పరాజయం పిలుస్తోంది | India vs Australia: 2nd Test Day 4 Team India 112/5 at Stumps  | Sakshi
Sakshi News home page

పరాజయం పిలుస్తోంది

Published Tue, Dec 18 2018 12:00 AM | Last Updated on Tue, Dec 18 2018 4:54 AM

India vs Australia: 2nd Test Day 4 Team India 112/5 at Stumps  - Sakshi

ఆస్ట్రేలియాతో సిరీస్‌లో తొలి టెస్టులోనే విజయం సాధించి కొత్తగా కనిపించిన భారత జట్టు మళ్లీ పాత దారిలోకే వచ్చేసింది. 200 పరుగులు దాటితే ఛేదించడం తమ వల్ల కాదన్నట్లుగా ఈ ఏడాదిలో ఐదు విఫల ప్రయత్నాలు చేసిన టీమిండియా జాబితాలో మరో టెస్టు చేరడం దాదాపు ఖాయమైంది. రెండో టెస్టులో 287 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 112 పరుగులకే టాప్‌–5 వికెట్లు కోల్పోయిన జట్టు ఓటమి దిశగా సాగుతోంది. ఇద్దరు జూనియర్లు క్రీజ్‌లో ఉండగా, మరో వికెట్‌ పడితే చాలు... మన బౌలర్లు చేసేదేమీ లేదు కాబట్టి మరో 175 పరుగులు దాదాపు అసాధ్యమే. ముందుగా బ్యాటింగ్‌లో కీలక పరుగులు జోడించడంతో పాటు బౌలింగ్‌లోనూ మెరిసిన ఆస్ట్రేలియా సిరీస్‌ సమం చేసేందుకు సన్నద్ధమవుతుండగా, మ్యాచ్‌ చివరి రోజు మంగళవారం మిగిలిన భారత బ్యాట్స్‌మెన్‌ ఎంత మేరకు పోరాడగలరో చూడాలి.  

పెర్త్‌: వరుసగా మరో విజయం సాధించి బోర్డర్‌–గావస్కర్‌ ట్రోఫీని నిలబెట్టుకోవాలని ఆశించిన కోహ్లి సేన మరి కొంత సమయం ఆగాల్సిందే! ఇక్కడ జరుగుతున్న రెండో టెస్టులో నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్‌ విజయంపై కన్నేసింది. 287 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌ ప్రస్తుతం 5 వికెట్ల నష్టానికి 112 పరుగులు చేసింది. రహానే (47 బంతుల్లో 30; 2 ఫోర్లు, 1 సిక్స్‌) టాప్‌ స్కోరర్‌ కాగా, హనుమ విహారి (24 బ్యాటింగ్‌), రిషభ్‌ పంత్‌ (9 బ్యాటింగ్‌) క్రీజ్‌లో ఉన్నారు. కెప్టెన్‌ కోహ్లి (17) విఫలమయ్యాడు. ఆసీస్‌ బౌలర్లలో హాజల్‌వుడ్, లయన్‌ చెరో 2 వికెట్లు పడగొట్టారు. అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 132/4తో ఆట కొనసాగించిన ఆస్ట్రేలియా తమ రెండో ఇన్నింగ్స్‌లో 243 పరుగులకు ఆలౌటైంది. ఉస్మాన్‌ ఖాజా (72; 5 ఫోర్లు) అర్ధ సెంచరీ చేయగా, కెప్టెన్‌ టిమ్‌ పైన్‌ (37) రాణించాడు. భారత పేసర్‌ షమీ (6/56) కెరీర్‌లో అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేయడం విశేషం.   

ఆసీస్‌ జోరు... 
నాలుగో రోజు ఉదయం ఖాజా, పైన్‌ చక్కటి సమన్వయంతో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌ను నడిపించారు. వీరిద్దరు భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్నారు. ఈ క్రమంలో 155 బంతుల్లో ఖాజా అర్ధసెంచరీ పూర్తి కాగా, ఆధిక్యం కూడా 200 పరుగులు దాటింది. బ్యాట్స్‌మెన్‌ పట్టుదలగా ఆడటంతో భారత్‌ తొలి సెషన్‌లో ఒక్క వికెట్‌ కూడా పడగొట్టలేకపోయింది. ఈ సెషన్‌లో 30 ఓవర్లు ఆడిన ఆసీస్‌ 58 పరుగులు జోడించింది.  

చెలరేగిన షమీ... 
అయితే లంచ్‌ తర్వాత ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. 15.3 ఓవర్లలోనే భారత్‌ మిగిలిన 6 వికెట్లను పడగొట్టడం విశేషం. ఇందులో షమీ ఒక్కడే నాలుగు తీశాడు. తొలి ఓవర్లోనే షమీ వేసిన షార్ట్‌ బంతి నుంచి పైన్‌ తప్పించుకునే ప్రయత్నం చేయగా గ్లవ్‌కు తగిలిన బంతి స్లిప్‌లో కోహ్లి చేతుల్లో పడింది. ఆదివారం గాయంతో రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరిగిన ఫించ్‌ (31 బంతుల్లో 25; 5 ఫోర్లు) మళ్లీ బ్యాటింగ్‌కు రాగా, తర్వాతి బంతికే షమీ అతడినీ పెవిలియన్‌ పంపించాడు. మరో రెండు ఓవర్ల తర్వాత షమీ వేసిన మరో అద్భుత బంతికి ఖాజా కూడా ఔటయ్యాడు. కమిన్స్‌ (1)ను బుమ్రా వెనక్కి పంపగా, లయన్‌ (5) వికెట్‌ కూడా షమీ ఖాతాలోకే వెళ్లింది. కేవలం 15 పరుగుల వ్యవధిలో ఆసీస్‌ ఈ ఐదు వికెట్లు కోల్పోయింది. ఇక ఆసీస్‌ ఆట ముగిసేందుకు ఎంతో సేపు పట్టదనిపించింది. అయితే చివరి వికెట్‌ జోడి హాజల్‌వుడ్‌ (17 నాటౌట్‌), స్టార్క్‌ (14) భారత్‌ను చికాకు పెట్టింది. చకచకా పరుగులు చేసిన వీరిద్దరు ఐదు ఫోర్లు సహా 39 బంతుల్లోనే 36 పరుగులు జోడించారు. ఎట్టకేలకు మళ్లీ బౌలింగ్‌కు వచ్చిన బుమ్రా రెండో బంతికే స్టార్క్‌ను బౌల్డ్‌ చేసి ఆసీస్‌ ఆటకు తెరదించాడు.  

మరోసారి విఫలం... 
ఛేదనలో భారత్‌కు మళ్లీ నిరాశాజనక ఆరంభం లభించింది. ఇన్నింగ్స్‌ నాలుగో బంతిని రాహుల్‌ (0) వికెట్లపైకి ఆడుకోగా, ఆశలు పెట్టుకున్న పుజారా (4) కూడా ఎక్కువ సేపు నిలవలేదు. ఈ దశలో విజయ్‌ (20), కోహ్లి కొద్దిసేపు ప్రత్యర్థి బౌలర్లను నిరోధించారు. 35 పరుగుల భాగస్వామ్యంతో ఈ జోడి నిలదొక్కుకున్నట్లు కనిపించగా... లయన్‌ రాకతో పరిస్థితి మారిపోయింది. చక్కటి బంతితో కోహ్లిని ఔట్‌ చేసిన అతను, తర్వాతి ఓవర్లోనే విజయ్‌ను బౌల్డ్‌ చేశాడు. అయితే ఆ తర్వాత రహానే, విహారి కూడా సమర్థంగా బౌలర్లను ఎదుర్కొన్నారు. రహానే మరోసారి 2 ఫోర్లు, స్టార్క్‌ బౌలింగ్‌లో సిక్సర్‌తో ధాటిని ప్రదర్శించాడు. లయన్‌ ఓవర్లో స్వీప్‌షాట్లతో రెండు బౌండరీలు రాబట్టడం ఆకట్టుకుంది. అయితే దూకుడుగా ఆడే ప్రయత్నంలో రహానే వెనుదిరిగడంతో భారత్‌కు దెబ్బ పడింది. ఆ తర్వాత 6.1 ఓవర్ల పాటు విహారి, పంత్‌ వికెట్‌ కోల్పోకుండా జాగ్రత్త పడ్డారు.  

కోహ్లికి సెట్టింగ్‌! 
నాలుగో రోజు కోహ్లి ఔటైన క్షణమే మ్యాచ్‌పై భారత్‌ ఆశలు ఆవిరయ్యాయి. లయన్‌ చక్కటి వ్యూహంతో టీమిండియా కెప్టెన్‌ను ఔట్‌ చేశాడు. లయన్‌ మొత్తం ఎనిమిది బంతులు కోహ్లికి వేశాడు. తొలి ఏడు ఒకే తరహాలో పడ్డాయి. వాటిని నేరుగా వికెట్ల పైకి స్పిన్‌ అయ్యేలా సంధించాడు. వాటన్నింటినీ లెగ్‌సైడ్‌ దిశగానే ఫ్లిక్‌ చేసిన కోహ్లి చివరి బంతికి సింగిల్‌ తీశాడు. ఎనిమిదో బంతి మాత్రం ఆఫ్‌ స్టంప్‌ బయటకు వేయగా కోహ్లి ముందుకొచ్చి డిఫెన్స్‌ ఆడాల్సి వచ్చింది. బంతి పెద్దగా టర్న్‌ కూడా కాలేదు. కోహ్లి బ్యాట్‌ ఎడ్జ్‌కు తగిలి నేరుగా స్లిప్‌లో ఉన్న ఖాజా చేతుల్లో పడింది. దాంతో భారత కెప్టెన్‌ నిరాశగా వెనుదిరగాల్సి వచ్చింది.   

ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌కు పిలుపు 
ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో తగిలిన గాయంతో తొలి రెండు టెస్టులు ఆడని యువ పృథ్వీ షా టెస్టు సిరీస్‌కు పూర్తిగా దూరమయ్యాడు. మిగిలిన రెండు టెస్టుల కోసం అతని స్థానంలో కర్ణాటక ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌ను సెలక్టర్లు ఎంపిక చేశారు. మరోవైపు గాయంతో జట్టుకు దూరమైన ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యాకు కూడా చోటు దక్కింది. ముంబైతో రంజీ మ్యాచ్‌లో పాండ్యా అర్ధ సెంచరీతో పాటు 7 వికెట్లు తీసి ఫిట్‌నెస్‌ నిరూపించుకోగా, 46 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లలో మయాంక్‌ 49.98 సగటుతో 3599 పరుగులు చేశాడు.    

స్పిన్నర్‌ ఉంటే బాగుండేది 
‘చాలా రోజుల తర్వాత మన పేస్‌ బౌలింగ్‌ దళం చాలా పదునుగా కనిపిస్తోంది. నాలుగేళ్ల క్రితం దీని గురించి అసలే మాత్రం ఊహించలేదు. మీరు కూడా మా బౌలింగ్‌ ఎంత మెరుగైందో చూస్తున్నారు. మన తరహాలో ఆలోచించే (పేస్‌) బౌలర్‌ అవతలి ఎండ్‌లో ఉంటే మన ఆట కూడా బాగుంటుంది. తుది జట్టు ఎంపిక టీమ్‌ మేనేజ్‌మెంట్‌ది కాబట్టి నేనేమీ చెప్పలేను కానీ ఒక స్పిన్నర్‌ ఉంటే బాగుండేదని నా అభిప్రాయం. గెలుపోటములు ఆటలో భాగం. కాబట్టి ఈ మ్యాచ్‌ ఫలితం గురించి ఆలోచించడం లేదు’                               
– మొహమ్మద్‌ షమీ    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement