
మన అమ్మాయిలకే పట్టం
► మహిళల హాకీ వరల్డ్ లీగ్ రౌండ్–2 టోర్నీ విజేత భారత్
► ఫైనల్లో చిలీపై విజయం
► ‘బెస్ట్ గోల్‌కీపర్’గా సవిత
వెస్ట్ వాంకోవర్ (కెనడా): బరిలో ఉన్న అన్ని జట్లకంటే మెరుగైన ర్యాంక్ ఉన్న భారత్ స్థాయికి తగ్గ ఆటతీరుతో రాణించింది. మహిళల హాకీ వరల్డ్ లీగ్ రౌండ్–2 టోర్నమెంట్‌లో టైటిల్‌ను సొంతం చేసుకుంది. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక జరిగిన ఫైనల్లో ప్రపంచ 12వ ర్యాంకర్ భారత్ ‘షూటౌట్’లో 3–1 గోల్స్ తేడాతో ప్రపంచ 19వ ర్యాంకర్ చిలీ జట్టును ఓడించింది. నిర్ణీత సమయం వరకు రెండు జట్లు 1–1తో సమఉజ్జీగా నిలిచాయి.
ఆట ఐదో నిమిషంలో మరియా మల్డొనాడో చేసిన గోల్‌తో చిలీ 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత 41వ నిమిషంలో అనూపా బార్లా గోల్‌తో భారత్ స్కోరును 1–1తో సమం చేసింది. అనంతరం రెండు జట్లు మరో గోల్ చేయడంలో సఫలం కాలేదు. దాంతో విజేతను నిర్ణయించడానికి ‘షూటౌట్’ను నిర్వహించారు. ‘షూటౌట్’లో భారత గోల్‌కీపర్ సవిత అడ్డుగోడలా నిలబడి చిలీకి చెందిన మూడు షాట్‌లను నిలువరించింది.
కిమ్ జాకబ్ (తొలి షాట్), జోసెఫా విలాలాబిటియా (రెండో షాట్), కాటలీనా యానెజ్ (నాలుగో షాట్) గోల్ ప్రయత్నాలను సవిత అడ్డుకోగా...కరోలినా గార్సియా (మూడో షాట్) సఫలమైంది. మరోవైపు భారత్ తరఫున రాణి రాంపాల్, మోనిక, దీపిక వరుసగా మూడు షాట్‌లను గోల్స్‌గా మలిచారు. ఫలితం తేలిపోవడంతో భారత్ మిగతా రెండు షాట్‌లను తీసుకోలేదు. టోర్నీ మొత్తం నిలకడగా రాణించిన సవిత ‘బెస్ట్ గోల్‌కీపర్’ పురస్కారం దక్కించుకుంది. ఈ టోర్నీలో ఫైనల్‌కు చేరడంద్వారా భారత్ వరల్డ్ లీగ్ సెమీఫైనల్ దశకు అర్హత సాధించింది.
లీగ్ దశలో ఉరుగ్వే, బెలారస్‌లను ఓడించిన భారత్... సెమీస్‌లో మరోసారి బెలారస్‌పై గెలిచి ఫైనల్‌కు చేరింది. ఫైనల్లో బరిలోకి దిగడంద్వారా భారత క్రీడాకారిణి దీపిక తన కెరీర్‌లో 200 అంతర్జాతీయ మ్యాచ్‌లను పూర్తి చేసుకుంది. 2003లో భారత్‌కు తొలిసారి ఆడిన ఈ హరియాణా క్రీడాకారిణి గతేడాది ఆసియా చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో చైనాపై కీలక గోల్ సాధించి భారత్‌కు టైటిల్ దక్కడంలో ముఖ్యపాత్ర పోషించింది.
‘ఫైనల్ పోటాపోటీగా సాగింది. ఆరంభంలో వెనుకబడినా ఒత్తిడికి లోనుకాకుండా ఆడి స్కోరును సమం చేశాం. టోర్నీ మొత్తం ప్రతికూల వాతావరణంలో జరిగినా అన్ని సవాళ్లను అధిగమించి విజేతగా నిలిచినందుకు ఆనందంగా ఉంది’ అని భారత కెప్టెన్ రాణి రాంపాల్ వ్యాఖ్యానించింది.