషిస్తాడన్న సంగతి తెలిసిందే.ఆస్ట్రేలియా తరపున కెప్టెన్ ఆరోన్ ఫించ్‌తో ఉస్మాన్, షాన్, షార్ట్, హాండ్స్ కంబ్ బ్యాటింగ్‌లో రాణించడానికి శ్రమించనుండగా స్టోనిస్, మ్యాక్స్‌వెల్, టర్నర్, రిచర్డ్‌సన్ ఆల్‌రౌండర్ పాత్ర పోషించనున్నారు. కీపింగ్ బాధ్యతలను అలెక్స్ కరే చేపట్టనుండగా కమ్మిన్స్, కేన్ రిచర్డ్‌సన్, నాథన్, జాసన్, నాథన్ లియన్, ఆడమ్ జంపా బౌలింగ్‌లో సత్తా చూపడానికి సమాయత్తమవుతున్నారు.
అభిమానులూ.. ఇవీ నిబంధనలు! :నగర పోలీస్ కమిషనర్ మహేష్ చంద్ర లడ్డా
విశాఖపట్నం , ద్వారకానగర్(విశాఖ దక్షిణ): ఇండియా, ఆస్ట్రేలియా దేశాల మధ్య జరిగే తొలి టీ20 మ్యాచ్ సందర్భంగా ఆటను వీక్షించడానికి వచ్చే ప్రజలు నిర్దేశిత నిబంధనలు పాటించాలని నగర పోలీస్ కమిషనర్ మహేష్ చంద్ర లడ్డా తెలిపారు.
♦ మ్యాచ్ పాస్‌లను ఉన్నవారిని, వారికి నిర్దేశించిన గేట్ల ద్వారా మాత్రమే స్టేడియంలోనికి అనుమతిస్తారు.
♦ ఆదివారం సాయంత్రం ఐదు గంటల నుండి రాత్రి ఎనిమిదిన్నర వరకు మాత్రమే స్టేడియంలోనికి అనుమతిస్తారు.
♦ స్టేడియంలోనికి వచ్చే వారు హెల్మెట్లు, లగేజీబ్యాగ్‌లు, కాలేజీ బ్యాగ్‌లు తీసుకురాకూడదు.
♦ మ్యాచ్ వీక్షకులు స్టేడియంలోనికి ప్రవేశించినప్పుడు పేపర్ ప్లకార్డులు తప్ప కర్రలు, ప్లాస్టిక్, ఐరన్ పైపులు తీసుకురావడానికి వీల్లేదు.
♦ వీవీఐపీ కారు పాస్‌లు ఉన్నవారిని మాత్రమే మెయిన్‌గేటు ద్వారా నిర్దేశిత పార్కింగ్ స్థలాలకు అనుమతిస్తారు.
♦ 24వ తేదీన ప్రైవేటు వ్యక్తులు ఎవరూ డ్రోన్‌లను వినియోగించరాదు.
♦ స్టేడియంను ఆనుకొని వున్న షాపింగ్ కాంప్లెక్స్ వద్ద గాని, ఎన్‌హెచ్–16 రోడ్డు, సర్వీసు రోడ్డు, ఇతర రహదారులపై వాహనాలు నిలుపకూడదు. నిబంధనలు పాటించకపోతే చట్టప్రకారం చర్యలు తీసుకుంటారు.
♦ ఈ సూచనలు పాటిస్తూ క్రికెట్ మ్యాచ్ సక్రమంగా జరగడానికి సహకరించాలని, మ్యాచ్‌లో ఆనందాన్ని ఆస్వాదించాలని లడ్డా కోరారు.
Comments
Please login to add a commentAdd a comment