పోర్ట్ ఆఫ్ స్పెయిన్: కరీబియన్ పర్యటనలో పరిమిత ఓవర్ల ఫార్మాట్‌ను టీమిండియా అజేయంగా ముగించింది. కెప్టెన్ కోహ్లి (99 బంతుల్లో 114 నాటౌట్; 14 ఫోర్లు) అజేయ సెంచరీకి తోడు అయ్యర్ (41 బంతుల్లో 65; 3 ఫోర్లు, 5 సిక్స్‌లు) అర్ధ సెంచరీ కదంతొక్కడంతో బుధవారం వెస్టిండీస్‌తో ఇక్కడ జరిగిన మూడో వన్డేలో 6 వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. వర్షం అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్ లో భారత లక్ష్యాన్ని డక్‌వర్త్ లూయీస్ పద్ధతి ప్రకారం 35 ఓవర్లలో 255గా నిర్దేశించారు. దీనిని కోహ్లి సేన 32.3 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే కోల్పోయి అందుకుంది.
అంతకు ముందు విం డీస్ 35 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 240 పరుగులు చేసింది. ఓపెనర్లు క్రిస్ గేల్ (41 బంతుల్లో 72; 8 ఫోర్లు, 5 సిక్స్‌లు), ఎవిన్ లూయిస్ (29 బంతుల్లో 43; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) ధాటైన ఇన్నింగ్స్‌కు చివర్లో నికొలస్ పూరన్ (16 బంతుల్లో 30; ఫోర్, 3 సిక్స్‌లు) బ్యాట్ ఝళిపించడంతో ప్రత్యర్థి మంచి స్కోరు చేసింది. అనంతరం డ/లూ ప్రకారం టీమిండియా లక్ష్యాన్ని సవరించారు. రెండు వరుస సెంచరీలతో చెలరేగిన కోహ్లికి ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’, ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ పురస్కారాలు దక్కాయి. ఈ నెల 22 నుంచి నార్త్‌సౌండ్‌లో తొలి టెస్టు జరుగుతుంది.
ధావన్ ఆడాడోచ్...
ఓవర్‌కు దాదాపు 7 పరుగుల రన్‌రేట్, పైగా మధ్యలో వర్షం అడ్డుతగిలితే సమీకరణం క్లిష్టమయ్యే పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఓపెనర్ రోహిత్ శర్మ (10) భారత ఛేదనను ధాటిగా ప్రారంభించాడు. రోచ్ వేసిన ఇన్నింగ్ తొలి రెండు బంతులను బౌండరీలు బాదాడు. మరుసటి ఓవర్లో హోల్డర్ బౌలింగ్‌లో శిఖర్ ధావన్ (36 బంతుల్లో 36; 5 ఫోర్లు) సైతం రెండు వరుస ఫోర్లు కొట్టాడు. మూడో ఓవర్లో పరుగుకు యత్నించిన రోహిత్ రనౌట్‌గా వెనుదిరిగాడు. ధావన్–కోహ్లి మూడో వికెట్‌కు 58 బంతుల్లోనే 76 పరుగులు జోడించి చక్కదిద్దారు. ఈ స్థితిలో స్పిన్నర్ ఫాబియాన్ అలెన్ మూడు బంతుల వ్యవధిలో రెండు వికెట్లు తీసి కలవరపెట్టాడు. తొలుత ధావన్ షాట్‌కు యత్నించి మిడాఫ్‌లో కీమో పాల్‌కు క్యాచ్ ఇవ్వగా, అదే రీతిలో ఆడబోయిన పంత్ (0) ఎదుర్కొన్న తొలి బంతికే ఔటయ్యాడు.
‘అయ్యారె’ కోహ్లి
భారత ఛేదనలో చక్కటి స్ట్రయిక్ రొటేషన్, అవసరానికి తగ్గట్లు పరుగులు తీస్తూ, వీలు చూసుకుని భారీ షాట్లు కొడుతూ సాగిన కోహ్లి, అయ్యర్ ఇన్నింగ్స్‌లే హైలైట్. ధావన్ పెవిలియన్ చేరినప్పటికి జట్టు స్కోరు 92/3. మరో 134 బంతుల్లో 163 పరుగులు చేయాలి. సాధించాల్సిన రన్ రేట్ 7.4. అటు పిచ్ నెమ్మదిస్తోంది. కానీ, కోహ్లి–అయ్యర్‌కు ఇవేవీ ప్రతిబంధకం కాలేదు. తమ భాగస్వామ్యంలో మూడు ఓవర్ల పాటు వీరు సంయమనం చూపారు. ఎదుర్కొన్న తొలి 11 బంతుల్లో 5 పరుగులే చేసిన అయ్యర్... అలెన్ బౌలింగ్‌లో ఫోర్‌తో ధాటిని పెంచాడు. చేజ్ ఓవర్లో ఫోర్ కొట్టిన కోహ్లి 48 బంతుల్లో అర్ధ సెంచరీని అందుకున్నాడు. అయితే, అలెన్, చేజ్ ఓవర్లలో 5 బంతుల వ్యవధిలో 3 సిక్స్‌లు బాది అయ్యర్ పరిస్థితిని పూర్తిగా మార్చేశాడు.
అప్పటినుంచి ఓవర్‌కు కనీసం ఒక బౌండరీ లేదంటే సిక్స్‌తో సాగిన వీరి జోరుకు అడ్డే లేకుండా పోయింది. కోహ్లిని మించిన వేగం చూపిన అయ్యర్... పాల్ ఓవర్లో ఫోర్‌తో వరుసగా రెండో అర్ధ సెంచరీ (33 బంతుల్లో) సాధించాడు. 8 వన్డేల కెరీర్‌లో అతడికిది నాలుగో అర్ధసెంచరీ కావడం విశేషం. చేజ్ ఓవర్లో మరో సిక్స్ బాది చెలరేగిపోతున్న అయ్యర్... రోచ్ బౌలింగ్‌లో భారీ షాట్ కొట్టబోయి లాంగాఫ్‌లో హోల్డర్‌కు చిక్కాడు. కానీ, అప్పటికే లక్ష్యం 41 బంతుల్లో 43గా మారి భారత్ విజయం తేలికైపోయింది. కోహ్లి–అయ్యర్ నాలుగో వికెట్‌కు 94 బంతుల్లోనే 120 పరుగుల జోడించారు. రోచ్ ఓవర్లో సింగిల్‌తో కోహ్లి 43వ వన్డే సెంచరీ (94 బంతుల్లో) సాధించాడు. సమయోచితంగా ఆడిన జాదవ్ (12 బంతుల్లో 19 నాటౌట్; ఫోర్, సిక్స్)తో కలిసి లాంఛనాన్ని పూర్తి చేశాడు. 12 పరుగుల వద్ద హోప్ క్లిష్టమైన క్యాచ్ వదిలేయడంతో కోహ్లికి లైఫ్ లభించింది.
Comments
Please login to add a commentAdd a comment