విరాట్ సేన సంచలన విజయం
బెంగళూరు:స్వదేశంలో తమకు తిరుగులేదని మరోసారి నిరూపించింది భారత్ క్రికెట్ జట్టు. ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో భారత్ జట్టు 75 పరుగుల తేడాతో సంచలన విజయం సాధించింది. స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకుని మరీ విజయ ఢంకా మోగించింది. ఆసీస్ ను రెండో ఇన్నింగ్స్ లో 112 పరుగులకే కుప్పకూల్చి తొలి టెస్టులో ఎదురైన ఓటమికి ఘనంగా ప్రతీకారం తీర్చుకుంది. దాంతో నాలుగు టెస్టుల సిరీస్ ను 1-1తో సమం చేసింది
భారత్ విసిరిన 188 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆసీస్ తడబడింది. ఏ దశలోనూ భారత్ బౌలింగ్ ను నిలువరించలేక చేతులెత్తేసింది. ప్రధానంగా స్పిన్నర్లు రవి చంద్రన్ అశ్విన్ ఆరు వికెట్లతో సత్తా చాటి ఆసీస్ పతనాన్ని శాసించాడు. అతనికి ఉమేశ్ యాదవ్ రెండు వికెట్లతో చక్కటి సహకారం అందించాడు. ఇషాంత్ శర్మ, రవీంద్ర జడేజాలకు తలో వికెట్ దక్కింది. ఆసీస్ ఆటగాళ్లలో కెప్టెన్ స్టీవ్ స్మిత్(28) దే అత్యధిక స్కోరు కాగా, హ్యాండ్ స్కాంబ్(24), వార్నర్(17), మిచెల్ మార్ష్(13)లే ఆపై రెండంకెల స్కోరును దాటిన ఆటగాళ్లు.
అంతకుముందు 213/4 స్కోరుతో మంగళవారం నాల్గో రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్.. మరో 61 పరుగులు చేసి మిగతా వికెట్లను కోల్పోయింది. ఈ రోజు ఆటలో భాగంగా భారత్ స్కోరు 238 పరుగుల వద్ద రహానే(52) ఐదో వికెట్ గా అవుటయ్యాడు. ఆ తరుణంలో క్రీజ్ లోకి వచ్చిన కరుణ నాయర్ గోల్డెన్ డక్ గా పెవిలియన్ చేరాడు. ఆసీస్ పేసర్ స్టార్క్ బౌలింగ్ లో నాయర్ వచ్చే రావడంతోనే బౌల్డ్ అయ్యాడు. ఆ తరువాత పూజారా(92), అశ్విన్(4)లను మూడు బంతుల వ్యవధిలో హజల్ వుడ్ అవుట్ చేసి భారత్ కు షాకిచ్చాడు. కాగా, హజల్ వుడ్ వేసిన తరువాత ఓవర్ లో ఉమేశ్ యాదవ్(1)అవుట్ కావడంతో భారత్ 258 పరుగుల వద్ద తొమ్మిదో వికెట్ ను కోల్పోయింది. చివర్లో సాహా(20 నాటౌట్)తో కలిసి ఇషాంత్ శర్మ (6) కాసేపు ఆసీస్ బౌలింగ్ ను ప్రతిఘటించారు. దాంతో భారత్ జట్టు రెండో ఇన్నింగ్స్ 274 పరుగులు చేసింది. చివరి వికెట్ గా ఇషాంత్ అవుట్ కావడంతో భారత్ రెండో ఇన్నింగ్స్ తొలి సెషన్ లోనే ముగిసింది.
భారత్ తొలి ఇన్నింగ్స్ 189 ఆలౌట్, రెండో ఇన్నింగ్స్ 274 ఆలౌట్
ఆసీస్ తొలి ఇన్నింగ్స్ 276 ఆలౌట్ ,రెండో ఇన్నింగ్స్ 112 ఆలౌట్