బెంగళూరు: స్వల్ప లక్ష్యాలను కాపాడుకుని గెలవడం భారత్ కు కొత్తేమీ కాదు. గతంలో చాలాసార్లు తక్కువ స్కోర్ల మ్యాచ్ లో భారత్ అద్భుతమైన విజయాల్ని నమోదు చేసింది. దాంతో ఆసీస్ తో ఇక్కడ జరిగిన రెండో టెస్టులో భారత్ విజయంపై సగటు అభిమాని కాస్త ధీమాగానే ఉన్నాడు. కేవలం 188 పరుగుల లక్ష్యాన్ని భారత్ కాపాడుకుని విజయం సాధించకపోదా? అని వేచి చూశాడు. బ్యాటింగ్ కు కష్టంగా మారిన పిచ్ పై భారత్ బౌలర్లు రాణించరా?అనే ఆశతో మ్యాచ్ ను వీక్షించారు.
ఇందుకు కారణం భారత్ గతంలో రెండుసార్లు ఆస్ట్రేలియాకు తక్కువ లక్ష్యాన్ని నిర్దేశించి గెలవడమే. తొలిసారి 1981లో మెల్ బోర్న్ క్రికెట్ గ్రౌండ్(ఎంసీజీ)లో 143 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించిన భారత్ 59 పరుగుల తేడాతో గెలిచింది. ఆ మ్యాచ్ లో ఆసీస్ ను రెండో ఇన్నింగ్స్ లో 83 పరుగులకే కుప్పకూల్చి విజయం సాధించింది. ఆ తరువాత 2004లో ముంబైలోని వాంఖేడ్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో 107 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ కు భారత్ నిర్దేశించింది. ఆ మ్యాచ్ లో 93 పరుగులకు ఆసీస్ ను కట్టడి చేసిన భారత్ 13 పరుగుల తేడాతో గెలుపొందింది. తాజా మ్యాచ్ లో ఆసీస్ పై 75 పరుగుల తేడాతో భారత్ గెలిచింది. ఆసీస్ కు 188 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించి గెలుపొందింది. మొత్తంగా 200 పరుగుల లోపు లక్ష్యాన్ని కాపాడుకుని భారత్ గెలవడం ఇది ఐదోసారి. తాజా మ్యాచ్ ఫలితంలో కలుపుకుని ఆస్ట్రేలియాపై మూడుసార్లు, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ పై తలో ఒకసారి భారత్ గెలిచింది.
ఆస్ట్రేలియాపై మూడోసారీ..
Published Tue, Mar 7 2017 3:50 PM | Last Updated on Tue, Sep 5 2017 5:27 AM
Advertisement