
చివరి వికెట్ తీసిన తర్వాత భారత ఆటగాళ్ల విజయోత్సాహం
అద్భుత అవకాశాన్ని రెండు చేతులా ఒడిసిపట్టారు...
అరుదైన సందర్భాన్ని మధురంగా మార్చుకున్నారు...
ఏ మూలనో ఉన్న అపనమ్మకాన్ని పటాపంచలు చేస్తూ...
ప్రత్యర్థికి కొట్టినపిండిలాంటి పిచ్‌పై వారినే పడగొట్టారు...
విదేశీ గడ్డ మీద తమ సత్తాపై సందేహాలను తీరుస్తూ...
క్లిష్ట పరిస్థితులకు ఎదురొడ్డి మరీ జయకేతనం ఎగరేశారు...
జొహన్నెస్‌బర్గ్: వాండరర్స్ మైదానం మనకు మరోసారి అచ్చొచ్చింది. అందీ అందనట్లుగా ఊరిస్తున్న విజయాన్ని టీమిండియా నిజం చేసుకుంది. పచ్చిక పిచ్‌పై పేస్‌తో బెంబేలెత్తిద్దామని భావించిన ప్రొటీస్‌ను అదే పేస్‌తో బోల్తా కొట్టించింది. ప్రత్యర్థి ప్రతిఘటనతో ఒక దశలో చేజారుతుందేమో అనిపించిన మ్యాచ్‌ను తనవైపు తిప్పుకొని... సఫారీ గడ్డపై తొలి సిరీస్ క్లీన్‌స్వీప్ పరాభవాన్ని తప్పించుకుంది. మహమ్మద్ షమీ (5/28) నిప్పులు చెరిగే బంతులకు బుమ్రా (2/57), ఇషాంత్‌శర్మ (2/31)ల పదునైన బౌలింగ్ తోడవటంతో 241 పరుగుల లక్ష్య ఛేదనలో దక్షిణాఫ్రికా 177కే ఆలౌటైంది. ఓపెనర్ ఎల్గర్ (86 నాటౌట్; 9 ఫోర్లు, 1 సిక్స్), ఆపద్బాంధవుడు ఆమ్లా (52) పోరాడినా... తర్వాతి బ్యాట్స్‌మెన్ చేతులేత్తేశారు. దీంతో శనివారం ఇక్కడ ముగిసిన మూడో టెస్టులో భారత్ 63 పరుగుల తేడాతో గెలుపొందింది. రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ విలువైన పరుగులు చేయడంతో పాటు, నాలుగు వికెట్లు తీసిన భువనేశ్వర్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ పురస్కారం దక్కింది. ఫిలాండర్ ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’గా ఎంపికయ్యాడు. రెండు జట్ల మధ్య ఆరు వన్డేల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్ ఫిబ్రవరి 1న డర్బన్‌లో జరగనుంది.
ఎల్గర్, ఆమ్లా భయపెట్టారు...
శనివారం ఉదయం వర్షం కారణంగా అవుట్ ఫీల్డ్ తడిగా మారి మ్యాచ్ గంట ఆలస్యంగా మొదలైంది. ఓవర్‌నైట్ స్కోరు 17/1తో ఇన్నింగ్స్ కొనసాగించిన ఆతిథ్య జట్టును ఎల్గర్, ఆమ్లా నింపాదిగా నడిపించారు. పరుగులు చేయకున్నా... వికెట్ మాత్రం ఇవ్వలేదు. కొన్నిసార్లు ముందు రోజులాగే అనూహ్య బౌన్స్ అయినా పిచ్ మరీ అంత ఇబ్బందిగా ఏమీ కనిపించలేదు. దీనికితోడు బుమ్రా, షమీ సరైన లెంగ్త్‌లో బంతులేయలేకపోయారు. పిచ్‌ను రోలర్‌తో ఎక్కువగా తొక్కించడం కూడా బ్యాట్స్‌మెన్‌కు ఉపయోగపడింది. ఆమ్లా ఎప్పటిలాగే సాధికారికంగా కనిపించగా... ఎల్గర్ కిందామీద పడుతూనే నిలదొక్కుకున్నాడు. దక్షిణాఫ్రికా 69/1తో లంచ్‌కు వెళ్లింది. విరామం అనంతరం కూడా దక్షిణాఫ్రికా పట్టు కొనసాగింది. కొన్ని మంచి బంతులు పడినా అవేమీ వికెట్ ఇవ్వలేదు. ఈలోగా ప్రత్యర్థి స్కోరు 100కు చేరింది. ప్రధాన పేసర్లతో కాకపోవడంతో పాండ్యాను దించినా ఫలితం దక్కలేదు. అతడి బౌలింగ్‌లోనే బౌండరీతో ఎల్గర్ అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. అయితే... అతడి బౌలింగ్‌కు పిచ్ స్పందించిన తీరు చూశాక ఆశలు చిగురించాయి.
ఇషాంత్, బుమ్రా భళా...
మరోవైపు ఆమ్లా కూడా 50 దాటాడు. స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్‌తో పాటు ఆల్‌రౌండర్లు ఆడాల్సి ఉండటంతో సఫారీ జట్టు అప్పటికింకా పోటీలోనే ఉంది. అయితే... ఇక్కడే ఇషాంత్, బుమ్రా విజృంభించారు. ప్రధాన బ్యాట్స్‌మెన్ నలుగురినీ స్వల్ప వ్యవధిలో వెనక్కుపంపి భారత్‌ను గెలుపు దిశగా నడిపించారు. తొలుత ఇషాంత్ బంతిని ఫ్లిక్ చేయబోయి ఆమ్లా... పాండ్యాకు చిక్కాడు. దీంతో రెండో వికెట్‌కు 119 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఈ టెస్టులో ఇదే ఏకైక శతక భాగస్వామ్యం కావడం విశేషం. ఆ జట్టుకు పెద్ద షాక్ మాత్రం డివిలియర్స్ (6) నిష్క్రమణే. టీ బ్రేక్‌కు పది నిమిషాలు కూడా లేని సమయంలో బుమ్రా వేసిన అద్భుత బంతికి అతడు గల్లీలో రహానేకు క్యాచ్ ఇచ్చాడు. అప్పటికి జట్టు స్కోరు 131/3. జట్టును గెలిపించాల్సిన బాధ్యతను భుజాన మోస్తూ క్రీజులోకి వచ్చిన కెప్టెన్ డుప్లెసిస్ (2) ఘోరంగా విఫలమయ్యాడు. ఇషాంత్ బంతిని ఆడలేక బౌల్డయ్యాడు. డికాక్ (0) బుమ్రాకు వికెట్ల ముందు అడ్డంగా దొరికిపోయాడు. 124/1 నుంచి 145/5కు చేరిన ప్రొటీస్ ఆత్మరక్షణలో పడిపోయారు.
షమీ మ్యాజిక్...
క్రీజులో పాతుకుపోయిన ఎల్గర్ వికెట్ ఇవ్వడం లేదు. దీంతోపాటు లోతైన బ్యాటింగ్ లైనప్ ఉండటంతో భారత్ విజయంపై ఏ మూలనో సందేహం. కానీ వాటన్నిటినీ ఛేదిస్తూ షమీ చెలరేగాడు. యార్కర్లతో ప్రొటీస్ లోయరార్డర్‌ను కకావికలు చేశాడు. అతడి ధాటికి ఫిలాండర్, ఫెలూక్‌వాయో, మోర్కెల్ ఖాతానే తెరవలేకపోయారు. వీరు ముగ్గురూ బౌల్డ్ అవడం గమనార్హం. ఈ మధ్యలో రబడ (0)ను భువీ వెనక్కుపంపాడు. చివరి వికెట్ మాత్రమే ఉన్న దశలో లాభం లేదని భావించి ఎల్గర్ సిక్స్; ఫోర్ కొట్టాడు. అయితే... ఇన్‌గిడిని (4)ని అవుట్ చేసిన షమీ ప్రత్యర్థి ఇన్నింగ్స్‌కు తెరదించాడు. అయిదో వికెట్‌ను తన ఖాతాలో వేసుకుని భారత్‌కు గెలుపునందించాడు.
విదేశాల్లో ఇంకా ఆడగలం
మేం సవాల్‌ను స్వీకరించాం. కఠినమైన పిచ్‌పై మా కుర్రాళ్లు నాలుగు రోజులు అద్భుతంగా ఆడారు. మొదట బ్యాటింగ్ చేయడం కలిసొచ్చింది. రెండు టెస్టుల్లోనూ విజయానికి దగ్గరగా వచ్చాం. ఈసారి గెలిచాం. ప్రతిఘటనను ఊహించాం. ఆమ్లా, ఎల్గర్ అద్భుతంగా ఆడినా ఛేదన కష్టమే. ఒత్తిడిలో వికెట్లు పడిపోతుండగా పైచేయి సాధించలేరు. మేం పరుగులు ఇవ్వకపోవడమూ ఉయయోగపడింది. మా బౌలింగ్ పెద్ద సానుకూలాంశం. 60 వికెట్లు పడగొట్టడం అరుదు. టెస్టులు గెలవాలంటే బౌలర్లలో ఆత్మవిశ్వాసం ఉండాలి. బ్యాట్స్‌మెన్ మెరుగుపడితే విదేశాల్లో తరచూ విజయాలు సాధించగలమని నేను నమ్ముతున్నా. – విరాట్ కోహ్లి, భారత కెప్టెన్
బ్యాటింగ్‌ను ఆస్వాదించా
చాలా సంతోషంగా ఉంది. అవకాశం దొరికినప్పుడల్లా రాణించేందుకు ప్రయత్నించా. అది జట్టుకు సరైన సమయంలో మేలు చేసింది. టెస్టుల్లో బ్యాటింగ్‌ను ఆస్వాదిస్తా. పిచ్ కఠినంగా ఉన్నా... సాధ్యమైన మేర నిలదొక్కుకోవాలని భావించా. అదృష్టవశాత్తు పరుగులు వచ్చాయి. కొన్ని బంతులు అసహజంగా లేచినా మొత్తమ్మీద ఇది అద్భుతమైన పిచ్.
– భువనేశ్వర్, భారత పేసర్
భారత్ అద్భుతంగా ఆడింది
మేం అవకాశాలను అందిపుచ్చుకోలేకపోయాం. బౌలింగ్‌లో స్థిరత్వం లోపించింది. ఫీల్డింగ్ సగటు స్థాయిలో ఉంది. బ్యాటింగ్‌కు కష్టమైన పిచ్ ఇది. ఆమ్లా, ఎల్గర్ ఉదయం ఆడిన తీరు చూసి ఆశ్చర్యపోయాం. బంతి ఆలస్యంగా స్పందిస్తుందని పిచ్ చరిత్ర చూస్తే తెలుస్తుంది. అయినా సిరీస్ గెలుపుపై సంతోషంగా ఉన్నాం. ఈ టెస్టుకు ముందు 2–1తో సిరీస్ ముగుస్తుందని ఊహించను కూడా లేదు. భారత్ అద్భుతంగా ఆడింది.
– డు ప్లెసిస్, దక్షిణాఫ్రికా కెప్టెన్
►1 మూడు టెస్టుల సిరీస్‌లో ఇరు జట్లు 12 సార్లు కూడా ఆలౌట్ కావడం (మొత్తం 120 వికెట్లు) టెస్టు చరిత్రలో ఇది మొదటి సారి మాత్రమే.
► 2 విదేశీ గడ్డపై మూడు టెస్టుల సిరీస్‌లో భారత్ ప్రత్యర్థి వికెట్లన్నీ కుప్పకూల్చడం ఇది రెండో సారి మాత్రమే. గతంలో 1986లో ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్‌లో భారత్ ఆరు ఇన్నింగ్స్‌లలోనూ ప్రత్యర్థిని ఆలౌట్ చేసింది.
►21 కెప్టెన్‌గా కోహ్లి విజయాల సంఖ్య. ధోని (27) తర్వాత రెండో స్థానంలో ఉన్నాడు.
‘ఫ్రీడమ్ ట్రోఫీ’తో టెస్టు సిరీస్ విజేత దక్షిణాఫ్రికా జట్టు
Comments
Please login to add a commentAdd a comment