దిగ్విజయం  | India beat West Indies by an innings and 272 runs | Sakshi
Sakshi News home page

దిగ్విజయం 

Published Sun, Oct 7 2018 12:17 AM | Last Updated on Sun, Oct 7 2018 8:49 AM

India beat West Indies by an innings and 272 runs - Sakshi

పట్టుమని 50 ఓవర్లు ఆడలేని ప్రత్యర్థి... కనీసం ఒక సెషన్‌ నిలవలేని బ్యాట్స్‌మెన్‌... అడ్డదిడ్డంగా బాదితేనే ఓ అర్ధ శతకం... పేస్‌ ప్రతాపంతో బెంబేలు... స్పిన్‌ మాయలో కుదేలు... ఇంతకుమించి కాదన్నట్లు పెవిలియన్‌కు వరుస... ఆల్‌రౌండ్‌ వైఫల్యానికి అద్దంపట్టే ప్రదర్శన... ఫలితం... తొలి టెస్టులో విండీస్‌కు ఘోర పరాభవం... కోహ్లి సేనకు ఇన్నింగ్స్‌ తేడాతో దిగ్విజయం!  

రాజ్‌కోట్‌: ఎలాంటి ప్రతిఘటన లేకుండానే తొలి టెస్టు టీమిండియా వశమైంది. పోరాట పటిమే కనబరచని వెస్టిండీస్‌ దాసోహమైంది. రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ బ్యాట్స్‌మెన్‌ చేతులెత్తేయడంతో ఆ జట్టుకు ఘోర పరాభవమే మిగిలింది. అటుఇటుగా రెండున్నర రోజుల్లోనే శనివారం ముగిసిన ఈ టెస్టులో విరాట్‌ కోహ్లి సేన ఏకంగా ఇన్నింగ్స్, 272 పరుగులతో జయభేరి మోగించింది. తొలి ఇన్నింగ్స్‌లో 181కే ఆలౌటై, 468 పరుగులు వెనుకబడి ఫాలోఆన్‌ ఆడిన విండీస్‌... కుల్దీప్‌ (5/57), జడేజా (3/35), అశ్విన్‌ (2/71) స్పిన్‌ దెబ్బకు రెండో ఇన్నింగ్స్‌లో 196 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్‌ కీరన్‌ పావెల్‌ (93 బంతుల్లో 83; 8 ఫోర్లు, 4 సిక్స్‌లు) మినహా మరే బ్యాట్స్‌మెన్‌ నిలవలేకపోయారు. మ్యాచ్‌లో శుక్రవారం 12, శనివారం 14 వికెట్లు కూలడం విశేషం. అరంగేట్రంలోనే శతకంతో అదరగొట్టిన యువ ఓపెనర్‌ పృథ్వీ షాకు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు దక్కింది.  పరుగుల పరంగా భారత్‌కు ఇదే అతిపెద్ద విజయం. జూన్‌లో అఫ్గానిస్తాన్‌తో జరిగిన ఏకైక టెస్టులో మన జట్టు 262 పరుగులతో గెలుపొందింది. ఈ నెల 12 నుంచి ప్రారంభం కానున్న రెండో టెస్టుకు హైదరాబాద్‌లోని ఉప్పల్‌ మైదానం ఆతిథ్యం ఇవ్వనుంది.

ఆ ఇద్దరే... 
ఓవర్‌నైట్‌ స్కోరు 94/6తో మూడో రోజు తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన పర్యాటక జట్టు మరో 19 ఓవర్ల పాటు ఆడగలిగింది. కుల్దీప్‌ వేసిన తొలి ఓవర్లోనే రెండు ఫోర్లు కొట్టి కీమో పాల్‌ (49 బంతుల్లో 47; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) దూకుడు చూపాడు. మరో ఎండ్‌లో ఛేజ్‌ (79 బంతుల్లో 53; 8 ఫోర్లు) వీలున్నప్పుడల్లా బౌండరీలు బాదుతూ స్కోరును నడిపించాడు. షమీ బౌలింగ్‌లో తీవ్రంగా ఇబ్బంది పడిన పాల్‌ను... ఉమేశ్‌ వెనక్కు పంపాడు. ఛాతీ ఎత్తులో వచ్చిన బౌన్సర్‌ను షాట్‌ కొట్టే యత్నంలో అతడు మిడ్‌ వికెట్‌లో పుజారాకు చిక్కాడు. దీంతో 73 పరుగుల ఏడో వికెట్‌ భాగస్వామ్యానికి తెరపడింది. కుల్దీప్‌ ఓవర్లో రెండు ఫోర్లు కొట్టి ఛేజ్‌ అర్ధ శతకం (66 బంతుల్లో) అందుకున్నాడు. అశ్విన్‌ బౌలింగ్‌లో పంత్‌ క్యాచ్‌ వదిలేయడంతో లైఫ్‌ దక్కినా అతడు సద్వినియోగం చేసుకోలేకపోయాడు. అద్భుత బంతితో ఛేజ్‌తో పాటు లూయిస్‌ (0)ను సీనియర్‌ ఆఫ్‌ స్పిన్నర్‌ బౌల్డ్‌ చేశాడు. బిషూ (17 నాటౌట్‌) మూడు ఫోర్లు బాది స్కోరు పెంచేందుకు ప్రయత్నించాడు. కానీ, గాబ్రియెల్‌ (1)ను పంత్‌ స్టంపౌట్‌ చేసి కథ ముగించాడు. అశ్విన్‌ (4/37) నాలుగు వికెట్లు తీయగా, షమీ(2/22)కి  రెండు వికెట్లు దక్కాయి. కుల్దీప్‌ యాదవ్, రవీంద్ర జడేజా, ఉమేశ్‌ యాదవ్‌లు ఒక్కో వికెట్‌ పడగొట్టారు. 

అదే ఆట... రెండోస్సారీ! 
లంచ్‌కు ముందు రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన విండీస్‌ 9 ఓవర్లు ఆడి 32 పరుగులు చేసింది. ఈ వ్యవధిలోనే తాత్కాలిక కెప్టెన్‌ బ్రాత్‌వైట్‌ (10) వికెట్‌ కోల్పోయింది. విరామానికి మరో ఓవర్‌ ఉందనగా అశ్విన్‌ బౌలింగ్‌లో అతడు షార్ట్‌లెగ్‌లో పృథ్వీకి క్యాచ్‌ ఇచ్చాడు. లంచ్‌ నుంచి వస్తూనే కీరన్‌ పావెల్‌ జోరు పెంచాడు. అశ్విన్‌ ఓవర్లో సిక్స్, ఫోర్‌ కొట్టాడు. అయితే, షై హోప్‌ (17)ను కుల్దీప్‌ వికెట్ల ఎదుట దొరకబుచ్చుకున్నాడు. కాసేపటికి 55 బంతుల్లో పావెల్‌ అర్ధశతకం పూర్తయింది. 97/2తో ఫర్వాలేదనిపించే స్థితిలో ఉన్న విండీస్‌ను... నాలుగు బంతుల వ్యవధిలో హేట్‌మైర్‌ (11), ఆంబ్రిస్‌ (0)లను ఔట్‌ చేయడం ద్వారా కుల్దీప్‌ మళ్లీ దెబ్బకొట్టాడు. అనవసర షాట్‌కు యత్నించి హేట్‌మైర్‌ షార్ట్‌ థర్డ్‌ మ్యాన్‌ లో రాహుల్‌కు చిక్కాడు. గూగ్లీని ఆడే క్రమంలో క్రీజు బయటకొచ్చిన ఆంబ్రిస్‌ను పంత్‌ స్టంపౌంట్‌ చేశాడు. ఐదో వికెట్‌ ఛేజ్‌ (24 బంతుల్లో 20; 3 ఫోర్లు), పావెల్‌ 41 పరుగులు జోడించి కొద్దిసేపు వికెట్ల పతనాన్ని నిలువరించారు. కానీ, కుల్దీప్‌ మరోసారి విజృంభించి వీరిద్దరినీ పెవిలియన్‌కు పంపాడు. ఛేజ్‌ ఎక్స్‌ట్రా కవర్‌లో అశ్విన్‌కు, పావెల్‌ సిల్లీ పాయింట్‌లో పృథ్వీకి క్యాచ్‌ ఇచ్చారు. దీంతో టెస్టుల్లో అతడి తొలి ఐదు వికెట్ల ప్రదర్శన నమోదైంది. తొలి ఇన్నింగ్స్‌లో లాగే ఆడబోయిన కీమో పాల్‌ (15 బంతుల్లో 15; 2 ఫోర్లు, 1 సిక్స్‌)ను జడేజా అడ్డుకున్నాడు. సరిగ్గా టీకి ముందటి ఓవర్లో బిషూ (9) వికెట్‌ పతనంతో విండీస్‌ 185/8తో బ్రేక్‌కు వెళ్లింది. ఆ తర్వాత ఏడు ఓవర్లలోనే లూయిస్‌ (4), గాబ్రియెల్‌ (4)లను ఔట్‌ చేసి జడేజా మ్యాచ్‌ను ముగించాడు. 

►100  విండీస్‌పై సాధించిన విజయం టెస్టుల్లో స్వదేశంలో భారత్‌కు వందో గెలుపు.

►1    టెస్టుల్లో భారత్‌కిదే (ఇన్నింగ్స్, 272 పరుగులు) అతిపెద్ద విజయం. దీంతో జూన్‌లో జరిగిన అఫ్గానిస్తాన్‌ అరంగేట్ర టెస్టులో ఇన్నింగ్స్‌ 262 పరుగులతో గెలుపొందిన రికార్డును సవరించింది.  
►2 విండీస్‌కు ఇది రెండో అతిపెద్ద ఓటమి. ఇంగ్లండ్‌తో 2007 లీడ్స్‌ టెస్టులో ఆ జట్టు ఇన్నింగ్స్, 283 పరుగుల తేడాతో ఓడింది.  

►6 టెస్టు అరంగేట్రంలోనే ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా నిలిచిన  ఆరో భారత ఆటగాడు పృథ్వీ. గతంలో  ప్రవీణ్‌ ఆమ్రే, ఆర్పీ సింగ్, అశ్విన్, ధావన్, రోహిత్‌ శర్మ ఈ ఘనత సాధించారు. 
►7 మూడు ఫార్మాట్లలోనూ (టెస్టు, వన్డే, టి20) ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన ఏడో బౌలర్‌ కుల్దీప్‌ యాదవ్‌. టీమిండియా తరఫున ఇంతకుముందు భువనేశ్వర్‌ మాత్రమే ఈ ఘనతను అందుకున్నాడు. 

►42 టెస్టుల్లో ఇన్నింగ్స్‌ తేడాతో నెగ్గడం భారత్‌కిది 42వ సారి. ఈ జాబితాలో వెస్టిండీస్‌ (41)ను వెనక్కినెట్టి భారత్‌ నాలుగో స్థానానికి ఎగబాకింది. ఇంగ్లండ్‌ (104), ఆస్ట్రేలియా (91), దక్షిణాఫ్రికా (46) తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. ఓవరాల్‌గా ఇన్నింగ్స్‌ తేడాతో ఫలితం వచ్చిన 400వ టెస్టు ఇది.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement