సెమీస్‌లో యువ భారత్‌ | India Beat Australia By 74 Runs In Quarter Finals | Sakshi
Sakshi News home page

సెమీస్‌లో యువ భారత్‌

Published Wed, Jan 29 2020 1:59 AM | Last Updated on Wed, Jan 29 2020 4:29 AM

India Beat Australia By 74 Runs In Quarter Finals - Sakshi

పోష్ స్ట్రూమ్ (దక్షిణాఫ్రికా): తమ జైత్రయాత్రను కొనసాగిస్తూ యువ భారత జట్టు అండర్‌–19 ప్రపంచకప్‌లో సెమీఫైనల్లోకి ప్రవేశించింది. గత ప్రపంచ కప్‌ రన్నరప్‌ ఆ్రస్టేలియాతో మంగళవారం జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో డిఫెండింగ్‌ చాంపియన్‌ భారత్‌ 74 పరుగుల ఆధిక్యంతో ఘనవిజయం సాధించింది. మొదట భారత్‌ 50 ఓవర్లలో 9 వికెట్లకు 233 పరుగులు చేసింది. తర్వాత ఆ్రస్టేలియా 43.3 ఓవర్లలో 159 పరుగులకే కుప్పకూలింది. 2008 తర్వాత ఆస్ట్రేలియా జట్టు సెమీఫైనల్‌ చేరకపోవడం ఇదే తొలిసారి.

ముందుగా భారత్‌ బ్యాటింగ్‌లో తడబడినా... యశస్వి జైస్వాల్‌ (82 బంతుల్లో 62; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు), అథర్వ అంకోలేకర్‌ (54 బంతుల్లో 55 నాటౌట్‌; 5 ఫోర్లు, సిక్స్‌) జట్టును ఆదుకున్నారు. టాపార్డర్‌లో ఓపెనర్‌ దివ్యాన్ష్ (14) సహా తెలుగు కుర్రాడు ఠాకూర్‌ తిలక్‌వర్మ (2), కెప్టెన్‌ ప్రియమ్‌ గార్గ్‌ (15) విఫలమయ్యారు. ఈ దశలో లోయర్‌ ఆర్డర్‌లో అథర్వ... సిద్ధేశ్‌ వీర్‌ (42 బంతుల్లో 25; 4 ఫోర్లు), రవి బిష్ణోయ్‌ (31 బంతుల్లో 30; ఫోర్, సిక్స్‌)లతో కలిసి ఇన్నింగ్స్‌ను కుదుటపరిచాడు.

234 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆ్రస్టేలియాను భారత పేసర్లు కార్తీక్‌ త్యాగి (4/24), ఆకాశ్‌ సింగ్‌ (3/30) హడలెత్తించారు. కార్తీక్‌ ధాటికి ఒకదశలో ఆసీస్‌ 17 పరుగులకే 4 వికెట్లను కోల్పోయింది. ఓపెనర్‌ సామ్‌ ఫానింగ్‌ (75; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు), స్కాట్‌ (35; 2 ఫోర్లు, సిక్స్‌) పోరాటం చేసినా ఫలితం లేకపోయింది. కార్తీక్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు దక్కింది. ఈ గెలుపుతో అండర్‌–19 ప్రపంచకప్‌ చరిత్రలో వరుసగా పది విజయాలు సాధించిన తొలిజట్టుగా భారత్‌ గుర్తింపు పొందింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement