‘గులాబీ’ గుచ్చుకుంది! | India all out for 180 in first innings of day night Test | Sakshi
Sakshi News home page

‘గులాబీ’ గుచ్చుకుంది!

Published Sat, Dec 7 2024 3:56 AM | Last Updated on Sat, Dec 7 2024 3:56 AM

India all out for 180 in first innings of day night Test

డే అండ్‌ నైట్‌ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 180 ఆలౌట్‌

మిచెల్‌ స్టార్క్‌కు 6 వికెట్లు 

ఆస్ట్రేలియా 86/1  

నాలుగేళ్ల క్రితం తమకు అచ్చిరాని అడిలైడ్‌ మైదానంలో అదే డే అండ్‌ నైట్‌ టెస్టులో మరోసారి గులాబీ బంతిని సమర్థంగా ఎదుర్కోవడంలో భారత బ్యాటర్లు విఫలమయ్యారు. ‘పింక్‌ బాల్‌’ స్పెషలిస్ట్‌ స్టార్క్‌ పదునైన బంతులతో చెలరేగడంతో రెండు సెషన్లకే భారత బ్యాటర్లు తమ ఇన్నింగ్స్‌ను ముగించారు. ఒక్క నితీశ్‌ కుమార్‌ రెడ్డి మాత్రమే తన దూకుడుతో ఆకట్టుకోగలిగాడు. 

గత టెస్టులో కుప్పకూలిన ఆస్ట్రేలియా టాపార్డర్‌ ఇప్పుడు కాస్త పట్టుదల కనబర్చడంతో తొలి రోజు ఆధిపత్యం ఆతిథ్య జట్టు ఖాతాలో చేరింది. పెర్త్‌ టెస్టు తరహాలోనే మన బౌలర్లు ప్రత్యర్థిని పడగొడతారా లేక రెండో రోజు బలమైన బ్యాటింగ్‌తో ఆ్రస్టేలియా పటిష్ట స్థితికి చేరుతుందా చూడాలి.  

అడిలైడ్‌: ఆ్రస్టేలియాతో రెండో టెస్టులో భారత బ్యాటింగ్‌ తడబడింది. గత మ్యాచ్‌ తరహాలోనే తొలి ఇన్నింగ్స్‌లో తక్కువ స్కోరుకే పరిమితమైంది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్‌ తమ తొలి ఇన్నింగ్స్‌లో 44.1 ఓవర్లలో 180 పరుగులకు ఆలౌటైంది. నితీశ్‌ కుమార్‌ రెడ్డి (54 బంతుల్లో 42; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) టాప్‌ స్కోరర్‌గా నిలవగా... రాహుల్‌ (64 బంతుల్లో 37; 6 ఫోర్లు), గిల్‌ (51 బంతుల్లో 31; 5 ఫోర్లు) కీలక పరుగులు సాధించారు.

మిచెల్‌ స్టార్క్‌ (6/48) తన కెరీర్‌లో అత్యుత్తమ బౌలింగ్‌ ప్రదర్శనతో భారత్‌ను దెబ్బ కొట్టాడు. అనంతరం ఆ్రస్టేలియా ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో ఒక వికెట్‌ నష్టపోయి 33 ఓవర్లలో 86 పరుగులు చేసింది. మెక్‌స్వీనీ (38 బ్యాటింగ్‌; 6 ఫోర్లు), లబుషేన్‌ (20 బ్యాటింగ్‌; 3 ఫోర్లు) క్రీజులో ఉన్నారు. భారత తొలి ఇన్నింగ్స్‌ స్కోరుకు ఆ్రస్టేలియా మరో 94 పరుగులు వెనుకబడి ఉంది. 

ఈ ఆసక్తికర పోరుకు తొలి రోజు రికార్డు స్థాయిలో 50,186 మంది ప్రేక్షకులు హాజరు కావడం విశేషం. పదేళ్ల క్రితం మైదానంలో గాయపడి మృతి చెందిన ఫిల్‌ హ్యూస్, ఇటీవల కన్నుమూసిన మాజీ ఆటగాడు ఇయాన్‌ రెడ్‌పాత్‌ స్మృతిలో ఆసీస్‌ ఆటగాళ్లు భుజాలకు నలుపు రంగు బ్యాండ్‌లు ధరించి బరిలోకి దిగారు.  

కీలక భాగస్వామ్యం... 
భారత ఇన్నింగ్స్‌ అనూహ్య రీతిలో మొదలైంది. మ్యాచ్‌ తొలి బంతికి యశస్వి జైస్వాల్‌ (0)ను అవుట్‌ చేసి స్టార్క్‌ దెబ్బ కొట్టాడు. 140.4 కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చిన బంతికి జైస్వాల్‌ వికెట్ల ముందు దొరికిపోయాడు. ఆ తర్వాత గిల్‌ ఆత్మవిశ్వాసంతో బ్యాటింగ్‌ చేయగా, రాహుల్‌ కాస్త జాగ్రత్త ప్రదర్శించాడు. బోలండ్‌ తొలి ఓవర్లో రాహుల్‌ కొంత ఉత్కంఠను ఎదుర్కొన్నాడు. తొలి బంతికి అతను కీపర్‌కు క్యాచ్‌ ఇవ్వగా అది ‘నోబాల్‌’ అయింది.

అయితే ఆ తర్వాత రీప్లేలో బంతి బ్యాట్‌కు తాకలేదని కూడా తేలింది. అదే ఓవర్లో రాహుల్‌ ఇచ్చిన సునాయాస క్యాచ్‌ను ఖ్వాజా వదిలేశాడు. అయితే కొద్ది సేపటి తర్వాత పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. 12 పరుగుల వ్యవధిలో భారత్‌ 3 కీలక వికెట్లు కోల్పోయింది. రాహుల్, కోహ్లి (7)లను స్టార్క్‌ అవుట్‌ చేయగా... గిల్‌ వికెట్‌ బోలండ్‌ ఖాతాలో చేరడంతో తొలి సెషన్‌ ముగిసేసరికి స్కోరు 82/4కు చేరింది. 

బ్రేక్‌ తర్వాత కూడా పరిస్థితి మారలేదు. ఆరో స్థానంలో ఆడిన రోహిత్‌ శర్మ (3) విఫలం కాగా... రిషభ్‌ పంత్‌ (21; 2 ఫోర్లు), అశ్విన్‌ (22; 3 ఫోర్లు) ఎక్కువ సేపు నిలవలేకపోయారు. హర్షిత్‌ రాణా (0)ను అవుట్‌ చేసి స్టార్క్‌ ఐదో వికెట్‌ను తన ఖాతాలో వేసుకోగా, స్టార్క్‌ బౌలింగ్‌లోనే భారీ షాట్‌ ఆడే క్రమంలో నితీశ్‌ చివరి వికెట్‌గా వెనుదిరిగాడు. రెండో సెషన్‌లో భారత్‌ 21.1 ఓవర్లలో 98 పరుగులు చేసి 6 వికెట్లు కోల్పోయింది.
  
వికెట్‌ కాపాడుకుంటూ... 
తొలి టెస్టులో ఆరంభంలోనే వికెట్లు కోల్పోయి ఓటమికి బాటలు పడటంతో ఈసారి ఆసీస్‌ ఓపెనర్లు జాగ్రత్తగా ఇన్నింగ్స్‌ను ఆరంభించారు. అయితే 2 పరుగుల వద్ద మెక్‌స్వీనీ ఇచ్చిన క్యాచ్‌ను పంత్‌ వదిలేయం కూడా కలిసొచ్చి0ది. పంత్‌ అడ్డుగా రాకపోతే బంతి నేరుగా రోహిత్‌ చేతుల్లోకి వెళ్లేది! తొలి 10 ఓవర్లలో ఆసీస్‌ వికెట్‌ కోల్పోలేదు. 

అయితే బుమ్రా వేసిన తర్వాతి ఓవర్లో ఉస్మాన్‌ ఖ్వాజా (13; 2 ఫోర్లు) పెవిలియన్‌ చేరాడు. వరుస వైఫల్యాలతో జట్టులో స్థానం కోల్పోయే స్థితిలో క్రీజ్‌లోకి వచ్చిన లబుషేన్‌ ఈ సారి కూడా ఆరంభంలో బాగా తడబడ్డాడు. ఎట్టకేలకు 19వ బంతికి అతను ఖాతా తెరిచాడు. మరోవైపు క్రీజులో నిలదొక్కుకున్న తర్వాత మెక్‌స్వీనీ కొన్ని చక్కటి షాట్లతో ఆకట్టుకున్నాడు. 22 ఓవర్ల పాటు ఈ జోడీని విడదీయడంలో భారత బౌలర్లు విఫలమయ్యారు. 
 
స్కోరు వివరాలు  
భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: జైస్వాల్‌ (ఎల్బీ) (బి) స్టార్క్‌ 0; రాహుల్‌ (సి) మెక్‌స్వీనీ (బి) స్టార్క్‌ 37; గిల్‌ (ఎల్బీ) (బి) బోలండ్‌ 31; కోహ్లి (సి) స్మిత్‌ (బి) స్టార్క్‌ 7; పంత్‌ (సి) లబుõÙన్‌ (బి) కమిన్స్‌ 21; రోహిత్‌ (ఎల్బీ) (బి) బోలండ్‌ 3; నితీశ్‌ కుమార్‌ రెడ్డి (సి) హెడ్‌ (బి) స్టార్క్‌ 42; అశ్విన్‌ (ఎల్బీ) (బి) స్టార్క్‌ 22; హర్షిత్‌ (బి) స్టార్క్‌ 0; బుమ్రా (సి) ఖ్వాజా (బి) కమిన్స్‌ 0; సిరాజ్‌ (నాటౌట్‌) 4; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (44.1 ఓవర్లలో ఆలౌట్‌) 180. వికెట్ల పతనం: 1–0, 2–69, 3–77, 4–81, 5–87, 6–109, 7–141, 8–141, 9–176, 10–180. 
బౌలింగ్‌: స్టార్క్‌ 14.1–2–48–6, కమిన్స్‌ 12–4– 41–2, బోలండ్‌ 13–0–54–2, లయన్‌ 1–0–6– 0, మార్‌‡్ష 4–0–26–0. 
ఆ్రస్టేలియా తొలి ఇన్నింగ్స్‌: ఖ్వాజా (సి) రోహిత్‌ (బి) బుమ్రా 13; మెక్‌స్వీనీ (బ్యాటింగ్‌) 38; లబుషేన్‌ (బ్యాటింగ్‌) 20; ఎక్స్‌ట్రాలు 15; మొత్తం (33 ఓవర్లలో వికెట్‌ నష్టానికి) 86. వికెట్ల పతనం: 1–24. బౌలింగ్‌: బుమ్రా 11–4–13–1, సిరాజ్‌ 10–3–29–0, హర్షిత్‌ 8–2–18–0, నితీశ్‌ 3–1–12–0, అశ్విన్‌ 1–1–0–0.

3 ఆసీస్‌ ఓపెనర్‌ ఖ్వాజాను అవుట్‌ చేయడంతో బుమ్రా ఈ ఏడాది టెస్టుల్లో 50 వికెట్లను పూర్తి చేసుకున్నాడు. తద్వారా ఒకే ఏడాది 50 అంతకంటే ఎక్కువ వికెట్లు పడగొట్టిన మూడో భారతీయ పేసర్‌గా బుమ్రా గుర్తింపు పొందాడు. గతంలో కపిల్‌ దేవ్‌ రెండుసార్లు (1983లో 18 టెస్టుల్లో 75 వికెట్లు; 1979లో 17 టెస్టుల్లో 74 వికెట్లు), జహీర్‌ ఖాన్‌ (2002లో 15 టెస్టుల్లో 51 వికెట్లు) ఒకసారి ఈ ఘనత సాధించారు.  

నితీశ్‌... తగ్గేదేలే 
పెర్త్‌ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత టాప్‌ స్కోరర్‌గా నిలిచిన ఆంధ్ర కుర్రాడు నితీశ్‌ కుమార్‌ రెడ్డి ఈ మ్యాచ్‌లోనూ దానిని పునరావృతం చేశాడు. ఈసారి బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ఏడో స్థానంలో బరిలోకి దిగిన అతని ఆట వల్లే భారత్‌ ఈమాత్రం స్కోరు చేయగలిగింది. భారత్‌ ఇన్నింగ్స్‌లో 3 సిక్స్‌లూ అతని ద్వారానే వచ్చాయి. 

స్టార్క్‌ బౌలింగ్‌లో ఎక్స్‌ట్రా కవర్‌ మీదుగా అద్భుత సిక్స్‌ కొట్టిన అతను... బోలండ్‌ ఓవర్లో 2 సిక్స్‌లు, ఒక ఫోర్‌తో ధాటిని ప్రదర్శించాడు. ఇందులో స్లిప్‌ కార్డన్‌ మీదుగా ‘రివర్స్‌ స్కూప్‌’తో అతను కొట్టిన సిక్సర్‌ ఆట మొత్తానికే హైలైట్‌గా నిలిచింది. ఆస్ట్రేలియా గడ్డపై పేసర్ల బౌలింగ్‌లో అత్యధిక (5) సిక్స్‌లు కొట్టిన భారత బ్యాటర్‌గా తన రెండో టెస్టులోనే నితీశ్‌ గుర్తింపు సాధించడం విశేషం.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement